‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ రివ్యూ | Game Changer Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Game Changer Movie Review: ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ రివ్యూ

Published Fri, Jan 10 2025 8:05 AM | Last Updated on Fri, Jan 10 2025 10:05 AM

Game Changer Movie Review And Rating In Telugu

టైటిల్‌ : గేమ్‌ ఛేంజర్‌
నటీనటులు: రామ్‌ చరణ్‌, కియారా అద్వానీ, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, అంజలి, నవీన్‌ చంద్ర, నాజర్‌ తదితరులు
నిర్మాణ సంస్థలు:  శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
కథ: కార్తీక్‌ సుబ్బరాజ్‌
దర్శకత్వం-స్క్రీన్‌ప్లే: ఎస్‌. శంకర్‌
సంగీతం: తమన్‌
సినిమాటోగ్రఫీ: తిరు
విడుదల: జనవరి 10, 2025

Ram Charan Game Changer Movie HD Stills1

సంక్రాంతి టాలీవుడ్‌కి చాలా పెద్ద పండగ. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా పండక్కి మూడు భారీ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడుతున్నాయి. వాటిలో రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’(Game Chnager Review) నేడు(జనవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కించిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌, పాటలు ఆ అంచనాలను మరింత పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘గేమ్‌ ఛేంజర్‌’పై మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? శంకర్‌, చరణ్‌ ఖాతాలో బిగ్‌ హిట్‌ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.

Ram Charan Game Changer Movie HD Stills2

కథేంటంటే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి( శ్రీకాంత్) ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. రాష్ట్రంలో ఇకపై అవినీతి జరగొద్దని, నిజాయితీగా పని చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశిస్తాడు. సీఎం నిర్ణయం ఆయన కొడుకు, మైనింగ్‌ మినిస్టర్‌ బొబ్బిలి మోపిదేవి(ఎస్‌జే సూర్య)కి నచ్చదు. ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతిని కొనసాగిస్తుంటాడు. అంతేకాదు తండ్రిని తప్పించి సీఎం సీటులో కూర్చోవాలని కుట్ర చేస్తుంటాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఐపీఎస్‌గా విధులు నిర్వర్తిస్తూ.. సివిల్స్‌ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్‌గా సెలెక్ట్‌ అయిన రామ్‌ నందన్‌(రామ్‌ చరణ్‌).. విశాఖపట్నం కలెక్టర్‌గా బాధ్యతలు చేపడతాడు. జిల్లాలో అవినీతి, దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్‌ ఇస్తాడు.

ఈ క్రమంలో మంత్రి మోపిదేవి, కలెక్టర్‌ మధ్య వైరం ఏర్పడుతుంది. మరోవైపు సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఓ భారీ ట్విస్ట్‌ ఇస్తాడు. అదేంటి? అసలు సీఎం సత్యమూర్తిలో మార్పుకు గల కారణం ఏంటి? అప్పన్న(రామ్‌ చరణ్‌) ఎవరు? పార్వతి(అంజలి)తో కలిసి ఆయన పోరాటం ఏంటి? కలెక్టర్‌ రామ్‌కి అప్పన్నకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం సీటు కోసం మోపిదేవి చేసిన కుట్రలను రామ్‌ ఎలా అడ్డుకున్నాడు? ఒక ఐఏఎస్‌ అధికారిగా తనకున్న పవర్స్‌ని ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చాడు? దీపిక(కియారా అద్వానీ)తో రామ్‌ ప్రేమాయణం ఎలా సాంగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Ram Charan Game Changer Movie HD Stills4

ఎలా ఉందంటే..
శంకర్‌(Shankar) అద్భుతమైన ఫిల్మ్‌ డైరెక్టర్‌. అందులో డౌటే లేదు. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక సందేశం ఇచ్చేలా ఆయన సినిమాలు ఉంటాయి. జెంటిల్‌మెన్‌, ఒకే ఒక్కడు, భారతీయుడు, శివాజీ, అపరిచితుడు, రోబో లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలను అందించాడు. అయితే భారతీయుడు 2 రిలీజ్‌ తర్వాత శంకర్‌ మేకింగ్‌పై విపరీతమైన ట్రోల్స్‌ వచ్చాయి. బలమైన కథలు రాసుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి. ఆ ఎఫెక్ట్‌ గేమ్‌ ఛేంజర్‌(Game Changer Review)పై కూడా పడింది. కానీ మెగా ఫ్యాన్స్‌తో పాటు శంకర్‌ అభిమానులు కూడా ఈ చిత్రం ఆయనకు కమ్‌బ్యాక్‌ అవుతుందని ఆశ పడ్డారు. కానీ వారి ఆశ పూర్తిగా నెరవేరలేదనే చెప్పాలి. కార్తీక్‌ సుబ్బరాజ్‌ అందించిన రొటీన్‌ కథను అంతే రొటీన్‌గా తెరపై చూపించాడు.  

ఈ సినిమా నేపథ్యం అవినీతి రాజకీయ నేతకు, నిఖార్సయిన ఏఏఎస్‌ అధికారికి మధ్య జరిగే ఘర్షణ అని ట్రైలర్‌లోనే చూపించారు. అయితే ఆ ఘర్షణను ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. శంకర్‌ గత సినిమాలను గుర్తు చేసేలా కథనం సాగుతుంది. అలా అని బోర్‌ కొట్టదు. మదర్‌ సెంటిమెంట్‌, తండ్రి ఎపిసోడ్‌ సినిమాకు ప్లస్‌ అయిందనే చెప్పాలి.

Ram Charan Game Changer Movie HD Stills5

ఎలాంటి సాగదీతలు లేకుండా కథను చాలా సింపుల్‌గా ప్రారంభించాడు. హీరో పరిచయానికి మంచి సీన్‌ రాసుకున్నాడు. ఇక హీరో కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కథనంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. రామ్‌ చరణ్‌, ఎస్‌జే సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో హీరోయిన్‌తో వచ్చే లవ్‌ట్రాక్‌ ఆకట్టుకోకపోగా.. కథకు అడ్డంకిగా అనిపిస్తుంది. కాలేజీ ఎపిసోడ్‌ వర్కౌట్‌ కాలేదు. హీరోహీరోయిన్ల లవ్‌ట్రాక్‌కి ప్రేక్షకులు కనెక్ట్‌ కాకపోవడంతో ఆ సీన్స్‌ సాగదీతగా అనిపిస్తాయి. కలెక్టర్‌, మంత్రి మోపిదేవి మధ్య సాగే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి. సీఎం సీటు కోసం మోపిదేవి వేసే రాజకీయ ఎత్తులను ఐఏఎస్‌ అధికారిగా తనకున్న అధికారాలతో హీరో చెక్‌ పెట్టడం ఆకట్టుకుంటుంది.

ఇంటర్వెల్‌ సీన్‌ మాత్రం ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. విరామం ముందు వచ్చే ఓ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చేస్తుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే అప్పన్న ఎపిసోడ్‌ అందరిని ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత కథనం మళ్లీ ఊహకందేలా రొటీన్‌గా సాగుతుంది. మోపిదేవి, రామ్‌ నందన్‌ మధ్య సాగే టామ్‌ అండ్‌ జెర్రీ వార్‌ బాగానే ఉన్నా.. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోవు.  ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ బెటర్‌. 

ఎన్నికల అధికారి తనకున్న పవర్స్‌ని నిజాయితీగా వాడితే ఎలా ఉంటుందనేది తెరపై చక్కగా చూపించారు. క్లైమాక్స్‌ కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఈ చిత్రం ద్వారా ఎన్నికల వ్యవస్థకు, రాజకీయ పార్టీలతో పాటు ఓటర్లకు దర్శకుడు ఇచ్చిన సందేశం మాత్రం బాగుంది. అయితే ఆ సందేశాన్ని ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా బలంగా చూపించడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు.

Ram Charan Game Changer Movie HD Stills22

ఎవరెలా చేశారంటే..
రామ్‌ చరణ్‌(Ram Charan) నటన ఏంటో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసింది. మరోసారి ఆ రేంజ్‌ నటనతో ఆకట్టుకున్నాడు. అప్పన్న, రామ్‌ నందన్‌ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన చరణ్‌.. ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్‌ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అప్పన్న పాత్రలో చరణ్‌ అద్భుతంగా నటించేశాడు. యాక్షన్‌, ఎమోషన్‌ సీన్లలో అదరగొట్టేశాడు. చరణ్‌ తర్వాత సినిమాలో బాగా పండిన పాత్ర ఎస్‌జే సూర్యది. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పొలిటిషీయన్‌ బొబ్బిలి మోపిదేవిగా సూర్య తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సూర్యకు, చరణ్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అప్పన్న భార్య పార్వతిగా అంజలి అద్భుతంగా నటించింది. ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ భావోధ్వేగానికి గురి చేస్తుంది. 

Ram Charan Game Changer Movie HD Stills30

రామ్‌ నందన్‌ ప్రియురాలు దీపికగా కియరా అద్వానీ మెప్పించింది. తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా.. తనదైన అందచందాలతో ఆకట్టుకుంది. బొబ్బిలి సత్యమూర్తిగా శ్రీకాంత్‌, సైడ్‌ సత్యంగా సునీల్‌ ఉన్నంతలో చక్కగా నటించారు. అయితే సునీల్‌తో పాటు వెన్నెల కిశోర్‌ల కామెడీ మాత్రం సరిగ్గా పండలేదు. బ్రహ్మానందం ఒక్క సీన్‌లో కనిపిస్తారు. జయరాం, నవీన్‌ చంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. తమన్‌ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు వినడం కంటే తెరపై చూస్తే ఇంకా బాగా ఆకట్టుకుంటాయి. శంకర్‌ మార్క్‌ గ్రాండ్‌నెస్‌ ప్రతి పాటలోనూ కనిపించింది. సినిమాటోగ్రఫీ పని తీరు అద్భుతం. ప్రతి ఫ్రేమ్‌ తెరపై చాలా అందంగా, రిచ్‌గా కనిపిస్తుంది. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. ఎడిటింగ్ పర్వాలేదు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో దిల్‌ రాజు ఎక్కడా వెనకడుగు వేయలేదని సినిమా చూస్తుంటే అర్థమవుతుంది.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement