
పాల ధరలు భారం..
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికలు ముగిశాయో లేదో పెట్రో ధరల బాదుడు షురూ కాగా, తాజాగా నిత్యావసరమైన పాల ధరలు చుక్కలు చూస్తున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరగడంతో మంగళవారం నుంచి పాల ధరలు లీటర్‌కు రూ 2 మేర పెరుగుతాయని డైరీ దిగ్గజం అమూల్ ప్రకటించింది. ఢిల్లీ, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది.
మార్చి 2017లో పాల ధరలు పెంచిన తర్వాత మళ్లీ ఇప్పుడు ధరలను సవరించామని అమూల్ బ్రాండ్‌పై పాలు, పాల ఉత్పత్తులను విక్రయించే గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) ఓ ప్రకటనలో పేర్కొంది. తాజా ధరలు మే 21 నుంచి వర్తిస్తాయని తెలిపింది. పాల ఉత్పత్తి తగ్గడం, ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో పాల ధరల పెంపు అనివార్యమైందని జీసీఎంఎంఎఫ్ తెలిపింది.