ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: గత పాలకుల నిర్వాకం వల్ల మూతపడ్డ సహకార రంగంలోని పాల డెయిరీలను సాధ్యమైంత త్వరగా వినియోగంలోకి తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. మూతపడ్డ డెయిరీల్లోని యంత్రాలను అమూల్ సంస్థకు లీజుకివ్వడం ద్వారా రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం విధివిధానాలు రూపకల్పన చేసే బాధ్యతను ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ (ఏపీడీడీసీఎఫ్)కు అప్పగించింది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు.
యాజమాన్య హక్కులు ఏపీడీడీసీఎఫ్‌కే..
ఏపీడీడీసీఎఫ్ పరిధిలో జి.కొత్తపల్లి సహకార పాలడెయిరీ మినహా మిగిలిన అనంతపురం, హిందూపురం, రాజమండ్రి, కంకిపాడు, మదనపల్లె, పులివెందుల డెయిరీలు మూతపడ్డాయి. వీటిలో 60 వేల మంది పాల ఉత్పత్తిదారులుండగా, రోజుకు 2.5 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తయ్యేవి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు నాణ్యమైన పాల ఉత్పత్తి లక్ష్యంగా అమూల్ సంస్థతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇప్పటికే 4 రాష్ట్రాల్లో పాల సేకరణ చేస్తున్న ఈ సంస్థకు.. ఏపీలో ఇప్పటి వరకు మౌలిక సదుపాయాలు లేవు. రాష్ట్రంలో సేకరిస్తున్న పాలను కర్ణాటకలోని కూలింగ్ యూనిట్లకు తీసుకెళ్లి అక్కడ ప్రాసెసింగ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో మూత పడిన డెయిరీల్లోని యంత్ర పరికరాలను లీజుకు ఇవ్వడం ద్వారా అమూల్‌కు సహకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీడీడీసీఎఫ్ పంపిన లీజు ప్రతిపాదనలకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. మూతపడిన డెయిరీల్లో రూ.12 కోట్ల విలువైన 141 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, 8 మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, రెండు మిల్క్ చిల్లింగ్ సెంటర్లు, మదనపల్లెలోని యూహెచ్‌టీ ప్లాంట్, ఒంగోలులోని ఫాడర్ ప్లాంట్ ఉన్నాయి. రోజుకు 10.40 లక్షల లీటర్ల పాలను సేకరించి ప్రాసెస్ చేసే సామర్థ్యం వీటికి ఉంది. ఈ యంత్ర పరికరాలను లీజుకు ఇచ్చేందుకు విధివిధానాలు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఏ డెయిరీల్లో ఎలాంటి యంత్ర పరికరాలున్నాయి? వాటిలో ఎన్ని వినియోగంలో ఉన్నాయో పరిశీలిస్తారు. ఉత్పత్తి ఆధారంగా లీజు మొత్తాన్ని నిర్ధారించి అమూల్‌కు అప్పగిస్తారు. వాటిపై యాజమాన్య హక్కులు మాత్రం పూర్తిగా ఏపీడీడీసీఎఫ్‌కే ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment