
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమూల్ సంస్థతో కలిసి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయోగం సత్ఫలితాలనిస్తోంది. అదనపు ఆదాయంతో పాడి రైతు మోములో ఆనందం వెల్లివిరుస్తోంది. పైలట్ జిల్లాల్లో రోజుకు సగటున 25 వేల లీటర్లను సేకరిస్తుండగా, లీటర్‌పై రూ.5 నుంచి రూ.20ల వరకు అదనంగా లబ్ధి చేకూరుతుండడంతో పాల ఉత్పత్తిదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. దీంతో రెండో విడతగా ఈ ప్రాజెక్టును గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఇదీ రాష్ట్రంలో పరిస్థితి..
జాతీయ స్థాయిలో 15.04 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తితో నాలుగో స్థానంలో ఉన్న ఏపీ.. మార్కెటింగ్‌లో మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో 27లక్షల రైతు కుటుంబాల వద్ద 46 లక్షల ఆవులు, 62 లక్షల గేదెలున్నాయి. వాటిలో 21.47 లక్షల గేదెలు, 13.56 లక్షల ఆవుల ద్వారా రోజుకు 4.12 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. గృహావసరాలకు 1.24 కోట్ల లీటర్ల వినియోగమవుతుంటే, మార్కెట్‌లోకి 2.88 కోట్ల లీటర్ల పాలొస్తున్నాయి.
‘అమూల్’ ప్రాజెక్టుతో ఏపీలో పాల విప్లవం
వలసలకు అడ్డుకట్ట వేయడంతో పాటు గ్రామీణ మహిళల్లో ఆర్థిక సాధికారత కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమూల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్టుగా గత నెల 2న వైఎస్సార్ కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోని 400 గ్రామాల్లో పాల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు పైలెట్ జిల్లాల్లో 12,430 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో నాలుగు వేల మందికి పైగా రోజూ సగటున సుమారు 25వేల లీటర్ల చొప్పున రోజుకు 10లక్షల లీటర్ల పాలను అందిస్తున్నారు. వాటి నిమిత్తం రూ.4.68 కోట్లు చెల్లించారు. ఆవు పాలకు రూ.5–7, గేదె పాలకు రూ.7–20 వరకు అదనంగా లబ్ధిచేకూరడమే కాక పది రోజుల్లోనే డబ్బులు జమవుతుండడంతో అమూల్ ప్రాజెక్టులో చేరేందుకు రైతుల్లో ఆసక్తి పెరిగింది. అంతేకాక.. ఈ ప్రాజెక్టులో భాగంగా 9,899 రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్‌బీకే) రూ.1,250 కోట్లతో నిర్మిస్తున్న బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల (బీఎంసీయూ) కోసం రూ.1,672 కోట్లతో సర్కారు భవనాలు నిర్మిస్తోంది. వీటికి అనుసంధానంగా 17,950 గ్రామాల్లో ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లను (ఎఎంసీయూ) ఏర్పాటుచేస్తున్నారు.
లీటర్‌కు అదనంగా రూ.20 వస్తోంది
రోజుకు ఏడు లీటర్ల పాలను సాయిరాం డెయిరీకి పోసేవాళ్లం. లీటర్‌కు రూ.30–35మధ్య వచ్చేది. ప్రస్తుతం అమూల్ కేంద్రంలో పోస్తున్నాం. పాలలో 7 శాతం వెన్న ఉండడంతో బోనస్‌తో కలిపి సగటున ప్రస్తుతం లీటర్‌కు రూ.50ల నుంచి 55లు వస్తోంది.
– పి. మాధురి, వేముల, వేంపల్లి మండలం, వైఎస్సార్ కడప జిల్లా
చాలా సంతోషంగా ఉంది
నాకు మూడు జెర్సీ ఆవులున్నాయి. రోజుకు 18 లీటర్ల పాలను ప్రైవేటు డెయిరీలకు పోసేవాళ్లం. లీటరుకు రూ.25–26 వచ్చేది. ఇప్పుడు అమూల్ పాల కేంద్రానికి ఇస్తున్నాం. ప్రస్తుతం లీటర్‌కు రూ.30–31 వస్తోంది. గతంతో పోల్చుకుంటే మంచి రేటొస్తోంది.
– ఎస్. కలవతమ్మ, వేంపల్లి, మదనపల్లి, చిత్తూరు జిల్లా
రెండో విడతలో గుంటూరు, పశ్చిమగోదావరి
ఏపీ–అమూల్ ప్రాజెక్టుకు పాల ఉత్పత్తిదారుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు బాగా ఆసక్తి చూపుతున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన మూడు జిల్లాల్లో స్పందన బాగుంది. రెండో విడతలో పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఈ నెలాఖరు నుంచి పాల సేకరణకు ఏర్పాట్లుచేస్తున్నాం.
– ఎ. బాబు, ఎండీ, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్
ఆర్థిక స్వావలంబనకు పునాది
రాష్ట్రంలో పాల విప్లవం తీసుకురావడమే లక్ష్యం. పాల ఉత్పత్తిదారులకు మంచి ధర కల్పించడం, మార్కెట్లో పోటీని సృష్టించడం.. పాల సేకరణ, ఖర్చు, సరఫరా వ్యయం మధ్య అంతరాన్ని తగ్గించడం అమూల్ ప్రాజెక్టు లక్ష్యం. రానున్న 20–30 ఏళ్లలో గ్రామీణ ప్రాంత మహిళల్లో ఆర్థిక స్వావలంబనకు ఇది పునాది కానుంది.
– ఎంవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్ ఏపీ అగ్రి మిషన్
Comments
Please login to add a commentAdd a comment