
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి చెందిన లక్షలాది మహిళలకు వైఎస్సార్ చేయూత అండతో పాడి పశువుల ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే చేయూత మహిళల వద్ద ఉన్న పాడి పశువుల ద్వారా ఉత్పత్తి అయ్యే పాలను అమూల్ ద్వారా సేకరించి, సరైన ధర కల్పించడంతో పాటు పాడి పశువుల్లేని చేయూత మహిళలకు వాటిని కొనుగోలు చేసి పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు 4.90 లక్షల మంది మహిళలు పాడి పశువుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే పాడి పశువులు ఉన్న వారు 72,795 మంది మరికొన్నింటి కోసం దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మొత్తం 5.63 లక్షల పాడి పశువులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
► పాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న 9,899 రైతు భరోసా కేంద్రాలున్న గ్రామాలను గుర్తించి, వీటికి అనుబంధంగా బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలను మూడు దశల్లో నిర్మాణం చేయనుంది. మూడు దశల్లో రూ.1,362.22 కోట్ల వ్యయంతో 7,125 ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
► ఈ నిధులను జాతీయ కో–ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి 80 శాతం రుణంగా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మిగతా 20 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఐదు సెంట్ల విస్తీర్ణంలో ఒక్కో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్‌ను రూ.11 లక్షల వ్యయంతో, ఒక్కో పాల సేకరణ కేంద్రాన్ని రూ.4 లక్షల వ్యయంతో నిరి్మంచనున్నారు.
► తొలి దశలో 2,774 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను, 7,125 పాల సేకరణ కేంద్రాలను రూ.590.11 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. రెండో దశలో 3,639 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను రూ.327.51 కోట్లతో, మూడో దశలో 3,486 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను రూ.313.78 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment