వెటర్నరీ పోస్టులన్నీ భర్తీ | CM Jagan Orders In Review on Animal Husbandry, Dairy Development and Fisheries Departments | Sakshi
Sakshi News home page

వెటర్నరీ పోస్టులన్నీ భర్తీ

Published Tue, Mar 23 2021 3:10 AM | Last Updated on Tue, Mar 23 2021 10:03 AM

CM Jagan Orders In Review on Animal Husbandry, Dairy Development and Fisheries Departments - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మూగ జీవాలైన పశువుల సంరక్షణ, బాగోగులపై కూడా పెద్ద మనసుతో దృష్టి సారించింది. అనారోగ్యం బారిన పడకుండా పశువులను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్ల (పశువుల వైద్యులు) పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలతో వెటర్నరీ వైద్య సేవలను అనుసంధానించాలని సూచించారు. నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం వెటర్నరీ వైద్యులు తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రాల్లో సేవలందించాల్సిందేనని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఒక నిర్దిష్ట విధానం (ఎస్‌వోపీ) రూపొందించాలని అధికారులకు సూచించారు. ఆర్బీకేల్లో కియోస్క్‌ ద్వారా పశువుల దాణా, మందులు ఇవ్వాలన్నారు. సీడ్, ఫీడ్, మెడికేషన్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, నాసిరకం వాడకూడదని, కచ్చితంగా క్వాలిటీ మెయింటైన్‌ చేయాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న 6,099 పశు సంవర్ధక అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి కూడా ముఖ్యమంత్రి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 108 తరహాలో పశువులకు కూడా అంబులెన్స్‌ల ద్వారా వైద్య సేవలందించాలన్నారు. బయో పెస్టిసైడ్స్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, నాణ్యత విషయంలో రాజీ పడవద్దని అధికారులను ఆదేశించారు. పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖలపై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 
పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖలపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్‌. చిత్రంలో మంత్రులు కన్నబాబు, అప్పలరాజు 

నకిలీలకు అడ్డుకట్ట వేయాలి
కియోస్క్‌ల ద్వారా ఇప్పటికే ఫీడ్, సీడ్‌ సరఫరా చేస్తున్నామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. రైతులకు ఏది అవసరమో తెలియచెప్పడంతోపాటు వాటిని అందించాలని సీఎం సూచించారు. నకిలీలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. వైఎస్సార్‌ చేయూత ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న పశువులకు ఇనాఫ్‌ ట్యాగ్‌ చేయించాలని సూచించారు.

మూడు నెలలకోసారి బీమా పరిహారం క్లియర్‌ 
వైఎస్సార్‌ పశు నష్ట పరిహార పథకం వివరాలను ఆర్బీకేల్లో ప్రదర్శించి ప్రతి మూడు నెలలకోసారి బీమా పరిహారం క్లెయిమ్స్‌ క్లియర్‌ చేయాలని సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి రూ.98 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. పశువులకే  కాకుండా బీమాకు సంబంధించి అందరికీ 3 నెలలకు ఒకసారి పరిహారం క్లెయిమ్స్‌ పరిష్కరించాలన్నారు. ఈ విషయంలో కలెక్టర్లకు స్పష్టమైన సూచనలు చేయాలని, సీఎంవో అధికారులు సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. 

ఆర్బీకే కాల్‌ సెంటర్‌ పనితీరును తనిఖీ చేయాలి
ఆర్బీకేల ఇంటిగ్రేడెట్‌ కాల్‌ సెంటర్‌ నంబర్‌ 155251 సరిగా పనిచేస్తోందా? లేదా? అని ముఖ్యమంత్రి ఆరా తీశారు. కాల్‌ సెంటర్‌ నంబరు పనితీరుపై తరచూ తనిఖీ చేయాలని ఆదేశించారు. గ్యారెంటీ, టెస్టెడ్, క్వాలిటీ అని ప్రభుత్వ ముద్ర వేసి విత్తనాలు ఇస్తున్నామని, వీటి నాణ్యతలో ఎలాంటి తేడా రావడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు. ఆర్బీకేల ద్వారా ఇచ్చే ఇన్‌పుట్స్‌లో నాణ్యత లేకపోతే కచ్చితంగా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎం హెచ్చరించారు.

6,099 పశు సంవర్ధక అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఓకే
ఖాళీగా ఉన్న 6,099 పశుసంవర్ధక అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. పశు సంరక్షక్‌ యాప్‌ పనితీరును ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. యానిమల్‌ ఫీడ్‌ యాక్ట్‌ నేపథ్యంలో క్వాలిటీ సీడ్‌ ఇస్తున్నట్టు  అధికారులు వెల్లడించారు. 

జగనన్న పాలవెల్లువ, జీవక్రాంతి పథకాలు విస్తృతం
వైఎస్‌ఆర్‌ చేయూత కింద జగనన్న పాలవెల్లువ, జగనన్న జీవక్రాంతి పథకాల ద్వారా పశువులు, గొర్రెలు, మేకల పంపిణీపై సీఎం జగన్‌ సమీక్షించారు. బ్యాంకులతో సమన్వయం చేసుకుని ఈ పథకాలను మరింత విస్తృతంగా చేపట్టాలని సీఎం ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న మిగతా దరఖాస్తుదారులకు కూడా వీలైనంత త్వరగా బ్యాంకు రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

వచ్చే వారం గుంటూరులో అమూల్‌ పాల వెల్లువ
చిత్తూరు, వైఎస్‌ఆర్‌ కడప, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే ప్రారంభమైన పాలవెల్లువ కార్యక్రమం అమలు తీరును ముఖ్యమంత్రి పరిశీలించారు. వచ్చే వారం గుంటూరు జిల్లాలో అమూల్‌ పాలవెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్‌ ప్రాజెక్టు ప్రారంభం అవుతుందన్నారు.

ఇంటిగ్రేటెడ్‌ వెటర్నరీ లాబ్స్‌
వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ వెటర్నరీ లాబ్స్‌ ఏర్పాటు వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. భవనాలన్నీ జూన్‌ 1 నాటికి సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. కొత్తగా 21 ల్యాబ్‌ టెక్నీషియన్లు, 21 లాబ్‌ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్‌కు ఒకే కాల్‌సెంటర్, ఒకే నంబర్‌ ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. 

వెటర్నరీ ఆసుపత్రుల్లో నాడు–నేడు
నాడు– నేడు కింద వెటర్నరీ ఆసుపత్రుల నిర్మాణ పనులపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మూడు సంవత్సరాల్లో అన్ని పశు వైద్యశాలలు ఆధునీకరణ పూర్తి చేయాలని, నాడు–నేడు (పశు వైద్యశాలలు) కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 

మొబైల్‌ యాంబులేటరీ(వెటర్నరీ) సర్వీసెస్‌
108 తరహాలో పశువులకు కూడా అంబులెన్స్‌ల ద్వారా వైద్య సేవలు అందించాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. మొబైల్‌ యాంబులేటరీ (వెటర్నరీ) సర్వీసెస్‌ ఏర్పాటుపై సమావేశంలో చర్చించడంతో పాటు నియోజకవర్గానికి ఒక వాహనం మంజూరుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. తమిళనాడు తరహాలో మొబైల్‌ యాంబులేటరీ సర్వీసెస్‌ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించారు. దీని ద్వారా మారుమూల గ్రామాల్లో జబ్బు పడిన పశువులను సైతం ఆసుపత్రికి తరలించే వీలుంటుందన్నారు. 

కడక్‌నాథ్‌ పౌల్ట్రీ ఫాం పునరుద్ధరణ
వైఎస్సార్‌ కడప జిల్లా ఉటుకూరులో కడక్‌నాథ్‌ పౌల్ట్రీ ఫాం పునరుద్ధరణకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. కడక్‌నాథ్‌ చికెన్‌కు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.

గ్రామ ఫిషరీస్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ
మత్స్య శాఖపై సమీక్ష సందర్భంగా విలేజీ ఫిషరీష్‌ అసిస్టెంట్ల పోస్టుల భర్తీని వెంటనే పూర్తి చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఆక్వాసాగు చేసే చిన్న, సన్నకారు రైతులకు సబ్సిడీలు ఎక్కువగా అందాలని, మందులు కల్తీ కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు యాంటీ బయోటిక్స్‌ వాడకాన్ని తగ్గించాల్సిందిగా సీఎం ఆదేశించారు.  

అర్హులందరికీ వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా 
వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కింద అర్హులెవరూ ఈ పథకం వర్తించకుండా మిగిలిపోకూడదని, అదే సమయంలో అనర్హులకు పథకం అందకూడదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. జలాశయాల్లో కేజ్‌ కల్చర్‌పై ప్రత్యేక దృష్టి సారించి జలవనరులశాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. 

మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంపు
మత్స్య ఉత్పత్తుల స్ధానిక వినియోగాన్ని పెంపొందించేలా మార్కెటింగ్‌ చర్యలను వేగవంతం చేయాలని, మే నెల నాటికి ఇవి ప్రారంభం కావాలని సీఎం ఆదేశించారు. ఫేజ్‌ – 1 కింద జువ్వలదిన్నె, ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నంలలో ఫిషింగ్‌ హార్బర్ల పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఫేజ్‌ – 2 కింద బుడగట్ల పాలెం, కొత్తపట్నం, బియ్యపుతిప్ప, పూడిమడక, మంచినీళ్లపేటలలో కొత్త ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం వివరాలను అధికారులు సీఎంకు వెల్లడించారు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునీకరణ పనులు, ఏపీ ఫిషరీస్‌ యూనివర్సిటీ ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. 

– సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, వ్యవసాయ, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కో ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ ఎండీ బాబు.ఏ, మత్స్యశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు, పశు సంవవర్ధకశాఖ డైరెక్టర్‌ అమరేంద్ర కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement