veterinary posts
-
పశుఆరోగ్య సేవా రథాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాల్లో పశు వైద్యులు, పారా వెట్లు, డ్రైవర్లుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని అంబులెన్స్‌ల ప్రాంతీయ పర్యవేక్షకుడు అనిల్ కుమార్ ఓ ప్రకటనలో కోరారు. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పనిచేసేందుకు సిబ్బంది కావాలని తెలిపారు. ప్రతీ జిల్లాలో ఎనిమిది మంది పశువైద్యులు, ఎనిమిది మంది పారా వెట్(వెటర్నరీ టెక్నీషియన్)లు, ఎనిమిది మంది పైలట్ల(డ్రైవర్లు) చొప్పున మొత్తం 144 మంది సిబ్బంది అవసరమన్నారు. వెటర్నరీ వైద్యుల పోస్టులకు బ్యాచలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ విద్యార్హత కలిగి ఉండాలని, కొత్తగా పట్టా పొందిన వారితో పాటు రిటైర్డ్ డాక్టర్లు కూడా అర్హులే అన్నారు. పారా వెట్ పోస్టులకు డిప్లమో ఆఫ్ వెటర్నరీ సైన్స్ విద్యార్హత కలిగి 30 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. ఇక పైలట్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండి, హెచ్ఎంవీ లైసెన్సుతో కనీసం 2–3 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలని, 35 ఏళ్ల లోపు వారై ఉండాలని తెలిపారు. ఆసక్తి గల వారు విజయవాడలోని ముత్యాలంపాడు వీధిలోని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో ఈ నెల 22, 23 తేదీల్లో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 9154984484లో సంప్రదించాలన్నారు. -
వెటర్నరీ పోస్టులన్నీ భర్తీ
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మూగ జీవాలైన పశువుల సంరక్షణ, బాగోగులపై కూడా పెద్ద మనసుతో దృష్టి సారించింది. అనారోగ్యం బారిన పడకుండా పశువులను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్ల (పశువుల వైద్యులు) పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలతో వెటర్నరీ వైద్య సేవలను అనుసంధానించాలని సూచించారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వెటర్నరీ వైద్యులు తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రాల్లో సేవలందించాల్సిందేనని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఒక నిర్దిష్ట విధానం (ఎస్వోపీ) రూపొందించాలని అధికారులకు సూచించారు. ఆర్బీకేల్లో కియోస్క్ ద్వారా పశువుల దాణా, మందులు ఇవ్వాలన్నారు. సీడ్, ఫీడ్, మెడికేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, నాసిరకం వాడకూడదని, కచ్చితంగా క్వాలిటీ మెయింటైన్ చేయాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న 6,099 పశు సంవర్ధక అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కూడా ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 108 తరహాలో పశువులకు కూడా అంబులెన్స్‌ల ద్వారా వైద్య సేవలందించాలన్నారు. బయో పెస్టిసైడ్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, నాణ్యత విషయంలో రాజీ పడవద్దని అధికారులను ఆదేశించారు. పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖలపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖలపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రులు కన్నబాబు, అప్పలరాజు నకిలీలకు అడ్డుకట్ట వేయాలి కియోస్క్‌ల ద్వారా ఇప్పటికే ఫీడ్, సీడ్ సరఫరా చేస్తున్నామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. రైతులకు ఏది అవసరమో తెలియచెప్పడంతోపాటు వాటిని అందించాలని సీఎం సూచించారు. నకిలీలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న పశువులకు ఇనాఫ్ ట్యాగ్ చేయించాలని సూచించారు. మూడు నెలలకోసారి బీమా పరిహారం క్లియర్ వైఎస్సార్ పశు నష్ట పరిహార పథకం వివరాలను ఆర్బీకేల్లో ప్రదర్శించి ప్రతి మూడు నెలలకోసారి బీమా పరిహారం క్లెయిమ్స్ క్లియర్ చేయాలని సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి రూ.98 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. పశువులకే కాకుండా బీమాకు సంబంధించి అందరికీ 3 నెలలకు ఒకసారి పరిహారం క్లెయిమ్స్ పరిష్కరించాలన్నారు. ఈ విషయంలో కలెక్టర్లకు స్పష్టమైన సూచనలు చేయాలని, సీఎంవో అధికారులు సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆర్బీకే కాల్ సెంటర్ పనితీరును తనిఖీ చేయాలి ఆర్బీకేల ఇంటిగ్రేడెట్ కాల్ సెంటర్ నంబర్ 155251 సరిగా పనిచేస్తోందా? లేదా? అని ముఖ్యమంత్రి ఆరా తీశారు. కాల్ సెంటర్ నంబరు పనితీరుపై తరచూ తనిఖీ చేయాలని ఆదేశించారు. గ్యారెంటీ, టెస్టెడ్, క్వాలిటీ అని ప్రభుత్వ ముద్ర వేసి విత్తనాలు ఇస్తున్నామని, వీటి నాణ్యతలో ఎలాంటి తేడా రావడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు. ఆర్బీకేల ద్వారా ఇచ్చే ఇన్‌పుట్స్‌లో నాణ్యత లేకపోతే కచ్చితంగా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎం హెచ్చరించారు. 6,099 పశు సంవర్ధక అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఓకే ఖాళీగా ఉన్న 6,099 పశుసంవర్ధక అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పశు సంరక్షక్ యాప్ పనితీరును ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. యానిమల్ ఫీడ్ యాక్ట్ నేపథ్యంలో క్వాలిటీ సీడ్ ఇస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. జగనన్న పాలవెల్లువ, జీవక్రాంతి పథకాలు విస్తృతం వైఎస్ఆర్ చేయూత కింద జగనన్న పాలవెల్లువ, జగనన్న జీవక్రాంతి పథకాల ద్వారా పశువులు, గొర్రెలు, మేకల పంపిణీపై సీఎం జగన్ సమీక్షించారు. బ్యాంకులతో సమన్వయం చేసుకుని ఈ పథకాలను మరింత విస్తృతంగా చేపట్టాలని సీఎం ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న మిగతా దరఖాస్తుదారులకు కూడా వీలైనంత త్వరగా బ్యాంకు రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే వారం గుంటూరులో అమూల్ పాల వెల్లువ చిత్తూరు, వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే ప్రారంభమైన పాలవెల్లువ కార్యక్రమం అమలు తీరును ముఖ్యమంత్రి పరిశీలించారు. వచ్చే వారం గుంటూరు జిల్లాలో అమూల్ పాలవెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్ ప్రాజెక్టు ప్రారంభం అవుతుందన్నారు. ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ లాబ్స్ వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ లాబ్స్ ఏర్పాటు వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. భవనాలన్నీ జూన్ 1 నాటికి సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. కొత్తగా 21 ల్యాబ్ టెక్నీషియన్లు, 21 లాబ్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్‌కు ఒకే కాల్‌సెంటర్, ఒకే నంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వెటర్నరీ ఆసుపత్రుల్లో నాడు–నేడు నాడు– నేడు కింద వెటర్నరీ ఆసుపత్రుల నిర్మాణ పనులపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మూడు సంవత్సరాల్లో అన్ని పశు వైద్యశాలలు ఆధునీకరణ పూర్తి చేయాలని, నాడు–నేడు (పశు వైద్యశాలలు) కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. మొబైల్ యాంబులేటరీ(వెటర్నరీ) సర్వీసెస్ 108 తరహాలో పశువులకు కూడా అంబులెన్స్‌ల ద్వారా వైద్య సేవలు అందించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మొబైల్ యాంబులేటరీ (వెటర్నరీ) సర్వీసెస్ ఏర్పాటుపై సమావేశంలో చర్చించడంతో పాటు నియోజకవర్గానికి ఒక వాహనం మంజూరుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. తమిళనాడు తరహాలో మొబైల్ యాంబులేటరీ సర్వీసెస్ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించారు. దీని ద్వారా మారుమూల గ్రామాల్లో జబ్బు పడిన పశువులను సైతం ఆసుపత్రికి తరలించే వీలుంటుందన్నారు. కడక్‌నాథ్ పౌల్ట్రీ ఫాం పునరుద్ధరణ వైఎస్సార్ కడప జిల్లా ఉటుకూరులో కడక్‌నాథ్ పౌల్ట్రీ ఫాం పునరుద్ధరణకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. కడక్‌నాథ్ చికెన్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామ ఫిషరీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ మత్స్య శాఖపై సమీక్ష సందర్భంగా విలేజీ ఫిషరీష్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీని వెంటనే పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆక్వాసాగు చేసే చిన్న, సన్నకారు రైతులకు సబ్సిడీలు ఎక్కువగా అందాలని, మందులు కల్తీ కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు యాంటీ బయోటిక్స్ వాడకాన్ని తగ్గించాల్సిందిగా సీఎం ఆదేశించారు. అర్హులందరికీ వైఎస్ఆర్ మత్స్యకార భరోసా వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద అర్హులెవరూ ఈ పథకం వర్తించకుండా మిగిలిపోకూడదని, అదే సమయంలో అనర్హులకు పథకం అందకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. జలాశయాల్లో కేజ్ కల్చర్‌పై ప్రత్యేక దృష్టి సారించి జలవనరులశాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంపు మత్స్య ఉత్పత్తుల స్ధానిక వినియోగాన్ని పెంపొందించేలా మార్కెటింగ్ చర్యలను వేగవంతం చేయాలని, మే నెల నాటికి ఇవి ప్రారంభం కావాలని సీఎం ఆదేశించారు. ఫేజ్ – 1 కింద జువ్వలదిన్నె, ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నంలలో ఫిషింగ్ హార్బర్ల పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఫేజ్ – 2 కింద బుడగట్ల పాలెం, కొత్తపట్నం, బియ్యపుతిప్ప, పూడిమడక, మంచినీళ్లపేటలలో కొత్త ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వివరాలను అధికారులు సీఎంకు వెల్లడించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ పనులు, ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. – సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, వ్యవసాయ, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీ బాబు.ఏ, మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, పశు సంవవర్ధకశాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
541 పశు వైద్య పోస్టుల భర్తీ
► 2న నోటిఫికేషన్: తలసాని ► టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని వెల్లడి ► విద్యార్థులను రెచ్చగొడుతున్న ప్రతిపక్షాలు సాక్షి, హైదరాబాద్: పశుసంవర్థక శాఖలో ఖాళీగా ఉన్న 541 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి వచ్చే నెల 2న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేస్తుందని ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. అంతేగాక గొర్రెల పంపిణీ పథకంలో పనిచేసేందుకు ఉద్యోగ విరమణ పొందిన 300 మంది పారా వెటర్నరీ అధికారులను కాంట్రాక్టు విధానంలో నియమిస్తామన్నారు. శనివారం సచివాలయంలో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. వెటర్నరీ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. పదిహేనేళ్లు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా, ఇప్పుడు స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని ప్రతిపక్ష పార్టీలు చిల్లర డ్రామాలతో విద్యార్థులను ఆందోళనల వైపు ఉసిగొల్పుతున్నాయని విమర్శించారు. గతేడాదే 276 వెటర్నరీ అసిస్టెంట్ ఖాళీల భర్తీ అనుమతిచ్చినా, విద్యార్థులు కోర్టుకెళ్లడంతో ఐదారు నెలల సమయం వృథా అయిందన్నారు. ఆ తర్వాత రాత పరీక్ష నిర్వహించి అర్హులైన 162 మందిని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లుగా నియమించినట్లు టీఎస్పీఎస్సీ ప్రభుత్వానికి జాబితా పంపించిందన్నారు. వీరిలో ముగ్గురు చేరలేదన్నారు. జోనల్ విధానం కారణంగా కాంట్రాక్టు విధానంపై ఉద్యోగ నియామకాలు చేపట్టామని, దీనికి సంబంధించి ఆందోళన చేస్తున్న విద్యార్థులను పిలిపించి మాట్లాడానన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులతో వారంలో సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తానన్నారు. అసలు గొర్రెలు పంపిణీ చేయకుండానే అందులో అవినీతి జరిగిందంటూ ప్రతిపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. సంచార పశు వైద్య వాహనం పరిశీలన... మెరుగైన పశు వైద్య సేవలు రైతు చెంతకు చేర్చేందుకు సంచార పశు వైద్య వాహనాలను నియోజకవర్గానికి ఒకటి చొప్పున 100 వాహనాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. సచివాలయంలో ఆ వాహనాలను ఆయన పరిశీలించారు. ఇందులో పశువైద్యుడు, వెటర్నరీ అసిస్టెంట్, సహాయకుడు ఉంటారన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రైతులు 1962 నంబర్‌కు కాల్ చేస్తే వెంటనే ఈ వాహనం అక్కడికి చేరుకొని వైద్య సేవలు అందిస్తుందన్నారు. జీవీకే సంస్థ ద్వారా ఈ సేవలు అందించనున్నట్లు చెప్పారు. ఒక్కో వాహనాన్ని రూ. 14.65 లక్షల వ్యయంతో కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
పశు వైద్య పట్టభద్రుల చర్చలు విఫలం
ఈ నెల 25న మరోమారు మంత్రి తలసానితో భేటీ! సాక్షి, హైదరాబాద్: తమ డిమాండ్ల సాధనకై 11 రోజులుగా సమ్మె చేస్తున్న పశువైద్య పట్టభద్రులతో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ గురువారం జరిపిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పశువైద్యుల పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని, నియామక ప్రక్రియను టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ(డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ) ద్వారా చేపట్టాలని పశువైద్య పట్టభద్రులు డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలోని పశుసంపద కేంద్రాలను పశు వైద్యశాలలుగా మార్చాలని, వైద్య సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా శాశ్వత ప్రాతిపదికన నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఖాళీగా ఉన్న పశువైద్యుల పోస్టులు, నియామకానికి సంబంధించిన విధి విధానాలేమిటో తెలిపాలని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లును మంత్రి తలసాని ఆదేశించారు. అయితే, పశువైద్య పోస్టుల ఖాళీలు, నియామక ప్రక్రియకు సంబంధించిన సాంకేతిక సమస్యలను సమీకరించేందుకు గడువు కావాలని డైరెక్టర్ మంత్రిని కోరారు. దీంతో ఈ నెల 25లోగా వివరాలను సమర్పించాలని, తదుపరి చర్చల నిమిత్తం 25న మరోమారు భేటీ కావాలని మంత్రి నిర్ణయించారు. అయితే తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు తాము చేస్తున్న సమ్మెను కొనసాగించాలని పశువైద్య పట్టభద్రులు నిర్ణయించారు. మంత్రిని కలసిన వారిలో పశువైద్య పట్టభద్రులు కాటం శ్రీధర్, మౌనిక, అభిలాశ్, పురుషోత్తమ్ నాయక్ తదితరులున్నారు. -
టీఎస్పీఎస్సీ ద్వారానే పశువైద్య పోస్టుల భర్తీ
♦ ప్రభుత్వం నిర్ణయం... ♦ విద్యార్థుల ఆందోళనలు బేఖాతర్ సాక్షి, హైదరాబాద్: పశువైద్య పోస్టులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారానే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చింది. మొత్తం 276 పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనుంది. సాంకేతికపరమైన అంశాలను సరిదిద్ది త్వరలో నోటిఫికేషన్ జారీచేయనుంది. పశు వైద్య విశ్వవిద్యాలయం ద్వారానే ఈ పోస్టులను భర్తీ చేయాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతోపాటు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని ఇటీవల కొందరు నిరసనకారులు అడ్డుకున్నారు. ఇప్పటివరకు పోస్టులను విశ్వవిద్యాలయం ద్వారానే భర్తీ చేశారని... టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తే తమకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళనకు దిగారు. కానీ టీచర్ పోస్టుల భర్తీ సహా అన్నింటినీ టీఎస్పీఎస్సీకి అప్పగిస్తున్నందున వీటినీ అలాగే భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. అయితే పాత పద్ధతిలో పోస్టుల భర్తీకి సంబంధించి మూడు జీవోలు ఉన్నాయి. వెయిటేజీ జీవో, విశ్వవిద్యాలయమే భర్తీ చేసుకునే వీలు కల్పించే జీవో వంటి వాటిని రద్దు చేశాక ఈ పోస్టులను టీఎస్పీఎస్సీకి అప్పగిస్తూ మరో జీవోను తీసుకురానున్నారు. ఆ తర్వాత విశ్వవిద్యాలయం నుంచి రూల్ ఆఫ్ రిజర్వేషన్, సిలబస్ సహా ఇతర వివరాలన్నింటినీ టీఎస్పీఎస్సీకి అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఉద్యాన యూనివర్సిటీలో 50 అధ్యాపక, 22 అధ్యాపకేతర పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపారు. త్వరలో వీటికి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. -
వైద్యుల కొరత.. సేవల వెత
పశువైద్య శాలల్లో వైద్యుల పోస్టులు ఖాళీ మొక్కుబడిగా అందుతున్న వైద్య సేవలు పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యం అయోమయంలో పశు పోషకులు జహీరాబాద్: పశు సంవర్ధక శాఖ జహీరాబాద్ సబ్ డివిజన్ పరిధిలో పశువైద్య పోస్టులు ఖాళీగా ఉండడంతో పశువులకు మొక్కుబడిగానే వైద్య సహాయం అందుతోంది. పోస్టులను భర్తీ చేసే విషయంలో ప్రభుత్వం, అధికారులు ఉదాసీన వైఖరిని అవలంబిస్తుండడంతో పశు పోషకుల పాలిట శాపంగా మారింది. సబ్ డివిజన్ పరిధిలోని జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల పరిధిలో 11 పశు వైద్య శాలలకు వైద్యులు లేరు. దీంతో సిబ్బందే పశువులకు వైద్య సేవలు అందిస్తున్నారు. జహీరాబాద్ మండలంలోని చిరాగ్పల్లి పశు వైద్య శాల వైద్యుడు పటాన్‌చెరుకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. దీంతో పశువైద్య శాలలో సిబ్బంది వైద్యం అందిస్తున్నందున తగిన వైద్య సేవలు అందడం లేదని పరిసర గ్రామాల పశు పోషకులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోహీర్ మండలంలోని దిగ్వాల్ గ్రామ పశువైద్యుడు దీర్ఘకాలిక సెలవులో ఉన్నందున సిబ్బందితోనే సరిపెడుతున్నారు. ఝరాసంగం మండలంలోని జీర్లపల్లి పశువైద్య శాలను అప్‌గ్రేడ్ చేశారు. అయినా అక్కడ ఇంత వరకు వైద్యుడిని నియమించలేదు. డాక్టర్ పోస్టు మంజూరైనా రెండు సంవత్సరాలుగా భర్తీ చేసే విషయంలో జాప్యం జరుగుతోంది. న్యాల్కల్ మండలంలోని మిర్జాపూర్‌లో గత ఏడాదిగా డాక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. అయినా పోస్టును భర్తీ చేసే విషయంలో అధికారులు ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నారని పశు పోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాల్కిలో పశువైద్య శాలను అప్ గ్రేడ్ చేయడంతో ఆస్పత్రి స్థాయి పెరిగింది. అయినా రెండేళ్లుగా పోస్టును భర్తీ చేసే విషయంలో ఎవరూ పట్టించుకోని పరిస్థితి నెలకొంది. నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండలంలోని బోరంచ పశువైద్య శాలలో ఏకంగా దశాబ్ద కాలంగా వైద్యుడి పోస్టు ఖాళీగానే ఉంది. భర్తీ చేసేందుకు గాను ప్రభుత్వం, అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. నాగల్గిద్దలో సైతం ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా దశాబ్ద కాలంగా వైద్యుడి పోస్టును భర్తీ చేయలేదు. కసర్‌గుత్తిలో పశువైద్య శాలను అప్‌గ్రేడ్ చేసి రెండు సంవత్సరాలు అయింది. ఇంత వరకు వైద్యుడి పోస్టును భర్తీ చేయలేదు. నారాయణఖేడ్ మండలంలోని రుద్రార్ గ్రామంలో గల పశువైద్య శాల అప్‌గ్రేడ్ అయింది. రెండు సంవత్సరాలు గడుస్తున్నా వైద్యుడిని నియమించలేదు. కంగ్టి పశువైద్య శాలలో నాల్గేళ్లుగా, కల్హేర్‌లో ఏడాదిగా, సిర్గాపూర్‌లో దశాబ్దంగా పశు వైద్యుల పోస్టులను భర్తీ చేయడం లేదు. సబ్ డివిజన్ పరిధిలో ఎల్ఏఎస్ పోస్టులు 9, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు 15, అటెండర్ పోస్టులు 10 వంతున ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టులను భర్తీ చేసే విషయంలో సంబంధిత శాఖ అధికారులు ఉదాసీన వైఖరిని అవలంబిస్తుండడం పశు పోషకుల పాలిట శాపంగా మారింది. పశు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్న వైశ్య శాలల్లో జేవీఓ, ఎల్ఎస్ఏలు వైద్య సేవలందిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి ఖాళీగా ఉన్న వైద్య పోస్టులతో పాటు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయించి పశువులకు మెరుగైన వైద్య సేవలందించే విధంగా చర్యలు చేపట్టాలని పశు పోషకులు కోరుతున్నారు. -
వెటర్నరీ పోస్టులకు ముగిసిన గడువు
సాక్షి,హైదరాబాద్: ప్రొద్దుటూరు, కోరుట్ల వెటర్నరీ కాలేజీల విద్యార్థుల భవితవ్యంపై ఆశలు చిగురిస్తున్నాయి. వీరికి వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) శాశ్వత రిజిస్టేషన్ లేకపోయినా,ప్రొవిజెనల్ రిజిస్ట్రేషన్ మీదే వీరిని ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు పశుసంవర్థక శాఖ సుముఖంగా ఉంది. ఆమేరకు శాఖ డెరైక్టర్ డాక్టర్ డి.వెంకటేశ్వర్లు పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శికి సోమవారం ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం ఆ ఫైలు తుది అనుమతుల కోసం సీఎం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఈ కాలేజీల విద్యార్థులు కూడా వెటర్నరీ డాక్టర్ ఉద్యోగాలకు అర్హులవుతారు. ఖాళీగా ఉన్న 469 వెటర్నరీ డాక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే గడువు సోమవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ కాలేజీల విద్యార్థులను కూడా ‘ప్రొవిజెనల్ రిజిస్ట్రేషన్’ ప్రాతిపదికన ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు పశుసంవర్థక శాఖ సుముఖత వ్యక్తం చేసింది. కోరుట్ల, ప్రొద్దుటూరు కాలేజీల్లో నిబంధనల మేరకు వసతులు లేని కారణంగా ఆ కాలేజీల గుర్తింపును వీసీఐ రద్దు చేసిన విషయం విదితమే. రెండు కాలేజీల నుంచి ఈ సంవత్సరమే తొలి బ్యాచ్ విద్యార్థులు ఐదేళ్ల డిగ్రీని పూర్తి చేసుకున్నారు. వీసీఐ రిజిస్ట్రేషన్ ఉంటేనే వారి డిగ్రీలు చెల్లుబాటు అవుతాయి. దాంతో వీరి భవితవ్యం ప్రశ్నార్థకమయిన సంగతి తెలిసిందే. ఉపశమనం తాత్కాలికమే: ప్రస్తుతానికి ‘ప్రొవిజెనల్ రిజిస్ట్రేషన్’ ప్రాతిపదికన వీరికి ఉద్యోగాలు ఇచ్చినా ఇది సమస్యకు పూర్తి పరిష్కారం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైద్యులకయితే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, పశువైద్యులకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. డిగ్రీ పూర్తయినప్పటికీ, రిజిస్ట్రేషన్ లేకుండా వీరు ప్రైవేటు ప్రాక్టీసు కూడా చేయకూడదు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ లేని విద్యార్థులకు ప్రస్తుతానికి ఉద్యోగావకాశాలు కల్పించినా, వారు పూర్తి స్థాయి విధుల నిర్వహణ చేయాలంటే వీసీఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ లోగా వీసీఐ నుంచి కోరుట్ల, ప్రొద్దుటూరు కాలేజీలకు అనుమతులు సాధించి, ఈ విద్యార్థుల సర్టిఫికెట్లకు వీసీఐ రిజిస్ట్రేషన్ తెచ్చుకుంటేనే సమస్య పరిష్కారమవుతుందని యూనివర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. నవంబర్ మొదటి వారంలో రండి - వీసీఐకి లేఖ విద్యార్థుల ఉద్యోగావకాశాలు, భవిషత్తును దృష్టిలో ఉంచుకుని నవంబర్ తొలి వారంలోనే ఈ కాలేజీలను తనిఖీ చేసి తగిన అనుమతులివ్వాలని పశుసంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి వీసీఐకి సోమవారం లేఖ రాశారు. వీసీఐ నిర్దేశించిన అన్ని వసతులను ప్రొద్దుటూరు, కోరుట్ల కాలేజీల్లో కల్పించామని, పూర్తిస్థాయిలో బోధనా సిబ్బంది ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. కాలేజీ, హస్టల్ భవనాల నిర్మాణంతో సహా మిగతా సౌకర్యాల కల్పన కూడా పూర్తిచేశామన్నారు. విద్యార్థుల భవిషత్ దృష్ట్యా కాలేజీల అనుమతుల మంజూరుపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం వెలువరించాలని ఆయన వీసీఁఊఐని కోరారు.