♦ ప్రభుత్వం నిర్ణయం...
♦ విద్యార్థుల ఆందోళనలు బేఖాతర్
సాక్షి, హైదరాబాద్: పశువైద్య పోస్టులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారానే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చింది. మొత్తం 276 పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనుంది. సాంకేతికపరమైన అంశాలను సరిదిద్ది త్వరలో నోటిఫికేషన్ జారీచేయనుంది. పశు వైద్య విశ్వవిద్యాలయం ద్వారానే ఈ పోస్టులను భర్తీ చేయాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతోపాటు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని ఇటీవల కొందరు నిరసనకారులు అడ్డుకున్నారు.
ఇప్పటివరకు పోస్టులను విశ్వవిద్యాలయం ద్వారానే భర్తీ చేశారని... టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తే తమకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళనకు దిగారు. కానీ టీచర్ పోస్టుల భర్తీ సహా అన్నింటినీ టీఎస్‌పీఎస్సీకి అప్పగిస్తున్నందున వీటినీ అలాగే భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. అయితే పాత పద్ధతిలో పోస్టుల భర్తీకి సంబంధించి మూడు జీవోలు ఉన్నాయి. వెయిటేజీ జీవో, విశ్వవిద్యాలయమే భర్తీ చేసుకునే వీలు కల్పించే జీవో వంటి వాటిని రద్దు చేశాక ఈ పోస్టులను టీఎస్‌పీఎస్సీకి అప్పగిస్తూ మరో జీవోను తీసుకురానున్నారు.
ఆ తర్వాత విశ్వవిద్యాలయం నుంచి రూల్ ఆఫ్ రిజర్వేషన్, సిలబస్ సహా ఇతర వివరాలన్నింటినీ టీఎస్‌పీఎస్సీకి అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఉద్యాన యూనివర్సిటీలో 50 అధ్యాపక, 22 అధ్యాపకేతర పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపారు. త్వరలో వీటికి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.