541 పశు వైద్య పోస్టుల భర్తీ
► 2న నోటిఫికేషన్: తలసాని
► టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని వెల్లడి
► విద్యార్థులను రెచ్చగొడుతున్న ప్రతిపక్షాలు
సాక్షి, హైదరాబాద్: పశుసంవర్థక శాఖలో ఖాళీగా ఉన్న 541 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి వచ్చే నెల 2న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేస్తుందని ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. అంతేగాక గొర్రెల పంపిణీ పథకంలో పనిచేసేందుకు ఉద్యోగ విరమణ పొందిన 300 మంది పారా వెటర్నరీ అధికారులను కాంట్రాక్టు విధానంలో నియమిస్తామన్నారు. శనివారం సచివాలయంలో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. వెటర్నరీ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. పదిహేనేళ్లు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా, ఇప్పుడు స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని ప్రతిపక్ష పార్టీలు చిల్లర డ్రామాలతో విద్యార్థులను ఆందోళనల వైపు ఉసిగొల్పుతున్నాయని విమర్శించారు.
గతేడాదే 276 వెటర్నరీ అసిస్టెంట్ ఖాళీల భర్తీ అనుమతిచ్చినా, విద్యార్థులు కోర్టుకెళ్లడంతో ఐదారు నెలల సమయం వృథా అయిందన్నారు. ఆ తర్వాత రాత పరీక్ష నిర్వహించి అర్హులైన 162 మందిని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లుగా నియమించినట్లు టీఎస్‌పీఎస్సీ ప్రభుత్వానికి జాబితా పంపించిందన్నారు. వీరిలో ముగ్గురు చేరలేదన్నారు. జోనల్ విధానం కారణంగా కాంట్రాక్టు విధానంపై ఉద్యోగ నియామకాలు చేపట్టామని, దీనికి సంబంధించి ఆందోళన చేస్తున్న విద్యార్థులను పిలిపించి మాట్లాడానన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులతో వారంలో సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తానన్నారు. అసలు గొర్రెలు పంపిణీ చేయకుండానే అందులో అవినీతి జరిగిందంటూ ప్రతిపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
సంచార పశు వైద్య వాహనం పరిశీలన...
మెరుగైన పశు వైద్య సేవలు రైతు చెంతకు చేర్చేందుకు సంచార పశు వైద్య వాహనాలను నియోజకవర్గానికి ఒకటి చొప్పున 100 వాహనాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. సచివాలయంలో ఆ వాహనాలను ఆయన పరిశీలించారు. ఇందులో పశువైద్యుడు, వెటర్నరీ అసిస్టెంట్, సహాయకుడు ఉంటారన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రైతులు 1962 నంబర్‌కు కాల్ చేస్తే వెంటనే ఈ వాహనం అక్కడికి చేరుకొని వైద్య సేవలు అందిస్తుందన్నారు. జీవీకే సంస్థ ద్వారా ఈ సేవలు అందించనున్నట్లు చెప్పారు. ఒక్కో వాహనాన్ని రూ. 14.65 లక్షల వ్యయంతో కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.