పశువైద్య శాలల్లో వైద్యుల పోస్టులు ఖాళీ
మొక్కుబడిగా అందుతున్న వైద్య సేవలు
పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యం
అయోమయంలో పశు పోషకులు
జహీరాబాద్: పశు సంవర్ధక శాఖ జహీరాబాద్ సబ్ డివిజన్ పరిధిలో పశువైద్య పోస్టులు ఖాళీగా ఉండడంతో పశువులకు మొక్కుబడిగానే వైద్య సహాయం అందుతోంది. పోస్టులను భర్తీ చేసే విషయంలో ప్రభుత్వం, అధికారులు ఉదాసీన వైఖరిని అవలంబిస్తుండడంతో పశు పోషకుల పాలిట శాపంగా మారింది. సబ్ డివిజన్ పరిధిలోని జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల పరిధిలో 11 పశు వైద్య శాలలకు వైద్యులు లేరు. దీంతో సిబ్బందే పశువులకు వైద్య సేవలు అందిస్తున్నారు. జహీరాబాద్ మండలంలోని చిరాగ్‌పల్లి పశు వైద్య శాల వైద్యుడు పటాన్‌చెరుకు డిప్యూటేషన్‌పై వెళ్లారు.
దీంతో పశువైద్య శాలలో సిబ్బంది వైద్యం అందిస్తున్నందున తగిన వైద్య సేవలు అందడం లేదని పరిసర గ్రామాల పశు పోషకులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోహీర్ మండలంలోని దిగ్వాల్ గ్రామ పశువైద్యుడు దీర్ఘకాలిక సెలవులో ఉన్నందున సిబ్బందితోనే సరిపెడుతున్నారు. ఝరాసంగం మండలంలోని జీర్లపల్లి పశువైద్య శాలను అప్‌గ్రేడ్ చేశారు. అయినా అక్కడ ఇంత వరకు వైద్యుడిని నియమించలేదు. డాక్టర్ పోస్టు మంజూరైనా రెండు సంవత్సరాలుగా భర్తీ చేసే విషయంలో జాప్యం జరుగుతోంది.
న్యాల్‌కల్ మండలంలోని మిర్జాపూర్‌లో గత ఏడాదిగా డాక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. అయినా పోస్టును భర్తీ చేసే విషయంలో అధికారులు ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నారని పశు పోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాల్కిలో పశువైద్య శాలను అప్ గ్రేడ్ చేయడంతో ఆస్పత్రి స్థాయి పెరిగింది. అయినా రెండేళ్లుగా పోస్టును భర్తీ చేసే విషయంలో ఎవరూ పట్టించుకోని పరిస్థితి నెలకొంది. నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండలంలోని బోరంచ పశువైద్య శాలలో ఏకంగా దశాబ్ద కాలంగా వైద్యుడి పోస్టు ఖాళీగానే ఉంది. భర్తీ చేసేందుకు గాను ప్రభుత్వం, అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి.
నాగల్‌గిద్దలో సైతం ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా దశాబ్ద కాలంగా వైద్యుడి పోస్టును భర్తీ చేయలేదు. కసర్‌గుత్తిలో పశువైద్య శాలను అప్‌గ్రేడ్ చేసి రెండు సంవత్సరాలు అయింది. ఇంత వరకు వైద్యుడి పోస్టును భర్తీ చేయలేదు. నారాయణఖేడ్ మండలంలోని రుద్రార్ గ్రామంలో గల పశువైద్య శాల అప్‌గ్రేడ్ అయింది. రెండు సంవత్సరాలు గడుస్తున్నా వైద్యుడిని నియమించలేదు. కంగ్టి పశువైద్య శాలలో నాల్గేళ్లుగా, కల్హేర్‌లో ఏడాదిగా, సిర్గాపూర్‌లో దశాబ్దంగా పశు వైద్యుల పోస్టులను భర్తీ చేయడం లేదు.
సబ్ డివిజన్ పరిధిలో ఎల్‌ఏఎస్ పోస్టులు 9, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు 15, అటెండర్ పోస్టులు 10 వంతున ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టులను భర్తీ చేసే విషయంలో సంబంధిత శాఖ అధికారులు ఉదాసీన వైఖరిని అవలంబిస్తుండడం పశు పోషకుల పాలిట శాపంగా మారింది. పశు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్న వైశ్య శాలల్లో జేవీఓ, ఎల్‌ఎస్‌ఏలు వైద్య సేవలందిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి ఖాళీగా ఉన్న వైద్య పోస్టులతో పాటు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయించి పశువులకు మెరుగైన వైద్య సేవలందించే విధంగా చర్యలు చేపట్టాలని పశు పోషకులు కోరుతున్నారు.
వైద్యుల కొరత.. సేవల వెత
Published Fri, Dec 26 2014 10:27 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement