సాక్షి,హైదరాబాద్: ప్రొద్దుటూరు, కోరుట్ల వెటర్నరీ కాలేజీల విద్యార్థుల భవితవ్యంపై ఆశలు చిగురిస్తున్నాయి. వీరికి వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) శాశ్వత రిజిస్టేషన్ లేకపోయినా,ప్రొవిజెనల్ రిజిస్ట్రేషన్ మీదే వీరిని ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు పశుసంవర్థక శాఖ సుముఖంగా ఉంది. ఆమేరకు శాఖ డెరైక్టర్ డాక్టర్ డి.వెంకటేశ్వర్లు పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శికి సోమవారం ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం ఆ ఫైలు తుది అనుమతుల కోసం సీఎం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఈ కాలేజీల విద్యార్థులు కూడా వెటర్నరీ డాక్టర్ ఉద్యోగాలకు అర్హులవుతారు. ఖాళీగా ఉన్న 469 వెటర్నరీ డాక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే గడువు సోమవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ కాలేజీల విద్యార్థులను కూడా ‘ప్రొవిజెనల్ రిజిస్ట్రేషన్’ ప్రాతిపదికన ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు పశుసంవర్థక శాఖ సుముఖత వ్యక్తం చేసింది. కోరుట్ల, ప్రొద్దుటూరు కాలేజీల్లో నిబంధనల మేరకు వసతులు లేని కారణంగా ఆ కాలేజీల గుర్తింపును వీసీఐ రద్దు చేసిన విషయం విదితమే. రెండు కాలేజీల నుంచి ఈ సంవత్సరమే తొలి బ్యాచ్ విద్యార్థులు ఐదేళ్ల డిగ్రీని పూర్తి చేసుకున్నారు.
వీసీఐ రిజిస్ట్రేషన్ ఉంటేనే వారి డిగ్రీలు చెల్లుబాటు అవుతాయి. దాంతో వీరి భవితవ్యం ప్రశ్నార్థకమయిన సంగతి తెలిసిందే. ఉపశమనం తాత్కాలికమే: ప్రస్తుతానికి ‘ప్రొవిజెనల్ రిజిస్ట్రేషన్’ ప్రాతిపదికన వీరికి ఉద్యోగాలు ఇచ్చినా ఇది సమస్యకు పూర్తి పరిష్కారం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైద్యులకయితే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, పశువైద్యులకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. డిగ్రీ పూర్తయినప్పటికీ, రిజిస్ట్రేషన్ లేకుండా వీరు ప్రైవేటు ప్రాక్టీసు కూడా చేయకూడదు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ లేని విద్యార్థులకు ప్రస్తుతానికి ఉద్యోగావకాశాలు కల్పించినా, వారు పూర్తి స్థాయి విధుల నిర్వహణ చేయాలంటే వీసీఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ లోగా వీసీఐ నుంచి కోరుట్ల, ప్రొద్దుటూరు కాలేజీలకు అనుమతులు సాధించి, ఈ విద్యార్థుల సర్టిఫికెట్లకు వీసీఐ రిజిస్ట్రేషన్ తెచ్చుకుంటేనే సమస్య పరిష్కారమవుతుందని యూనివర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి.
నవంబర్ మొదటి వారంలో రండి - వీసీఐకి లేఖ
విద్యార్థుల ఉద్యోగావకాశాలు, భవిషత్తును దృష్టిలో ఉంచుకుని నవంబర్ తొలి వారంలోనే ఈ కాలేజీలను తనిఖీ చేసి తగిన అనుమతులివ్వాలని పశుసంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి వీసీఐకి సోమవారం లేఖ రాశారు. వీసీఐ నిర్దేశించిన అన్ని వసతులను ప్రొద్దుటూరు, కోరుట్ల కాలేజీల్లో కల్పించామని, పూర్తిస్థాయిలో బోధనా సిబ్బంది ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. కాలేజీ, హస్టల్ భవనాల నిర్మాణంతో సహా మిగతా సౌకర్యాల కల్పన కూడా పూర్తిచేశామన్నారు. విద్యార్థుల భవిషత్ దృష్ట్యా కాలేజీల అనుమతుల మంజూరుపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం వెలువరించాలని ఆయన వీసీఁఊఐని కోరారు.
వెటర్నరీ పోస్టులకు ముగిసిన గడువు
Published Tue, Oct 22 2013 5:55 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement
Advertisement