ఎంవోయూపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్ ప్రతినిధి రాజన్ సంతకాలు చేసిన అనంతరం అభినందనలు తెలుపుతున్న సీఎం వైఎస్ జగన్
గతంలో అధికారంలో ఉన్న వారు తమ సొంత కంపెనీ హెరిటేజ్ కోసం ప్రభుత్వ సహకార డెయిరీలను నిర్వీర్యం చేశారు. గతంలో ప్రభుత్వ సహకార రంగం బలంగా ఉన్నప్పుడు పోటీ వాతావరణం ఉండేది. కాలక్రమంలో ఆ వాతావరణం పోయింది. ప్రభుత్వ సహకార డెయిరీలు రాజీ పడిపోయాయి.
సాక్షి, అమరావతి: మహిళల జీవితాలను మార్చే క్రమంలో అమూల్‌తో ఒప్పందం గొప్ప అడుగు అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు, అమూల్‌కు ఈ ఒప్పందం ఒక చరిత్రాత్మక అడుగుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అమూల్‌తో బాగస్వామ్యం ద్వారా మహిళలకు మరింత చేదోడు లభిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో మంగళవారం క్యాంపు కార్యాలయంలో అమూల్, ఏపీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, అమూల్ చెన్నై జోనల్ హెడ్ రాజన్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా గుజరాత్ రాష్ట్రం ఆనంద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.ఎస్.సోధి, సబర్‌కాంత డిస్ట్రిక్ట్ కో–ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ సంబల్ భాయ్ పటేల్‌లతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
వైఎస్సార్ చేయూత, ఆసరా ద్వారా నాలుగేళ్లలో రూ.44 వేల కోట్లు
► మహిళల కోసం వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాలను ప్రారంభిస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లోని మహిళల్లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఏటా రూ.18,750 చొప్పున చేయూత కింద నాలుగేళ్ల పాటు ఇస్తాం. ఆ విధంగా వారికి నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయం చేస్తాం. ఆగస్టు 12న వైఎస్సార్ చేయూత ప్రారంభిస్తున్నాం. దాదాపు 25 లక్షల మంది మహిళలు ఈ పథకంలో లబ్ధి పొందుతారు.
► స్వయం సహాయక సంఘాలకు చెందిన 90 లక్షల మంది మహిళలకు వైఎస్సార్ ఆసరా కింద ఏటా రూ.6,700 కోట్లు ఇస్తాం. ఈ రెండు పథకాలకే ఏడాదికి రూ.11 వేల కోట్లు.. నాలుగేళ్లలో రూ.44 వేల కోట్లు ఇవ్వనున్నాం.
► ఈ సహాయం వారిలో ఆర్థిక ప్రమాణాల పెరుగుదలకు ఉపయోగపడాలన్నది లక్ష్యం. తద్వారా మహిళల జీవితాలనే మార్చాలని ప్రయత్నిస్తున్నాం. ఈ నేపథ్యంలో అమూల్‌తో భాగస్వామ్యం ఆ దిశలో మెరుగైన అడుగులు వేయాలి.
దక్షిణాది గేట్‌వేగా ఏపీ
► బెంగళూరు అనంతపురానికి, చెన్నై చిత్తూరుకు, విశాఖపట్నం ఒడిశాకు, హైదరాబాద్ ఏపీ సరిహద్దుకు సమీపంలో ఉంది. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ గేట్ వే లాంటిది. అలాగే మార్కెటింగ్ హబ్‌గా కూడా ఉంటుంది.
► రాష్ట్రంలో ఐఆర్‌ఎంఏ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్) ఏర్పాటు చేయండి. పులివెందులలో ఉన్న ఐజీ కార్ల్ శిక్షణ, పరిశోధనలకు మంచి వేదిక అవుతుంది.
► ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి్డ, ఏపీడీడీసీఎఫ్ ఎండీ వాణీ మోహన్, అమూల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఏపీలో పాడి పరిశ్రమకు మంచి భవిష్యత్: ఆర్‌ఎస్ సోధి
► గుజరాత్, ఏపీ మధ్య చాలా పోలికలు ఉన్నాయి. ఏపీలో కూడా గణనీయంగా రోజుకు 4 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. పాడి రైతులకు మంచి ధర లభించడంతో పాటు, అటు వినియోగదారులకు కూడా సరసమైన ధరకు పాలు లభిస్తాయి.
► గత ఏడాది అమూల్ సంస్థ టర్నోవర్ రూ.52 వేల కోట్లు. ఇప్పుడు ఏపీతో ఎంఓయూ వల్ల ఇటు ఏపీ ప్రభుత్వానికి, అటు అమూల్ కంపెనీకి ఎంతో ప్రయోజనకరం.
► పాడి పరిశ్రమలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ అవకాశాలు, టెక్నాలజీకి అవకాశం. పాడి పశువుల పెంపకం, డెయిరీల నిర్వహణలో పరిజ్ఞానం, సహకార సంఘాల అంశాల్లో మహిళలకు అపార అవకాశాలు.
మంచి జరగాలని ఆరాటపడుతున్నాం
► పాల ఉత్పత్తిలో దేశంలోనే 4వ స్థానంలో ఉన్నాం. కానీ కేవలం 24 శాతం పాలు మాత్రమే వ్యవస్థీకృత రంగానికి వెళ్తున్నాయి. పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారికి కష్టానికి తగ్గ ధర లభించడం లేదు. లీటరు పాలు, లీటరు మినరల్ వాటర్ బాటిల్ ధర ఒకేలా ఉందంటూ పాదయాత్రలో నాకు రైతులు చూపించారు. u సహకార డెయిరీలు కంపెనీల చట్టం కిందకు మారిపోయాయి. కొన్ని రాజకీయ కుటుంబాల చేతుల్లోకి వెళ్లిపోయాయి. పోటీ వాతావరణం లేదు. ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ కింద ఉన్న డెయిరీలన్నీ పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. u అమూల్‌తో భాగస్వామ్యం ద్వారా ఈ రంగంలో మంచి మార్పులను ఆశిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment