సాక్షి, అమరావతి: జగనన్న పాల వెల్లువ ద్వారా పాలను సేకరిస్తున్న అమూల్ సంస్థ తాజాగా ఐదోసారి పాల సేకరణ ధరలను పెంచింది. లీటర్‌కు గరిష్టంగా గేదె పాలపై రూ.3.37, ఆవు పాలపై రూ.1.73 చొప్పున పెంచింది. కిలో వెన్నపై రూ.31, ఘన పదార్థాలపై రూ.12 మేర సేకరణ ధర పెరిగింది. ఈ పెంపు ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో గురువారం నుంచి వర్తించనుంది. దీనిద్వారా 40 వేల మంది రైతులకు అదనంగాలబ్ధి చేకూరనుంది. గత రెండేళ్లలో ఇప్పటికే నాలుగు దఫాలు పాల సేకరణ ధరలను పెంచగా తాజా పెంపుతో ఐదోసారికి చేరుకుంది.
మూడు నెలల్లోనే మళ్లీ..
అమూల్ తరఫున రాయలసీమలో కైరా, కోస్తాంధ్రలో సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలను సేకరిస్తున్నాయి. పథకం ప్రారంభించినప్పుడు లీటర్‌కు గరిష్టంగా గేదె పాలకు రూ.71.47, ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించింది. ప్రస్తుతం లీటర్ గేదె పాలకు రూ.84.15, ఆవు పాలకు రూ.40.73 చొప్పున చెల్లిస్తోంది.
అమూల్ తరఫున ఉత్తరాంధ్రలో పాలను సేకరిస్తున్న బనస్కాంత్ జిల్లా కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ సెప్టెంబర్‌లో పాల సేకరణ ధరలు పెంచగా 3 నెలలు తిరగకుండానే మరోసారి పెంచడం గమనార్హం. తాజా పెంపుతో లీటర్‌కు గరిష్టంగా గేదె పాలు రూ.87.52, ఆవు పాలు రూ.42.46 చొప్పున పెరిగాయి. అమూల్ గత రెండేళ్లలో గేదె పాలపై రూ.16.05, ఆవు పాలపై రూ.8.26 మేర పెంచింది.
రెండేళ్లలో 5.40 కోట్ల లీటర్ల సేకరణ
జగనన్న పాలవెల్లువ ద్వారా 2020 డిసెంబర్‌లో 3 జిల్లాల్లో పాల సేకరణకు శ్రీకారం చుట్టగా 2 నెలల్లోనే 17 జిల్లాలకు విస్తరించారు. 27,277 మంది రైతులతో మొదలైన ఈ ఉద్యమంలో ఇపుడు ఏకంగా 2,47,958 మంది భాగస్వాములయ్యారు. వంద గ్రామాలతో ప్రారంభమై 2,856 గ్రామాలకు విస్తరించింది.
రోజూ సగటున లక్షన్నర లీటర్ల పాలను సేకరిస్తోంది. 1,587 ఆర్బీకేల పరిధిలో 2,49,998 మంది పాడి రైతులు నిత్యం పాలు పోస్తున్నారు. రెండేళ్లలో 5.40 కోట్ల లీటర్ల పాలను సేకరించగా పాడి రైతులకు రూ.232.26 కోట్లు చెల్లించారు.
లీటర్‌పై రూ.4 అదనంగా లబ్ధి చేకూర్చేలా కృషి చేస్తామని హామీ ఇవ్వగా ప్రస్తుతం లీటర్ గేదె పాలకు రూ.15 –రూ.20 వరకు, ఆవుపాలకు రూ.10 – రూ.12 వరకు అదనపు లాభం చేకూరుతోంది. అమూల్ రాకతో పోటీ పెరిగి ప్రైవేట్ డెయిరీలు సైతం అనివార్యంగా సేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. ఫలితంగా పాడి రైతులకు అదనంగా రూ.2,400 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది.
సంక్రాంతికి మిగతా జిల్లాల్లోనూ..
జగనన్న పాల వెల్లువ ద్వారా అమూల్ తరఫున ఉత్తరాంధ్రలో పాలు సేకరిస్తున్న బనస్కాంత్ యూనియన్ ఐదోసారి పాలసేకరణ ధరను పెంచడంతో పాటు వెన్న, ఘనపదార్థాల సేకరణ ధరలను కూడా పెంచింది. ఇప్పటికే 17 జిల్లాల్లో పాలు సేకరిస్తున్నాం. సంక్రాంతి కల్లా మిగిలిన జిల్లాలకు విస్తరించేలా కృషి చేస్తున్నాం.
– అహ్మద్‌బాబు, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్
Comments
Please login to add a commentAdd a comment