నమ్మకాన్ని కాపాడింది  | financial aid dairy farmers jagananna pala velluva: Andhra pradesh | Sakshi
Sakshi News home page

నమ్మకాన్ని కాపాడింది 

Published Tue, Jan 2 2024 4:30 AM | Last Updated on Tue, Jan 2 2024 9:50 AM

financial aid dairy farmers jagananna pala velluva: Andhra pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ‘జగనన్న పాల వెల్లువ’ (జేపీవీ)కు ఆదరణ వెలువెత్తుతోంది. ప్రైవేట్‌ డెయిరీల దోపిడికీ చెక్‌ పెడుతూ ‘అమూల్‌’ దూసుకెళుతోంది. నిండా మూడేళ్లు కూడా నిండని అమూల్‌ పాడి రైతుల నమ్మకాన్ని చూరగొనడంతో పాలు పోసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రికార్డు స్థాయిలో పాల సేకరణ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు రోజుకు 1.74 లక్షల లీటర్ల పాలను సేకరించిన అమూల్‌ ప్రస్తుతం ఏకంగా 3.61 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది. అమూల్‌కు పాలు పోసే పాడిరైతుల సంఖ్య మూడింతలు పెరిగింది.  

1,800 లీటర్ల నుంచి 3.61 లక్షల లీటర్లకు.. 
రాష్ట్రంలో జగనన్న పాల వెల్లువ ఓ ఉద్యమంలా సాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2020 డిసెంబర్‌లో జేపీవీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూడు (వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం) జిల్లాల్లో 401 గ్రామాలతో మొదలైన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం 19 జిల్లాల్లో 4,127 గ్రామాలకు విస్తరించింది.

తొలుత ఈ ఉద్యమంలో భాగస్వాము­లయ్యేందుకు 24,277 మంది ముందుకు రాగా నేడు అది 3,78,567 మందికి చేరింది. రోజూ పాలుపోసే పాడి రైతులు ప్రారంభంలో 800 మంది ఉండగా నేడు ఏకంగా లక్ష మందికి చేరుకున్నారు. ప్రారంభంలో రోజుకు సగటున 1,800 లీటర్లు పాలు పోయగా ఇప్పుడు ఏకంగా 3.60,808 లీటర్ల సేకరణ జరుగుతోంది. దశాబ్దాల చరిత్ర, విస్తృత నెట్‌వర్క్‌ కలిగిన ప్రైవేట్‌ డెయిరీలు సైతం రోజుకు సగటున 6 లక్షల లీటర్లకు మించి పాలు సేకరించలేని పరిస్థితి నెలకొనగా మూడేళ్ల వయసున్న అమూల్‌ నిత్యం రాష్ట్రంలో 3.61 లక్షల లీటర్లకు పైగా పాలు సేకరిస్తుండడం అరుదైన రికార్డుగా పేర్కొంటున్నారు.

ముఖ్యంగా గత ఆరు నెలల్లో ఈ ప్రాజెక్టు గణనీయమైన వృద్ధి నమోదు చేసింది. ఈ ఏడాది జూలై నాటికి 3,475 గ్రామాల పరిధిలో 3.11 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా రోజుకు సగటున 68 వేల మంది 1.74 లక్షల లీటర్ల పాలు పోసేవారు. అలాంటిది డిసెంబర్‌ 25 నాటికి 4,127 గ్రామాలకు విస్తరించగా ప్రాజెక్టులో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారి సంఖ్య ఏకంగా 3.78 లక్షల మందికి చేరుకుంది. రోజుకు సగటున 3.61 లక్షల లీటర్ల పాలు పోయడంతో ఆర్నె­ల్లలో సేకరణ రెట్టింపు దాటింది. వృద్ధి రేటు ఏకంగా 197.99 శాతంగా నమోదు కావడం గమనార్హం.   

నమ్మకం పెరిగిందిలా... 
అమూల్‌ ప్రారంభంలో 11 శాతం వెన్న, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో గేదె పాలకు రూ.71.74 చొప్పున  చెల్లించింది. 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించగా మూడేళ్లలో ఏడు సార్లు పాల సేకరణ ధరలను పెంచింది. ప్రస్తుతం గేదె పాలకు లీటర్‌కు రూ.89.76, ఆవు పాలకు రూ.43.69 చొప్పున చెల్లిస్తోంది.

పాల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు సేకరణ ధరలు తగ్గించడం, ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు ధరలు పెంచినట్లుగా గిమ్మిక్కులు చేస్తూ పాడి రైతులను ప్రైవేటు డెయిరీలు దోచుకునేవి. అమూల్‌ మాత్రం ఉత్పత్తి తగ్గినా, పెరిగినా ఒకే రీతిలో ప్రకటించిన ప్రకారం పాల సేకరణ ధరలను చెల్లిస్తోంది.

పైగా ఎస్‌ఎన్‌ఎఫ్, ఫ్యాట్‌ శాతాన్ని బట్టి లెక్కగట్టి అణాపైసలతో సహా పాలు పోసిన 10 రోజుల్లో నేరుగా పాడిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఎస్‌ఎన్‌ఎఫ్, ఫ్యాట్‌ శాతాన్ని బట్టి గేదె పాలకు లీటర్‌కు రూ.100, ఆవు పాలకు రూ.50కు పైగా ధర పక్కాగా లభిస్తుండడంతో పాడిరైతుల్లో అమూల్‌ పట్ల భరోసా ఏర్పడింది.  

రూ.4.93 కోట్ల బోనస్‌.. భారీగా రుణాలు 
ఏడాదిలో కనీసం 180 రోజుల పాటు క్రమం తప్పకుండా పాలుపోసే వారికి లీటర్‌కు రూ.0.50 చొప్పు­న అమూల్‌ బోనస్‌ చెల్లిస్తుండడం పాడిదారులకు భరోసానిస్తోంది. మూడేళ్లలో రాయల్టీ ఇన్సెంటివ్‌ (బోనస్‌) కింద రూ.4.93 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం గమనార్హం. లాభాపేక్ష లేకుండా 2,300 టన్నులకుపైగా నాణ్యమైన ఫీడ్‌ను పంపిణీ చేసింది.

అంతేకాకుండా వర్కింగ్‌ క్యాపిటల్‌ రూపంలో గేదెలకు రూ.30 వేలు, ఆవులకు రూ.25 వేల చొప్పున ఆర్ధిక చేయూతనివ్వడమే కాకుండా కొత్తగా పాడి కొనుగోలుకు ముందుకొచ్చే రైతులకు గేదెకు రూ.93 వేలు, ఆవులకు రూ.76 వేల చొప్పున స్వ­యంగా రుణాలందిస్తోంది. ఇప్పటివరకు 12,728 మంది మహిళా పాడి రైతులకు వర్కింగ్‌ క్యాపిటల్‌ కింద రూ.60.29 కోట్లు అందించారు.

3,090 మంది రైతులకు పాడి కొనుగోలకు రూ.30.01 కోట్లు రుణాలిచ్చారు. జేపీవీ ప్రాజెక్టులో భాగంగా 9,899 గ్రామా­ల్లో పాలసేకరణ కేంద్రాలు, బల్క్‌ మిల్క్‌ చిల్లిం­గ్‌ యూనిట్లను ఏర్పా­టు చేస్తున్నారు. తొలిదశలో రూ.680 కోట్లతో 3,156 గ్రామాల్లో ఏఎం­సీయూ, బీఎంసీయూల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. జేపీవీ ప్రారంభ మైనప్పటి నుంచి నేటి వరకు 12.70 కోట్ల లీటర్ల పాలను సేకరించగా రూ.575.42 కోట్లు పాడి రైతుల ఖాతాల్లో జమ చేసింది. 

అరుదైన రికార్డు..
జేపీవీ ప్రాజెక్టుకు గ్రామాల్లో అనూహ్య స్పందన లభిస్తోంది. మూడేళ్లలో అనూహ్య పురోగతి సాధించింది. రోజుకు 3.61 లక్షల లీటర్ల పాలను సేకరించడం ఓ అరుదైన రికార్డుగానే చెప్పవచ్చు. ప్రైవేట్‌ డెయిరీలు ఏ స్థాయిలో దోపిడీ చేస్తున్నాయో, ఎలా నష్టపోతున్నారో పాడి రైతులకు అర్ధమయ్యే రీతిలో చెప్పడంలో అమూల్‌ విజయవంతం కావడం వల్లే ఇది సాధ్యమైంది. నాలుగు  లక్షల లీటర్ల సేకరణను అధిగమించే రోజు దగ్గర్లోనే ఉంది.   – అహ్మద్‌ బాబు, ఎండీ, ఏపీడీడీసీఎఫ్‌  

అణా పైసలతో సహా చెల్లిస్తున్నారు..
జగనన్న పాల వెల్లువ కేంద్రంలో రోజూ 4–5 లీటర్ల గేదె పాలు పోస్తుంటాం. నాణ్యమైన మేత వల్ల పాల నాణ్యత పెరిగింది. ఫ్యాట్‌ 13, ఎస్‌ఎన్‌ఎఫ్‌ 9 శాతంతో మంగళవారం 4.4 లీటర్ల పాలు పోయగా లీటర్‌కు రూ.102.50 చొప్పున రూ.451 సేకరణ ధర లభించింది. ప్రకటించిన ధర కంటే రూ.56 అదనంగా వచ్చింది.

ప్రైవేట్‌ డెయిరీలకు పాలు పోస్తే లీటర్‌కు రూ.50 రావడం కూడా గగనంగా ఉండేది. ఫ్యాట్‌ 11, ఎస్‌ఎన్‌ఎఫ్‌ 9 శాతానికి మించి ఇచ్చేవారు కాదు. పాల ఉత్పత్తి అధికంగా ఉన్న సమయంలో ఏదో ఒక సాకుతో కోతలు పెట్టేవారు. ఇప్పుడు ఎస్‌ఎన్‌ఎఫ్, ఫ్యాట్‌ ఎంత శాతం ఉంటే ఆ మేరకు లెక్కగట్టి నగదు మా ఖాతాల్లో జమ చేస్తున్నారు.      – చిరుమామిళ్ల రాణి, కొంజెర్ల, గంపలగూడెం మండలం, ఎన్టీఆర్ జిల్లా    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement