Milk collection Price hike
-
పాడి రైతులకు పండుగ
సాక్షి, అమరావతి: జగనన్న పాల వెల్లువ ద్వారా పాలను సేకరిస్తున్న అమూల్ సంస్థ తాజాగా ఐదోసారి పాల సేకరణ ధరలను పెంచింది. లీటర్‌కు గరిష్టంగా గేదె పాలపై రూ.3.37, ఆవు పాలపై రూ.1.73 చొప్పున పెంచింది. కిలో వెన్నపై రూ.31, ఘన పదార్థాలపై రూ.12 మేర సేకరణ ధర పెరిగింది. ఈ పెంపు ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో గురువారం నుంచి వర్తించనుంది. దీనిద్వారా 40 వేల మంది రైతులకు అదనంగాలబ్ధి చేకూరనుంది. గత రెండేళ్లలో ఇప్పటికే నాలుగు దఫాలు పాల సేకరణ ధరలను పెంచగా తాజా పెంపుతో ఐదోసారికి చేరుకుంది. మూడు నెలల్లోనే మళ్లీ.. అమూల్ తరఫున రాయలసీమలో కైరా, కోస్తాంధ్రలో సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలను సేకరిస్తున్నాయి. పథకం ప్రారంభించినప్పుడు లీటర్‌కు గరిష్టంగా గేదె పాలకు రూ.71.47, ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించింది. ప్రస్తుతం లీటర్ గేదె పాలకు రూ.84.15, ఆవు పాలకు రూ.40.73 చొప్పున చెల్లిస్తోంది. అమూల్ తరఫున ఉత్తరాంధ్రలో పాలను సేకరిస్తున్న బనస్కాంత్ జిల్లా కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ సెప్టెంబర్‌లో పాల సేకరణ ధరలు పెంచగా 3 నెలలు తిరగకుండానే మరోసారి పెంచడం గమనార్హం. తాజా పెంపుతో లీటర్‌కు గరిష్టంగా గేదె పాలు రూ.87.52, ఆవు పాలు రూ.42.46 చొప్పున పెరిగాయి. అమూల్ గత రెండేళ్లలో గేదె పాలపై రూ.16.05, ఆవు పాలపై రూ.8.26 మేర పెంచింది. రెండేళ్లలో 5.40 కోట్ల లీటర్ల సేకరణ జగనన్న పాలవెల్లువ ద్వారా 2020 డిసెంబర్లో 3 జిల్లాల్లో పాల సేకరణకు శ్రీకారం చుట్టగా 2 నెలల్లోనే 17 జిల్లాలకు విస్తరించారు. 27,277 మంది రైతులతో మొదలైన ఈ ఉద్యమంలో ఇపుడు ఏకంగా 2,47,958 మంది భాగస్వాములయ్యారు. వంద గ్రామాలతో ప్రారంభమై 2,856 గ్రామాలకు విస్తరించింది. రోజూ సగటున లక్షన్నర లీటర్ల పాలను సేకరిస్తోంది. 1,587 ఆర్బీకేల పరిధిలో 2,49,998 మంది పాడి రైతులు నిత్యం పాలు పోస్తున్నారు. రెండేళ్లలో 5.40 కోట్ల లీటర్ల పాలను సేకరించగా పాడి రైతులకు రూ.232.26 కోట్లు చెల్లించారు. లీటర్‌పై రూ.4 అదనంగా లబ్ధి చేకూర్చేలా కృషి చేస్తామని హామీ ఇవ్వగా ప్రస్తుతం లీటర్ గేదె పాలకు రూ.15 –రూ.20 వరకు, ఆవుపాలకు రూ.10 – రూ.12 వరకు అదనపు లాభం చేకూరుతోంది. అమూల్ రాకతో పోటీ పెరిగి ప్రైవేట్ డెయిరీలు సైతం అనివార్యంగా సేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. ఫలితంగా పాడి రైతులకు అదనంగా రూ.2,400 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది. సంక్రాంతికి మిగతా జిల్లాల్లోనూ.. జగనన్న పాల వెల్లువ ద్వారా అమూల్ తరఫున ఉత్తరాంధ్రలో పాలు సేకరిస్తున్న బనస్కాంత్ యూనియన్ ఐదోసారి పాలసేకరణ ధరను పెంచడంతో పాటు వెన్న, ఘనపదార్థాల సేకరణ ధరలను కూడా పెంచింది. ఇప్పటికే 17 జిల్లాల్లో పాలు సేకరిస్తున్నాం. సంక్రాంతి కల్లా మిగిలిన జిల్లాలకు విస్తరించేలా కృషి చేస్తున్నాం. – అహ్మద్‌బాబు, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
అమూల్ పాలసేకరణ ధర పెంపు
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాల్లో పాలసేకరణ ధరను అమూల్ పెంచింది. ఇటీవలే కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాలసేకరణ ధరను పెంచిన అమూల్ తాజాగా రాయలసీమ జిల్లాల్లో లీటరు గేదెపాలపై రూ.2.47, ఆవుపాలపై రూ.1.63 చొప్పున పెంచింది. ఈ పెంపు గురువారం నుంచి అమల్లోకి రానుంది. జగనన్న పాలవెల్లువ కింద అమూల్ తరఫున రాయలసీమ జిల్లాల్లో కైరా, కోస్తాంధ్రలో సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలు సేకరిస్తున్నాయి. ఇటీవలే కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో నాలుగోసారి పాలసేకరణ ధర పెంచగా, రాయలసీమ జిల్లాల్లో నేటినుంచి అమలు చేస్తోంది. రాయలసీమ జిల్లాల్లో లీటరు ఆవుపాలకు (ఫ్యాట్ 3.5 శాతం, ఎస్ఎన్ఎఫ్ 8.5 శాతం) చెల్లిస్తున్న ధరను రూ.30.50 నుంచి రూ.32.13కు పెంచింది. లీటరు గేదెపాలకు (ఫ్యాట్ 6 శాతం, ఎస్ఎన్ఎఫ్ 9 శాతం) చెల్లిస్తున్న ధరను రూ.42.50 నుంచి రూ.44.97కు పెంచింది. కిలో ఘనపదార్థాలకు రూ.7.9 నుంచి రూ.9.5కు పెంచారు. హ్యాండ్లింగ్ చార్జీల కింద లీటరు ఆవుపాలకు (ఫ్యాట్ 4 శాతం ఎస్ఎన్ఎఫ్ 8.5 శాతం) రూ.1.24, గేదెపాలకు (ఫ్యాట్ 8 శాతం, ఎస్ఎన్ఎఫ్ 9.2 శాతం) రూ.1.64 చొప్పున సొసైటీలకు చెల్లించనున్నారు. అమూల్ దాణాపై 50 కిలోల బస్తాకు రూ.10 చొప్పున ఆయా సొసైటీ కార్యదర్శులకు ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. ఫలితంగా వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలోని 44 వేలమంది రైతులతోపాటు 3,768 మహిళా పాడిరైతు సంఘాలు లబ్ధిపొందనున్నాయి. అమూల్ రాకతో అదనపు లబ్ధి జగనన్న పాలవెల్లువ పథకాన్ని ఇటీవలే తిరుపతి జిల్లాకు విస్తరించారు. ప్రస్తుతం 17 జిల్లాల్లో 1,644 ఆర్బీకేల పరిధిలోని 2,856 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ అమలవుతోంది. 2,47,958 మంది మహిళా పాడిరైతుల నుంచి రోజూ 1.50 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. గడిచిన 24 నెలల్లో 5.12 కోట్ల లీటర్ల పాలు సేకరించారు. పాలుపోసిన పదిరోజుల్లోనే డబ్బు చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు రూ.219.57 కోట్లు చెల్లించారు. లీటరుపై రూ.4 అదనంగా లబ్ధిచేకూర్చేలా కృషిచేస్తామని పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీ కంటే మిన్నగా లీటరు గేదెపాలపై రూ.15 నుంచి రూ.20 వరకు, ఆవుపాలకు రూ.10 వరకు అదనంగా లబ్ధిచేకూర్చారు. ప్రైవేటు డెయిరీలు ఇస్తున్న రేట్లతో పోలిస్తే జగనన్న పాలవెల్లువ అమలవుతున్న గ్రామాల్లోని రైతులు రూ.25 కోట్ల వరకు అదనంగా లబ్ధిపొందారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా ప్రైవేటు డెయిరీలు కూడా పోటీపడి ధరలను పెంచాల్సి వచ్చింది. మూడేళ్లలో వరుసగా నాలుగుసార్లు పెంచడంతో అమూల్‌తో పోటీని తట్టుకోలేక ప్రైవేటు డెయిరీలు సైతం లీటరుపై రూ.15 వరకు పెంచాల్సి వచ్చింది. ఫలితంగా జగనన్న పాలవెల్లువ పథకం కింద పాలుసేకరిస్తున్న గ్రామాల్లోనే కాదు.. ప్రైవేటు డెయిరీలకు పాలుపోస్తున్న రైతులకు కూడా గతంలో ఎన్నడూ లేని రీతిలో లబ్ధికలిగింది. ఆయా డెయిరీల పరిధిలోని రైతులు మూడేళ్లలో రూ.2,354.22 కోట్ల మేర లబ్ధిపొందగలిగారు. ఇప్పటికే అమూల్ తరఫున పాలు సేకరిస్తున్న సబర్కాంత్, బనస్కాంత్ యూనియన్లు పాలసేకరణ ధర పెంచగా, తాజాగా గురువారం నుంచి రాయలసీమ జిల్లాల్లో పాలుసేకరిస్తున్న కైరా యూనియన్ కూడా నాలుగోసారి పెంచింది. జగనన్న పాలవెల్లువ పథకాన్ని డిసెంబర్ కల్లా మిగిలిన జిల్లాలకు విస్తరించేదిశగా ముందుకెళుతున్నారు. -
పొంగిన పాల సేకరణ ధర
సాక్షి, అమరావతి: ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా పాలను సేకరిస్తున్న అమూల్ సంస్థ తాజాగా నాలుగోసారి పాలసేకరణ ధరను పెంచింది. ఇటీవలే ఆవుపాలపై లీటర్‌కు గరిష్టంగా రూ. 4.12 చొప్పున పెంచగా, తాజాగా గేదె పాలపై రూ.3.93 పెంచింది. అంతేకాక.. పాలుపోసే రైతులతోపాటు సొసైటీలకు అదనపు ప్రోత్సాహకాలను ప్రకటించింది. నెలకు 200 లీటర్లకు పైబడి పాలుపోసే రైతులకు రూ.2.50 వరకు అదనపు ప్రయోజనం చేకూర్చనుంది. మహిళా పాడిరైతు సంఘాల కార్యదర్శులు, సహాయ కార్యదర్శులకు ప్రత్యేక ప్రోత్సాహం కింద లీటర్‌కు పావలా చొప్పున ఇవ్వనున్నారు. ఆదివారం నుంచి ఈ పెంపు, ప్రోత్సాహకాలు అమలులోకి రానున్నాయి. 20 నెలల్లో రూ.181.90 కోట్ల చెల్లింపు ‘జగనన్న పాలవెల్లువ’ కింద 2020 డిసెంబర్లో మూడు జిల్లాల్లో పాల సేకరణకు శ్రీకారం చుట్టగా, 20 నెలల్లో 15 జిల్లాలకు (పునర్విభజన తర్వాత) విస్తరించారు. 2,344 గ్రామాల్లో 2,34,548 మంది నమోదు కాగా, రోజుకు 1.06 లక్షల మంది పాలుపోస్తున్నారు. ఇప్పటివరకు 4.20 కోట్ల లీటర్ల పాలను సేకరించగా రూ.181.90 కోట్లు చెల్లించారు. అమూల్ తరఫున రాయలసీమలో కైరా, కోస్తాంధ్రలో సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలు సేకరిస్తున్నాయి. ఇక విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ట్రయిల్ రన్ నిర్వహిస్తుండగా.. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో సర్వే జరుగుతోంది. వీటితో పాటు మిగిలిన అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కర్నూలు, నంద్యాల, శ్రీబాలాజీ జిల్లాల్లో డిసెంబర్‌లోగా విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాలుగోసారి పాలసేకరణ ధర పెంపు పథకం ప్రారంభించినప్పుడు లీటర్‌కు గరిష్టంగా 11 శాతం వెన్న, 9 శాతం ఎస్ఎన్ఎఫ్ (వెన్నలేని ఘన పదార్థాలు)తో గేదె పాలకు రూ.71.47లు, 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించిన అమూల్ సంస్థ గడిచిన 20 నెలల్లో మూడుసార్లు పాలసేకరణ ధరలను పెంచింది. ప్రస్తుతంు లీటర్ గేదె పాలకు గరిష్టంగా రూ.80.22, ఆవుపాలకు రూ.37.90 చొప్పున చెల్లిస్తుండగా తాజాగా అమూల్ తరఫున ఉత్తరాంధ్రాలో పాలు సేకరిస్తున్న బనస్కాంత్ జిల్లా కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ నాలుగోసారి పాల సేకరణ ధర పెంచింది. ఇటీవలే ఆవు పాలకు లీటర్‌పై గరిష్టంగా రూ.4.12ల చొప్పున పెంచిన యూనియన్, తాజాగా గేదె పాలపై లీటర్‌కు రూ.3.93 చొప్పున పెంచింది. దీంతో గరిష్టంగా ఆవుపాల ధర లీటర్ రూ.40.73లకు చేరగా, తాజాగా గేదె పాలు ధర లీటర్‌కు రూ.84.15కు చేరనుంది. అమూల్ సంస్థ గడిచిన 20 నెలల్లో గేదె పాలపై రూ.12.68, ఆవు పాలపై రూ.6.53ల మేర పెంచింది. పాడి రైతులకు ప్రోత్సాహకాలు పాల సేకరణ ధర, రాయల్టీ బోనస్ కాకుండా పాలుపోసే రైతులతో పాటు సొసైటీ నిర్వాహకులకు అదనంగా ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ ప్రోత్సాహకాలను ప్రతీనెలా 7వ తేదీన చెల్లించనుంది. పాలుపోసే సామర్థ్యాన్ని బట్టి లీటర్‌కు రూ.0.75 నుంచి రూ.2.25ల వరకు రైతులకు ప్రోత్సాహకాలను అందించనుంది. ఇక సొసైటీ కార్యదర్శులు, సహాయ కార్యదర్శులకు సైతం లీటర్‌పై పావలా రాయితీని ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విధంగా ప్రతీ సొసైటీ పరిధిలో ఒక రూపాయి నుంచి రూ.2.50 వరకు అదనపు ప్రోత్సాహం అందుకోనున్నారు. ప్రైవేటు డెయిరీల పరిధిలో.. ఇక అమూల్ రాకతో పోటీని తట్టుకోలేక ప్రైవేటు డెయిరీలు సైతం పాలసేకరణ ధరను విధిగా పెంచాల్సి వచి్చంది. ఫలితంగా వాటికి పాలుపోసే పాడి రైతులకు అదనపు మేలు చేకూరింది. గతంలో ఎన్నడూలేని రీతిలో లీటర్‌పై రూ.12 నుంచి రూ.15ల వరకు ఆయా డెయిరీలు పెంచాల్సి వచ్చింది. ఫలితంగా 20 నెలల్లో ఏకంగా రూ.2,020.46 కోట్ల మేర రైతులకు అదనపు లబ్ధిచేకూరినట్లుగా అంచనా వేశారు. 20 నెలల్లో నాలుగోసారి పెంపు.. జగనన్న పాల వెల్లువ కింద పాలుపోసే పాడి రైతులకు అమూల్ తరఫున ఉత్తరాంధ్రలో పాలు సేకరిస్తున్న బనస్కాంత్ యూనియన్ నాలుగోసారి పాలసేకరణ ధరను పెంచడంతోపాటు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. తాజా పెంపుతో సుమారు 40వేల మంది రైతులకు అదనపు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే 15 జిల్లాల్లో పాలు సేకరిస్తున్నాం. డిసెంబర్ నెలాఖరుకల్లా మిగిలిన జిల్లాలకు విస్తరించేందుకు ఏర్పాట్లుచేస్తున్నాం. – అహ్మద్‌బాబు, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
జిల్లా పాడి రైతులు చేసిన పాపమేంటి?
* 50 వేల మంది రైతులకు దక్కని పాల సేకరణ ధర పెంపు * జిల్లాలో పాలను సేకరించని రాష్ట్ర డెయిరీ సమాఖ్య * తమకూ వర్తింపజేయాలని కోరుతున్న జిల్లా రైతాంగం సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ హుస్నాబాద్ : రాష్ట్ర డెయిరీ సమాఖ్య (విజయ డైరీ)కు పాలుపోసే రైతులకు లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహకం అందించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నవంబర్ ఒకటి నుంచి రాష్ట్రంలోని లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతోంది. కానీ కరీంనగర్ జిల్లా రైతులకు మాత్రం ఆ భాగ్యం రక్కడం లేదు. జిల్లాలో విజయ డైరీ ఒక్క లీటర్ పాలను కూడా సేకరించకపోవడమే ఇందుకు కారణం. గతంలో జిల్లాలో విజయ సంస్థ వేలాది మంది రైతుల నుంచి పాలు సేకరించినప్పటికీ కాలక్రమంలో దానికి పాతరేయడం, ఆ స్థానంలో ప్రైవేటు, సహకార సంఘాలు ఆవిర్భవించడంతో జిల్లా రైతాంగానికి ప్రైవేటు డెయిరీలే దిక్కయ్యాయి. విజయ డెయిరీకి పాతర రాష్ట్ర డెయిరీ సమాఖ్య కరీంనగర్ జిల్లాలో 1971లో పాలసేకరణను ప్రారంభించింది. తొలుత పది పాల సేకరణ కేంద్రాలను ప్రారంభించిన సంస్థ కొద్దికాలానికే రెట్టింపు కేంద్రాలను విస్తరించగా విజయ డైరీకి పాలుపోసే రైతుల సంఖ్య లక్షకు చేరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో 2003 ఫిబ్రవరి 22న డెయిరీ సమాఖ్యను మాక్స్ చట్టం 95 పరిధిలోకి మార్చడంతో డెయిరీపై ప్రభుత్వ అజమాయిషీ లేకుండా పోయింది. తరువాత జిల్లాలోని కొందరు నేతలు పథకం ప్రకారం... విజయ డెయిరీ స్థానంలో కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీని స్థాపించారు. జిల్లాలో విజయ డెయిరీ ఆధీనంలో ఉన్న ఆస్తులు సైతం కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీకి బదలాయించారు. నాటి నుంచి నేటి వరకు కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీలో 50 వేల మంది రైతులు సభ్యులుగా చేరగా, వారి నుంచి నిత్యం లక్ష లీటర్లకుపైగా పాలను సేకరిస్తున్నారు. 50 వేల మంది రైతుల ఎదురుచూపులు పాల సేకరణ ధరను రూ.4కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తమకూ వర్తింపజేయాలని కరీంనగర్ జిల్లా పాడి రైతులు కోరుతున్నారు. పెరిగిన దాణా ధరలతో నష్టాల్లో ఉన్న తమకు ప్రభుత్వ ప్రోత్సాహాన్ని వర్తింపజేస్తే కష్టాల నుంచి బయటపడతామని చెబుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకం తమకు ఎందుకు వర్తింపజేయడం లేదని... ఈ విషయంలో తాము చేసిన పాపమేంటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో విజయ డెయిరీ పాలను సేకరిస్తే తాము కూడా ఆ సంస్థకే పాలు పోసేవారమని చెబుతున్నారు. అన్ని జిల్లాలతోపాటు తమ జిల్లాకూ ప్రోత్సాహకాన్ని వర్తింపజేస్తే రైతులకు ప్రతినెలా రూ.2.4 కోట్ల మేర లాభం దక్కేదని అభిప్రాయపడుతున్నారు. ముల్కనూరుకు వర్తింపజేయండి ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని కరీంనగర్ డెయిరీ రైతులతోపాటు ముల్కనూరు మహిళా స్వకృషి డెయిరీ రైతులకూ వర్తింపజేయాలని స్థానిక నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముల్కనూరు డెయిరీ కేంద్రంలోనూ 30 వేల మంది రైతులు సభ్యులుగా కొనసాగుతున్నారని, ప్రతిరోజూ 30 వేలకుపైగా లీటర్ల పాలను సేకరిస్తోందని పేర్కొన్నారు. కరీంనగర్‌తోపాటు ముల్కనూరు డెయిరీ రైతులకూ ప్రభుత్వ ప్రోత్సహకాన్ని అందజేస్తే జిల్లాలో 80 వేల మందికి లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వానికి విన్నవించాం - చల్మెడ రాజేశ్వర్‌రావు, కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ సంస్థ చైర్మన్ రైతులతో ఏర్పడిన మా సంస్థకు సైతం ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని సీఎం కేసీఆర్, పశుసంవర్ధకశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, జిల్లామంత్రి ఈటెల రాజేందర్‌ను ఇప్పటికే కలిసి విన్నవించాం. సీఎం సైతం సానుకూలంగా ఉండటం వల్ల పాడి రైతులకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం. త్వరలోనే ప్రకటన వస్తుందని ఎదురుచూస్తున్నాం. జిల్లాకూ వర్తించేలా ప్రయత్నిస్తున్నా.. - ఎంపీ వినోద్‌కుమార్ విజయ డెయిరీకి పాలుపోసే రైతులకు మద్దతుగాా లీటర్‌కు రూ.4 ప్రోత్సాహకాన్ని కరీంనగర్ డెయిరీ రైతులకూ వర్తింపజేసేందుకు ప్రయత్నిస్తున్నా. త్వరలో సీఎంతో మాట్లాడి జిల్లాలోని రైతాంగానికి ప్రయోజనం కలిగేలా చేస్తా.