జిల్లా పాడి రైతులు చేసిన పాపమేంటి? | Milk procurement Price hike desided to State Dairy Federation | Sakshi
Sakshi News home page

జిల్లా పాడి రైతులు చేసిన పాపమేంటి?

Published Fri, Nov 21 2014 3:22 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

జిల్లా పాడి రైతులు చేసిన పాపమేంటి? - Sakshi

జిల్లా పాడి రైతులు చేసిన పాపమేంటి?

* 50 వేల మంది రైతులకు దక్కని పాల సేకరణ ధర పెంపు
* జిల్లాలో పాలను సేకరించని రాష్ట్ర డెయిరీ సమాఖ్య
* తమకూ వర్తింపజేయాలని కోరుతున్న జిల్లా రైతాంగం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ హుస్నాబాద్ : రాష్ట్ర డెయిరీ సమాఖ్య (విజయ డైరీ)కు పాలుపోసే రైతులకు లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహకం అందించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నవంబర్ ఒకటి నుంచి రాష్ట్రంలోని లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతోంది. కానీ కరీంనగర్ జిల్లా రైతులకు మాత్రం ఆ భాగ్యం రక్కడం లేదు. జిల్లాలో విజయ డైరీ ఒక్క లీటర్ పాలను కూడా సేకరించకపోవడమే ఇందుకు కారణం. గతంలో జిల్లాలో విజయ సంస్థ వేలాది మంది రైతుల నుంచి పాలు సేకరించినప్పటికీ కాలక్రమంలో దానికి పాతరేయడం, ఆ స్థానంలో ప్రైవేటు, సహకార సంఘాలు ఆవిర్భవించడంతో జిల్లా రైతాంగానికి ప్రైవేటు డెయిరీలే దిక్కయ్యాయి.
 
విజయ డెయిరీకి పాతర
రాష్ట్ర డెయిరీ సమాఖ్య కరీంనగర్ జిల్లాలో 1971లో పాలసేకరణను ప్రారంభించింది. తొలుత పది పాల సేకరణ కేంద్రాలను ప్రారంభించిన సంస్థ కొద్దికాలానికే రెట్టింపు కేంద్రాలను విస్తరించగా విజయ డైరీకి పాలుపోసే రైతుల సంఖ్య లక్షకు చేరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో 2003 ఫిబ్రవరి 22న డెయిరీ సమాఖ్యను మాక్స్ చట్టం 95 పరిధిలోకి మార్చడంతో డెయిరీపై ప్రభుత్వ అజమాయిషీ లేకుండా పోయింది. తరువాత జిల్లాలోని కొందరు నేతలు పథకం ప్రకారం... విజయ డెయిరీ స్థానంలో కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీని స్థాపించారు. జిల్లాలో విజయ డెయిరీ ఆధీనంలో ఉన్న ఆస్తులు సైతం కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీకి బదలాయించారు. నాటి నుంచి నేటి వరకు కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీలో 50 వేల మంది రైతులు సభ్యులుగా చేరగా, వారి నుంచి నిత్యం లక్ష లీటర్లకుపైగా పాలను సేకరిస్తున్నారు.
 
50 వేల మంది రైతుల ఎదురుచూపులు
పాల సేకరణ ధరను రూ.4కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తమకూ వర్తింపజేయాలని కరీంనగర్ జిల్లా పాడి రైతులు కోరుతున్నారు. పెరిగిన దాణా ధరలతో నష్టాల్లో ఉన్న తమకు ప్రభుత్వ ప్రోత్సాహాన్ని వర్తింపజేస్తే కష్టాల నుంచి బయటపడతామని చెబుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకం తమకు ఎందుకు వర్తింపజేయడం లేదని... ఈ విషయంలో తాము చేసిన పాపమేంటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో విజయ డెయిరీ పాలను సేకరిస్తే తాము కూడా ఆ సంస్థకే పాలు పోసేవారమని చెబుతున్నారు. అన్ని జిల్లాలతోపాటు తమ జిల్లాకూ ప్రోత్సాహకాన్ని వర్తింపజేస్తే రైతులకు ప్రతినెలా రూ.2.4 కోట్ల మేర లాభం దక్కేదని అభిప్రాయపడుతున్నారు.
 
ముల్కనూరుకు వర్తింపజేయండి
ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని కరీంనగర్ డెయిరీ రైతులతోపాటు ముల్కనూరు మహిళా స్వకృషి డెయిరీ రైతులకూ వర్తింపజేయాలని స్థానిక నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముల్కనూరు డెయిరీ కేంద్రంలోనూ 30 వేల మంది రైతులు సభ్యులుగా కొనసాగుతున్నారని, ప్రతిరోజూ 30 వేలకుపైగా లీటర్ల పాలను సేకరిస్తోందని పేర్కొన్నారు. కరీంనగర్‌తోపాటు ముల్కనూరు డెయిరీ రైతులకూ ప్రభుత్వ ప్రోత్సహకాన్ని అందజేస్తే జిల్లాలో 80 వేల మందికి లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారు.
 
ప్రభుత్వానికి విన్నవించాం
 - చల్మెడ రాజేశ్వర్‌రావు,
కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ సంస్థ చైర్మన్ రైతులతో ఏర్పడిన మా సంస్థకు సైతం ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని సీఎం కేసీఆర్, పశుసంవర్ధకశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, జిల్లామంత్రి ఈటెల రాజేందర్‌ను ఇప్పటికే కలిసి విన్నవించాం. సీఎం సైతం సానుకూలంగా ఉండటం వల్ల పాడి రైతులకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం. త్వరలోనే ప్రకటన వస్తుందని ఎదురుచూస్తున్నాం.
 
జిల్లాకూ వర్తించేలా ప్రయత్నిస్తున్నా..
 - ఎంపీ వినోద్‌కుమార్
 విజయ డెయిరీకి పాలుపోసే రైతులకు మద్దతుగాా లీటర్‌కు రూ.4 ప్రోత్సాహకాన్ని కరీంనగర్ డెయిరీ రైతులకూ వర్తింపజేసేందుకు ప్రయత్నిస్తున్నా. త్వరలో సీఎంతో మాట్లాడి జిల్లాలోని రైతాంగానికి ప్రయోజనం కలిగేలా చేస్తా.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement