
విజయ డెయిరీ చైర్మన్ దారుణాలపై బాధిత మహిళ వీడియో
డబ్బు ఎరవేసి అమాయక అమ్మాయిలను వంచిస్తున్నాడు
ఒంటరి ఆడవాళ్లను స్పా సెంటర్లు, పబ్‌లకు తరలిస్తున్నాడు
రాజకీయ నేతలు, అధికారుల వద్దకు మహిళలను పంపుతున్నాడు
ఒంటరి మహిళనైన నన్ను ఆర్థికంగా ఆదుకుంటానని వాడుకున్నాడు
ఎవరైనా ఎదురు తిరిగితే చిత్రహింసలకు గురిచేస్తున్నాడు
సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత, మంత్రి లోకేష్ న్యాయం చేయాలి
సాక్షి, అమరావతి: విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు లైంగిక నేరాలకు పాల్పడుతున్నాడంటూ ఓ మహిళ సోమవారం తీవ్ర ఆరోపణలు చేశారు. స్పా సెంటర్లు, పబ్‌ల పేరుతో ఆయన సాగిస్తున్న దారుణాలను కళ్లకు కట్టినట్టు చెప్పారు. తనకు న్యాయం చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత, మంత్రి లోకేశ్‌ను వేడుకున్నారు. ‘పదవి కోసం నాతోపాటు అనేకమంది మహిళల జీవితాలను చలసాని ఆంజనేయులు నాశనం చేస్తున్నాడు.
డబ్బు ఆశ చూపి ఒంటరి మహిళలను నరక కూపాల్లోకి నెడుతున్నాడు. నేనూ ఓ బాధితురాలినే’ అని కన్నీరు పెడుతూ మీడియాకు విడుదల చేసిన వీడియో రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. బాధితురాలు ఏమన్నారంటే.. ‘‘నా పేరు కొడాలి ప్రమీల. మాది బాపులపాడు గ్రామం. ఇద్దరు ఆడపిల్లలున్నారు. 2019లో నా భర్త చనిపోయాడు. తెలిసిన రిపోర్టర్ ద్వారా ఉద్యోగం కోసం ఆంజనేయులు వద్దకు వెళ్లాను. విజయవాడలో పాల ఫ్యాక్టరీలో పెట్టారు.
కొన్ని రోజులకు స్వీట్ల తయారీకి మార్చారు. దేవుడు అనుకున్న ఆంజనేయులు నిజ స్వరూపం అప్పుడు బయటపడింది. ఆడవాళ్లను చూస్తే అతడు పిచ్చెక్కిపోయి సైకోలా ప్రవర్తిస్తుంటాడు. భర్త లేడు కదా, అప్పులున్నాయి కదా, ఆర్థికంగా ఆదుకుంటానని నమ్మించి నన్ను లొంగదీసుకున్నాడు. కొన్నాళ్లు మేం సహజీవనం చేశాం.
⇒ 2022 ఫిబ్రవరి 7న నన్ను క్యాబిన్‌కు పిలిచాడు. హైదరాబాద్, విశాఖలో పబ్‌లు పెడుతున్నామని, అక్కడికి డబ్బున్న మగవాళ్లు వస్తారని, వారికి అమ్మాయిలతో అవసరాలు ఉంటాయని అప్పుల పాలైన వాళ్లు, ఒంటరి మహిళలు ఉంటే చూడమని కోరాడు. ఆంజనేయులు ఆడపిల్లలను అడ్డుపెట్టుకుని చాలా దారుణమైన పనులు చేస్తున్నాడు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ఆఫీసర్ల వద్దకు తీసుకెళ్తున్నాడు. మాట విననివారిపై దొంగతనం నెపం నెట్టి ఉద్యోగం నుంచి తీసేస్తాడు. నన్నూ అలానే పంపించేశాడు. మూడు రోజులు గదిలో బంధించి, చిత్రహింసలు పెట్టాడు. మూడు నెలల క్రితమే నేను వచ్చేసినా వదలడం లేదు. మేనేజర్ యశ్వంత్‌తో ఫోన్ చేయిస్తున్నాడు అమ్మాయిలను పంపమని వేధిస్తున్నాడు.
⇒ హైదరాబాద్, విశాఖల్లో ఆంజనేయులుకు మసాజ్ సెంటర్లు, పబ్‌లు ఉన్నాయి. డబ్బు ఎరవేసి అమ్మాయిలను అందులో పెడుతున్నాడు. వేమూరి సాయి, చలసాని చక్రపాణి, యాసిన్, పాలగుల నాని వంటి చాలామందికి ఈ విషయం తెలుసు. వీరందరినీ కఠినంగా శిక్షించాలి. నాలాంటి బాధిత మహిళలు చాలామంది ఉన్నారు. చెప్పుకోలేక కుంగిపోతున్నారు. నేను వాటిని భరించలేక ఏమైపోయినా పర్లేదని బయటకు వచ్చాను. న్యాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నా.