సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాల్లో పాలసేకరణ ధరను అమూల్ పెంచింది. ఇటీవలే కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాలసేకరణ ధరను పెంచిన అమూల్ తాజాగా రాయలసీమ జిల్లాల్లో లీటరు గేదెపాలపై రూ.2.47, ఆవుపాలపై రూ.1.63 చొప్పున పెంచింది. ఈ పెంపు గురువారం నుంచి అమల్లోకి రానుంది. జగనన్న పాలవెల్లువ కింద అమూల్ తరఫున రాయలసీమ జిల్లాల్లో కైరా, కోస్తాంధ్రలో సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలు సేకరిస్తున్నాయి.
ఇటీవలే కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో నాలుగోసారి పాలసేకరణ ధర పెంచగా, రాయలసీమ జిల్లాల్లో నేటినుంచి అమలు చేస్తోంది. రాయలసీమ జిల్లాల్లో లీటరు ఆవుపాలకు (ఫ్యాట్ 3.5 శాతం, ఎస్‌ఎన్‌ఎఫ్ 8.5 శాతం) చెల్లిస్తున్న ధరను రూ.30.50 నుంచి రూ.32.13కు పెంచింది. లీటరు గేదెపాలకు (ఫ్యాట్ 6 శాతం, ఎస్‌ఎన్‌ఎఫ్ 9 శాతం) చెల్లిస్తున్న ధరను రూ.42.50 నుంచి రూ.44.97కు పెంచింది. కిలో ఘనపదార్థాలకు రూ.7.9 నుంచి రూ.9.5కు పెంచారు.
హ్యాండ్లింగ్ చార్జీల కింద లీటరు ఆవుపాలకు (ఫ్యాట్ 4 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్ 8.5 శాతం) రూ.1.24, గేదెపాలకు (ఫ్యాట్ 8 శాతం, ఎస్‌ఎన్‌ఎఫ్ 9.2 శాతం) రూ.1.64 చొప్పున సొసైటీలకు చెల్లించనున్నారు. అమూల్ దాణాపై 50 కిలోల బస్తాకు రూ.10 చొప్పున ఆయా సొసైటీ కార్యదర్శులకు ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. ఫలితంగా వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలోని 44 వేలమంది రైతులతోపాటు 3,768 మహిళా పాడిరైతు సంఘాలు లబ్ధిపొందనున్నాయి.
అమూల్ రాకతో అదనపు లబ్ధి
జగనన్న పాలవెల్లువ పథకాన్ని ఇటీవలే తిరుపతి జిల్లాకు విస్తరించారు. ప్రస్తుతం 17 జిల్లాల్లో 1,644 ఆర్బీకేల పరిధిలోని 2,856 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ అమలవుతోంది. 2,47,958 మంది మహిళా పాడిరైతుల నుంచి రోజూ 1.50 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. గడిచిన 24 నెలల్లో 5.12 కోట్ల లీటర్ల పాలు సేకరించారు. పాలుపోసిన పదిరోజుల్లోనే డబ్బు చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు రూ.219.57 కోట్లు చెల్లించారు. లీటరుపై రూ.4 అదనంగా లబ్ధిచేకూర్చేలా కృషిచేస్తామని పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
ఆ హామీ కంటే మిన్నగా లీటరు గేదెపాలపై రూ.15 నుంచి రూ.20 వరకు, ఆవుపాలకు రూ.10 వరకు అదనంగా లబ్ధిచేకూర్చారు. ప్రైవేటు డెయిరీలు ఇస్తున్న రేట్లతో పోలిస్తే జగనన్న పాలవెల్లువ అమలవుతున్న గ్రామాల్లోని రైతులు రూ.25 కోట్ల వరకు అదనంగా లబ్ధిపొందారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా ప్రైవేటు డెయిరీలు కూడా పోటీపడి ధరలను పెంచాల్సి వచ్చింది. మూడేళ్లలో వరుసగా నాలుగుసార్లు పెంచడంతో అమూల్‌తో పోటీని తట్టుకోలేక ప్రైవేటు డెయిరీలు సైతం లీటరుపై రూ.15 వరకు పెంచాల్సి వచ్చింది.
ఫలితంగా జగనన్న పాలవెల్లువ పథకం కింద పాలుసేకరిస్తున్న గ్రామాల్లోనే కాదు.. ప్రైవేటు డెయిరీలకు పాలుపోస్తున్న రైతులకు కూడా గతంలో ఎన్నడూ లేని రీతిలో లబ్ధికలిగింది. ఆయా డెయిరీల పరిధిలోని రైతులు మూడేళ్లలో రూ.2,354.22 కోట్ల మేర లబ్ధిపొందగలిగారు. ఇప్పటికే అమూల్ తరఫున పాలు సేకరిస్తున్న సబర్కాంత్, బనస్కాంత్ యూనియన్లు పాలసేకరణ ధర పెంచగా, తాజాగా గురువారం నుంచి రాయలసీమ జిల్లాల్లో పాలుసేకరిస్తున్న కైరా యూనియన్ కూడా నాలుగోసారి పెంచింది. జగనన్న పాలవెల్లువ పథకాన్ని డిసెంబర్ కల్లా మిగిలిన జిల్లాలకు విస్తరించేదిశగా ముందుకెళుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment