ఏపీ–అమూల్ ప్రాజెక్టు వాహనాన్ని ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్
పాదయాత్రలో నేను ‘పాడి ఉన్న ఇంట సిరులు దొర్లునట..’ అన్నాను. ఆ మాటలను ఇవాళ గుర్తుకు తెచ్చుకుంటే సంతోషంగా ఉంది. కేవలం వ్యవసాయంతోనే బతకడం కష్టం. ఆదాయం పెరగాలంటే పాడి సహకారం అవసరం. అందుకే ఆసరా, చేయూత పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలిచాం. వారికి ఇచ్చిన డబ్బులు సద్వినియోగం అయ్యేలా, జీవిత కాలం.. మరో శతాబ్దం పాటు వారికి మేలు కలిగేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
–సీఎం వైఎస్ జగన్
లీటర్‌కు రూ.15 అదనంగా వచ్చాయి
నేను ప్రైవేటు డెయిరీలో గతంలో పాలు పోసేదాన్ని. అప్పుడు లీటరుకు రూ.33 నుంచి రూ.35 పడింది. అమూల్ కేంద్రంలో ఇప్పుడు అదే పాలకు రూ.50 వచ్చాయి. అంటే రూ.15 అదనం. చాలా సంతోషంగా ఉంది. లీటరుకు రూ.33 ఇస్తుంటే ఏం లాభం అని అందరూ పాడి తీసేయాలనుకుంటుంటే మీరు ఇలా మేలు చేశారు. ఎప్పుడూ మీరే సీఎంగా ఉండాలి అన్నా.
– జట్టి విజిత, అల్లూరు, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ చేయూత, ఆసరా అక్కచెల్లెమ్మలకు పాడి పశువుల ద్వారా ప్రతి రోజూ మెరుగైన సుస్థిర ఆదాయం కల్పించాలనే లక్ష్యంతోనే ఏపీ–అమూల్ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. వారికి శాశ్వతంగా జీవిత కాలం ఆదాయం కల్పించడానికి వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. లీటర్ పాలకు అదనంగా రూ.5 నుంచి రూ.7 వరకు ఇస్తారన్నారు. ఏపీ–అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టు తొలి దశ కార్యక్రమాన్ని బుధవారం ఆయన సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. తొలి దశలో చిత్తూరు, వైఎస్సార్ కడప, ప్రకాశం జిల్లాల్లో 400 గ్రామాల్లో పాలసేకరణ ప్రారంభించడంతో పాటు లబ్ధిదారులకు పాడి పశువుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు సీదిరి అప్పలరాజు, కన్నబాబు, బాలినేని, పెద్దిరెడ్డి, అమూల్ ఎండీ ఆర్‌ఎస్ సోథి తదితరులు
ఇవాళ్టి ప్రాజెక్టుతో ఆ కల సాకారం
► నా పాదయాత్రలో లీటర్ వాటర్ బాటిల్‌ను రైతులు తీసుకు వచ్చారు. ఒక లీటరు వాటర్ ధర రూ.21 ఉంది. ఈ రోజు పాల ధర కూడా అంతే ఉందని చెప్పి బాధపడ్డారు. నాకు బాగా గుర్తుంది. అప్పుడే పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని నిర్ణయించుకున్నాను.
► సహకార రంగాన్ని బలపరచాలి. మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచాలి. మనం రూ.4 ఎక్కువగా ఎప్పుడైతే సహకార రంగం నుంచి ఇస్తామో, అప్పుడు ప్రైవేటు డెయిరీలు కూడా రేట్లు పెంచాల్సిన పరిస్థితి వస్తుంది. తద్వారా రేట్లు పెరుగుతాయి. దీనివల్ల అక్కచెల్లెమ్మలకు ఆదాయం పెరిగి మేలు జరుగుతుంది. ఇదే విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టాం.
పాలు పోసే అక్కచెల్లెమ్మలే ఓనర్లు
► ఈ ఏడాది జులై 21న మన ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. తద్వారా రైతులకు లీటర్ పాలకు దాదాపు రూ.5 నుంచి రూ.7 వరకు అదనంగా దక్కుతుంది. అమూల్ అన్నది సహకార ఉద్యమం, దానికి ఓనర్స్ ఎవరూ లేరు. పాలు పోసే అక్కచెల్లెమ్మలే ఓనర్లు.
► ఎక్కువ ధరకు కొనుగోలు చేయడమే కాకుండా ఆ తర్వాత లాభాలను కూడా బోనస్‌గా సంవత్సరానికి రెండు సార్లు చొప్పున ఇస్తారు. అమూల్ భారతదేశంలోనే కాదు ప్రపంచంతో పోటీపడే కంపెనీ. ఈ మధ్య కాలంలో ఐఎఫ్‌సీఎన్ (ఇంటర్నేషనల్ ఫార్మ్ కంపేరిజన్ నెట్‌వర్క్) ఇచ్చిన రిపోర్టు చూస్తే అమూల్‌కి 8వ స్థానం దక్కింది.
అమూల్ స్టాల్‌లోని ఉత్పత్తులను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
9,899 గ్రామాల్లో బీఎంసీలు
► రాష్ట్ర వ్యాప్తంగా 9,899 గ్రామాల్లో రూ.3 వేల కోట్లతో బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీ), ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాలు (ఏఎంసీయూ) ఏర్పాటు చేస్తున్నాం. బీఎంసీలు రెండు వేల లీటర్ల పాలను స్టోర్ చేయగలిగిన సామర్థ్యంతో ఉంటాయి.
► తొలివిడతగా ఈ రోజు చిత్తూరు, వైఎస్సార్ కడప, ప్రకాశం జిల్లాల్లోని 400 గ్రామాల్లో పాల సేకరణ మొదలు పెడుతున్నాం. త్వరలోనే ఇది ప్రతి నియోజకవర్గం.. 9,899 గ్రామాలకు విస్తరిస్తుంది. పాల సేకరణ తర్వాత 10 రోజుల్లోనే రైతుల ఖాతాలకు డబ్బులు జమ అవుతాయి. ఎక్కడా మధ్యవర్తులు ఉండరు. కమీషన్లు ఇచ్చుకోవడం ఉండదు.
4.69 లక్షల మందికి ఆవులు, గేదెలు
► మహిళలు మోసపోకుండా మంచి ఆదాయం వచ్చే మార్గాలను సృష్టించడంలో భాగంగా ఐటీసీ, అలానా గ్రూప్ వంటి అనేక పెద్ద పెద్ద సంస్థలతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాం.
► ఇందులో భాగంగానే 4.69 లక్షల మంది మహిళలు ఆవులు, గేదెలు ఇవ్వండని అడిగారు. ఒకేసారి అన్ని యూనిట్లు దొరకవు కాబట్టి (ఒక యూనిట్ అంటే ఒక గేదె లేదా ఆవు) దశల వారీగా ఇస్తాం. ఇవాళ 7 వేల యూనిట్లు పంపిణీ చేస్తున్నాం.
► వచ్చే ఏడాది ఫిబ్రవరికి లక్ష యూనిట్లు, ఆగస్టు నుంచి మళ్లీ ఫిబ్రవరి వరకు మరో 3.69 లక్షలకుపైగా యూనిట్లు పంపిణీ చేస్తాం. ఒక్క రూపాయి కూడా అక్కచెల్లెమ్మలు పెట్టాల్సిన అవసరం లేదు. లబ్ధిదారులు స్వయంగా కూడా పశువులను కొనుగోలు చేయవచ్చు.
► పంజాబ్, హరియాణా, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి అధిక పాల దిగుబడినిచ్చే ఆవులు, గేదెలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది.
10న గొర్రెలు, మేకలు పంపిణీ
► డిసెంబర్ 10వ తేదీన 2.49 లక్షల మేకలు, గొర్రెల యూనిట్లు కూడా ప్రారంభిస్తున్నాం. ఒక్కో యూనిట్‌లో 15 గొర్రెలు, మేకలు ఉంటాయి. దాదాపుగా 77 వేల రిటైల్ షాపులు హిందుస్థాన్ లీవర్, ఐటీసీ సంస్థల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలతో ఇప్పటికే ఏర్పాటు చేయించాం. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కలసి నడవడానికి ముందుకు వచ్చిన అమూల్ సంస్థకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.
► ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసాల కన్నబాబు, డాక్టర్ సీదిరి అప్పలరాజు, సీఎస్ నీలం సాహ్ని, స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, కైరా మిల్క్ యూనియన్ (అమూల్ డెయిరీ) ఎండీ అమిత్ వ్యాస్, సబర్ కాంత మిల్క్ యూనియన్ (సబర్ డెయిరీ) ఎండీ డాక్టర్ బీఎం పటేల్ పాల్గొన్నారు.
ఏపీలో మహిళలు ఘన విజయం సాధిస్తారు
మొదటి సారి ఒక రాష్ట్రం సహకార ఉద్యమాన్ని తన ఉద్యమంగా భావించింది. ఏపీ ఇప్పటికే మత్స్య, పౌల్ట్రీ ఉత్పత్తుల్లో అగ్ర స్థానాల్లో ఉంది. ఇప్పుడు పాల ఉత్పత్తిలో కూడా ముందడుగు వేస్తోంది. ఏపీలో ప్రజలు అంకిత భావం ఉన్న వారు. ఏపీలో మహిళలు ఘన విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను.
– వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రొఫెసర్ సశ్వత ఎన్.బిస్వాస్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్ (ఇర్మా), డైరెక్టర్
సీఎం కృషి వల్లే ఇదంతా..
36 లక్షల రైతుల కుటుంబాలు అమూల్‌కు ఓనర్లుగా ఉన్నాయి. ఇది రైతుల సంస్థ. ఏ కంపెనీ అయినా తక్కువ ఖరీదుకు కొని ఎక్కువ డబ్బుకు అమ్మాలని తన సీఈఓకు చెబుతుంది. కాని అమూల్‌లోని 18 మంది బోర్డు సభ్యులు.. ఎక్కువ రేటుకు పాలు కొని, వినియోగదారులకు సరసమైన ధరలకే అమ్మాలని చెబుతారు. మీ కళ్లముందే అన్నీ జరుగుతాయి. ఇందుకు కారణమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు.
– డాక్టర్ ఆర్.ఎస్.సోథి, ఎండీ,గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (అమూల్)
రెట్టింపు డబ్బులొస్తున్నాయి
గతంలో నాకు నాలుగు ఎనుములు (గేదెలు) ఉండేవి. మీ నాన్నగారు ఉన్నప్పుడు లోన్ శాంక్షన్ అయితే కొనుక్కున్నాం. లీటరుకు 4.5 వెన్న శాతం వస్తే.. రూ.25 వచ్చేవి. 4 లీటర్ల పాలు పోస్తే రోజుకు వంద రూపాయలు వచ్చేవి. అదే పనికి పోతే ఎక్కువ డబ్బులు వస్తాయని మూడు ఎనుములు అమ్మేసి, ఒకటి ఉంచుకున్నాం. ఇప్పుడు అదే పాలను అమూల్ డెయిరీకి తీసుకెళ్లి పోశాం. 6.5 వెన్న శాతంతో లీటరుకి రూ.50 డబ్బులు పడింది. నాలుగు లీటర్ల పాలు పోస్తే రోజుకు రూ.200 వచ్చాయి.
– అశ్వని, నల్లపురెడ్డి పల్లె, వైఎస్సార్ కడప జిల్లా.
ఇదీ మన గ్రామ స్వరూపం
రాబోయే రోజుల్లో గ్రామ స్వరూపం పూర్తిగా మారుతుంది. గ్రామంలోకి అడుగు పెట్టగానే గ్రామ సచివాలయం కనిపిస్తుంది. అందులో పనిచేసే వాళ్లు కనిపిస్తారు. నాలుగు అడుగులు ముందుకేస్తే ఇంగ్లిష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది. అదే గ్రామంలో ఇటువైపు అడుగులు వేస్తే వైఎస్సార్ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. అందులో ఒక ఏఎన్‌ఎం 24 గంటలు 51 రకాల మందులతో అంటుబాటులో ఉంటారు. ఆ క్లినిక్ ఆరోగ్యశ్రీకి రిఫరల్ పాయింట్‌గా ఉంటుంది. ఆ తర్వాత ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే.. ఆర్బీకే, బల్క్ మిల్క్ యూనిట్, మరో నాలుగు అడుగులు వేస్తే రాబోయే రోజుల్లో జనతా బజార్ కనిపిస్తుంది. రొయ్యలు, చేపలు మన గ్రామంలో పండించే పంటలు అక్కడ దొరుకుతాయి. విత్తనం దగ్గర నుంచి పంట అమ్మకం వరకు మన గ్రామంలోనే వలంటీర్ చేయి పట్టుకుని సహాయం చేసే పరిస్థితి కళ్ల ఎదుటనే కనిపిస్తుంది. ఒక్క సంవత్సరంలో ల్యాండ్ స్కేప్ పూర్తిగా మారిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment