పెట్టుబడి.. గిట్టుబాటు కావాలి: సీఎం జగన్‌ | CM Jagan Review On Distribution Of Dairy Cattle And Sheep And Goats | Sakshi
Sakshi News home page

నవంబరు 26న పాడి పశువుల పంపిణీ

Published Thu, Nov 19 2020 3:59 PM | Last Updated on Thu, Nov 19 2020 4:25 PM

CM Jagan Review On Distribution Of Dairy Cattle And Sheep And Goats - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ చేయూత, ఆసరా లబ్ధిదారులైన మహిళలకు పాడి పశువులు, గొర్రెలు, మేకల పంపిణీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఆయా శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. జిల్లాల వారీగా లబ్ధిదారులు, వారికి ఇవ్వనున్న పాడి పశువులు తదితర అంశాలపై సీఎం నిశితంగా సమీక్షించారు. అధికారులు వివరాలను అందించారు. 2,11,780 ఆవులు, 2,57,211 గేదెలు, 1,51,671 గొర్రెలు, 97,480 మేకల పంపిణీకి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. (చదవండి: 26 వేల కోట్లతో పేదలకు ఇళ్లు)

లబ్ధిదారులకు ఇవ్వనున్న ప్రతి పశువునూ  పశు సంవర్థక శాఖ అధికారులు భౌతికంగా తనిఖీ (ఫిజికల్‌ వెరిఫికేషన్‌) చేయనున్నారు. లబ్ధిదారుల జాబితాను ఆర్బీకేల పరిధిలో రిజిస్టర్‌ చేయనున్నారు. ప్రతి నెలా పశువు అరోగ్యాన్ని వైద్యుడు పరిశీలించనున్నారు. పాడి పశువుకు ఇచ్చే ఆరోగ్య కార్డులో ఎప్పటికప్పుడు  పశు వైద్యులు వివరాలు నమోదు చేయనున్నారు. అలాగే పాడి పశువు ఇచ్చే పాల దిగుబడి కూడా నమోదు చేయనున్నారు. నవంబరు 26 నుంచి తొలిదశలో పాడి పశువుల పంపిణీ జరగనుంది. వర్చువల్‌ విధానంలో 4 వేల గ్రామాల్లో పంపిణీని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. తొలుత ప్రకాశం, వైఎస్సార్‌ కడప, చిత్తూరు జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. తర్వాత దశల వారీగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

సమీక్ష సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ పెట్టుబడికి కచ్చితంగా గిట్టుబాటు రావాలని, అందుకనే జాతుల ఎంపికలో జాగ్రత్త వహించాలని తెలిపారు. ‘‘ పర్జేజ్‌ కమిటీ బలంగా ఉండాలి. ఆ కమిటీలో కచ్చితంగా సాంకేతిక నైపుణ్యం కలిగిన వారు ఉండాలి. బీమా సంస్థ ప్రతినిధితో పాటు, బ్యాంకర్‌ కూడా ఆ కమిటీలో సభ్యులుగా ఉండాలి. వెటర్నరీ సర్వీసులు కూడా బలోపేతం చేయాలి. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసుకోవాలని’’ సీఎం సూచించారు. (చదవండి: సీఎం జగన్‌ ఆదేశంతో 108 కోట్లు మిగులు)

పాడి పశువులకు ఎలాంటి సమస్య వచ్చినా ఆర్బీకేల పరిధిలో వెంటనే వాటికి వైద్యం అందాలని సీఎం ఆదేశించారు. ఆ స్థాయిలో అధికారులు సన్నద్ధం కావాలని నిర్దేశించారు. ఆర్బీకేల పరిధిలో ఏర్పాటు చేస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయాలను పశువుల వైద్యానికి వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు.

‘‘కాల్‌ సెంటర్ల ఏర్పాటు, వాటి ద్వారా వైద్యం అందేలా చూడాలి. పశు దాణా సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలి. పశు దాణాలో రసాయనాలు (కెమికల్స్‌) లేకుండా చూడాలి. సహజమైన పదార్థాలతో దాణా తయారయ్యేలా చూడాలి. రసాయనాలో కలుషితమైన ఆహారం కారణంగా క్యాన్సర్‌ లాంటి వ్యాధులు పెరుగుతున్నాయి. సేంద్రీయ పద్దతులకు పెద్ద పీట వేయాలి. సేంద్రీయ (ఆర్గానిక్‌) పాలు, సేంద్రీయ మాంసం ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి. దీని వల్ల మరింత ధర లభించే అవకాశం ఉంటుంది. సేంద్రీయ పాల బ్రాండ్‌ను మరింత ప్రమోట్‌ చేయాలి. దీనిపై మహిళలకు మరింత అవగాహన కల్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు.

చేయూత, ఆసరా పథకాల కింద గ్రామాల్లో మహిళలు ఏర్పాటు చేసుకున్న చిల్లర దుకాణాలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకూ అర్బన్, రూరల్‌ ప్రాంతాల్లో కలిపి 78 వేల దుకాణాలు ప్రారంభం అయ్యాయని అధికారులు తెలిపారు. చేయూత కింద కొత్తగా లబ్ధి పొందిన 2.78 లక్షల మంది నుంచి కూడా ఆప్షన్లు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వారు కూడా సుస్థిర జీవనోపాధి పొందేలా చూడాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్దేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement