చంద్రబాబు, హెరిటేజ్‌ కోసం అమూల్‌ను తేలేదు | AP Assembly Session: CM Jagan Comments An Agreement with Amul | Sakshi
Sakshi News home page

‌చంద్రబాబు మీద కోపంతో అమూల్‌ను‌ తేలేదు: సీఎం జగన్

Published Fri, Dec 4 2020 5:21 PM | Last Updated on Fri, Dec 4 2020 7:44 PM

AP Assembly Session: CM Jagan Comments An Agreement with Amul - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా అయిదో రోజు అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై శాసనసభలో స్వల్ప వ్యవధి చర్చ జరిగింది. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి, పాల ఉత్పత్తిదారులైన రైతులు, మహిళలకు మరింత ఆర్థిక స్వావలంబన చేకూర్చే విధంగా అమూల్‌తో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందంపై శుక్రవారం చర్చించారు. అనంతరం సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. అమూల్‌ సంస్థలో రైతులే యజమానులు అని పేర్కొన్నారు. అమూల్‌ ఒక సహాకార సంస్థ అని ఇది నేడు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయంగా పోటిపడుతోందన్నారు. ప్రపంచంలోనే అమూల్‌ 8వ స్థానంలో ఉందన్నారు. చదవండి: ఎల్లో మీడియాపై సీఎం జగన్‌ ఆగ్రహం

అతి పెద్ద సహకార డెయిరీ
అమూల్‌ అన్ని బహుళ జాతి సంస్థలు. 50 దేశాలలో పోటీ పడుతోందని పేర్కొన్నారు. దేశంలోనే ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అత్యంత పెద్ద సహకార రంగంలోని సంస్థ అని తెలిపిన సీఎం జగన్‌ ఆ సంస్థలో వచ్చే లాభాలు, అవి తీసుకునేవారు రైతులేనని పేర్కొన్నారు. ఎందుకంటే రైతులే ఆ సంస్థలో వాటాదారులు. ఇక్కడ సేకరించే పాలకు అమూల్‌ సంస్థ అక్క చెల్లెమ్మలకు అత్యధిక ధరలు ఇవ్వడమే కాకుండా, సంస్థకు వచ్చే ఆదాయాన్ని ఏటా రెండుసార్లు తిరిగి ఇస్తారన్నారు. అంత గొప్ప కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతోందని ప్రశంసించారు. ఇంకా ఏమన్నారంటే..

మినరల్‌ వాటర్‌ కన్నా తక్కువ ధర
‘ప్రభుత్వ పెద్దగా, ఒక కుటుంబ పెద్దగా మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు చూస్తే.  నా పాదయాత్రలో కొందరు మినరల్‌ వాటర్‌ బాటిల్‌ తీసుకువచ్చి చూపి, దాన్ని రూ.21కి కొంటున్నామని, లీటరు పాలకు కూడా దాదాపు అదే ధర వస్తోందని చెప్పారు. అంటే మినరల్‌ వాటర్‌తో సమాన ధరకు వారు పాలు అమ్ముకోవడం దారుణ పరిస్థితి. మొన్న అమూల్‌ లాంచ్‌ సందర్భంగా అక్క చెల్లెమ్మలు చెప్పారు. తాము పశువులను అమ్ముకుందామనుకున్నామని, కాని ఇప్పుడు నమ్మకం కలిగిందని అంతా చెప్పారు. చదవండి: పచ్చి అబద్ధాలకు ఫుల్‌ స్టాప్‌ పడాలి

రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితి?
రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం పాలు పోసే వారికి మంచి ధర రానివ్వకుండా చేశారు. ఆ విధంగా సహకార రంగాన్ని ఒక పద్ధతి ప్రకారం చంపేశారు. ఎప్పుడైతే సహకార రంగం అనేది లేకుండా పోతుందో, అప్పుడు ప్రైవేటు డెయిరీలు ఒక్కటై ఒకే ధర నిర్ణయిస్తున్నారు. అంతకు మించి ఇవ్వబోమంటున్నారు. గత్యంతరం లేక పాలు వారికే పోయాలి, లేదా పాడి పశువులు అమ్ముకోవాలి. ఒక పద్ధతి ప్రకారం సహకార రంగాన్ని చంపేయడం వల్ల ఆ పరిస్థితి వచ్చింది. త దారుణ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే.. కేవలం ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ప్రైవేటు డెయిరీ స్థాపించడం, దాన్ని లాభాల్లో ఉంచడం కోసం రాష్ట్రంలో ఉన్న మొత్తం సహకార రంగాన్ని చంపేశాడు.  1974 వరకు డెయిరీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవగా, ఆ ఏడాది డెయిరీ అభివృద్ది సంస్థ పరిధిలోకి తెచ్చారు. ఆ తర్వాత 1981లో డెయిరీ రంగంలో త్రీ టయర్‌ కోఆపరేటివ్‌ వ్యవస్థ ఏర్పడింది. దాంతో 9 సహకార సంఘాలు ఏర్పాటయ్యాయి. అక్కడి నుంచి ప్రయాణం బాగా జరిగింది.

‘మ్యాక్స్‌’ చట్టంతో గ్రహణం
1995లో ‘పరస్పర సహాయ సహకార సంఘాల’ (మ్యాక్స్‌) చట్టం వచ్చింది. దాన్ని చంద్రబాబు తెచ్చారు. అంతకు ముందు 1992లో హెరిటేజ్‌ ప్రారంభించిన చంద్రబాబు, 1995లో సీఎం కాగానే, ఏపీ మ్యాక్స్‌ చట్టం తెచ్చారు. అనంతరం విశాఖ డెయిరీని1999లో, కృష్ణా డెయిరీని 2001లో, గుంటూరు డెయిరీని 1997లో, ప్రకాశం డెయిరీని 2002లో, నెల్లూరు డెయిరీని 2002లో, కర్నూలు డెయిరీని 2002లో  సహకార రంగంలో ఉన్న ఈ డెయిరీలన్నీ మ్యాక్స్‌ చట్టం పరిధిలోకి తెచ్చారు. ఆ విధంగా చంద్రబాబు హయాంలోనే వాటన్నింటినీ మార్చారు. ఏపీ మ్యాక్స్‌.. ఏదైనా సొసైటీ లేదా యూనియన్, మ్యాక్స్‌కు మారాలి అంటే, ఆయా సహకార సంస్థలలో ఉన్న ప్రభుత్వ వాటా, ఆస్తులను వెనక్కు ఇవ్వాలి. లేదా ఆ రీఫండ్‌కు సంబంధించి ప్రభుత్వంతో ఒక అవగాహన (ఎంఓయూ) చేసుకోవాలి. అయితే ఆ నియమాలన్నింటినీ తుంగలో తొక్కి విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల డెయిరీలను మ్యాక్స్‌ చట్టం పరిధిలోకి తెచ్చారు.

అంత కన్నా అన్యాయం
అది ఒక రకమైన అన్యాయమైతే విశాఖ జిల్లా సహకార సంఘాన్ని 2006లోనూ, గుంటూరు, ప్రకాశం జిల్లాల సహకార సంఘాలను 2013లో ప్రొడ్యూసర్‌ కంపెనీల కింద మార్చేశారు. కంపెనీల చట్టంలో అలాంటి అవకాశం లేకపోయినా వాటిని మార్చేశారు. అంతే ఒక పద్ధతి ప్రకారం సహకార సంస్థలను ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోకి తీసుకునే కార్యక్రమం జరిగింది. ఆ స్థాయిలోకి వ్యవస్థను దిగజార్చారు. ఇవాళ ఉభయ గోదావరి, కడప, చిత్తూరు, అనంతపురం డెయిరీలు ఏపీ సహకార సంఘాల పరిధిలో ఉంటే, కృష్ణా, నెల్లూరు, కర్నూలు డెయిరీలు మ్యాక్స్‌ చట్టం కింద, గుంటూరు, ప్రకాశం, విశాఖ డెయిరీలు కంపెనీల చట్టం పరిధిలో ఉన్నాయి. అంటే ఒక పద్ధతి ప్రకారం డెయిరీలను నిర్వీర్యం చేశారు. ఇవాళ సంగం డెయిరీని ఎవరైనా సహకార రంగం డెయిరీ అని చెబుతారా. ధూళిపాళ్ల నరేంద్ర అనే వ్యక్తి దాన్ని ప్రైవేటు సంస్థ కింద నడుపుతున్నాడు.ఆ విధంగా సహకార రంగాన్ని ఒక పద్ధతి ప్రకారం ఖూనీ చేశారు.

చంద్రబాబు–చిత్తూరు డెయిరీ
చంద్రబాబు దగ్గరుండి డెయిరీలను ఖూనీ చేశారు. అది ఏ స్థాయిలో ఆ పని చేశారంటే.. చిత్తూరు డెయిరీ అయితే ఒకప్పుడు హెరిటేజ్‌ డెయిరీకి పోటీ పడ్డాయి. దాంతో దాన్ని ఖూనీ చేయడం కోసం, ఈ పెద్దమనిషి సీఎంగా ఉన్నప్పుడు, 2003లో చిత్తూరు డెయిరీని మూసేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల క్లిప్‌ ప్రదర్శించి చదివి వినిపించారు. ఇక చంద్రబాబుకు కావాల్సిన మనిషి దొరబాబు. ఆయనను బీఎస్‌ రాజా నర్సింహులు అని కూడా అంటారు. ఆయన చిత్తూరు డెయిరీకి ఛైర్మన్‌గా పని చేశారు. ఆయనను ఛైర్మన్‌ను చేసి చంద్రబాబు చక్రం తిప్పారు. తర్వాత విజయవంతంగా చిత్తూరు డెయిరీని ఆయన మూసివేయించాడు. దొరబాబు ఆ పని చేశాడు కాబట్టి, ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చాడు. ఏ రకంగా సహకార రంగాన్ని మూసివేయించారనడానికి ఇది ఒక ఉదాహరణ’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.. ఇంకా ఆయన మాటల్లోనే..

అధికారంలో ఉంటే హెరిటేజ్‌ లాభాలు:
► చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు హెరిటేజ్‌ లాభాలు, షేర్‌ విలువ పెరుగుతాయి. ఆయన దిగిపోతే తగ్గిపోతాయి.
► 1999 నుంచి జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ ప్రకారం హెరిటేజ్‌ షేర్‌ ధర చూస్తే..
► చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 1999 జనవరి,1న హెరిటేజ్‌ షేర్‌ ధర రూ.2.89 ఉండగా, అది డిసెంబరు 12, 2003 నాటికి ఏకంగా రూ.26.90 అయింది.
► ఆ తర్వాత 2009 ఎన్నికల ముందు, చంద్రబాబు అధికారంలో లేనప్పుడు ఏప్రిల్‌ 9. 2009 నాటికి షేర్‌ ధర రూ.16.35కు పడిపోయింది.      
►మళ్లీ సైకిల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం (కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు)  సమయంలో రూ.35 నుంచి రూ.100కు పెరిగింది.
► 2014లో ఆ పెద్దమనిషి సీఎం అయ్యాక రికార్డు స్థాయిలో రూ.100 షేర్‌ 2017 డిసెంబరు నాటికి రికార్డు స్థాయిలో రూ.827కు పెరిగింది.
► ఆయన సీఎంగా ఉన్నప్పుడు షేర్‌ విలువ ఆ స్థాయిలో పెరిగితే ఏమనాలి?
► బాబు గారు దిగిపోయిన తర్వాత 2020 మార్చి నాటికి హెరిటేజ్‌ షేర్‌ ధర  మళ్లీ రూ.205కు తగ్గింది.
► ఒక్కసారి గమనించండి. బాబు అధికారంలో ఉంటే ఆయన డెయిరీ షేర్‌ విలువ పెరిగింది. ఆయన అధికారంలో లేనప్పుడు ప్రజల ఆదాయం పెరిగింది. 

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా–హెరిటేజ్:
► ఇది ఏఎన్‌ఐ రిపోర్టు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హెరిటేజ్‌ ఎంఓయూ. 30.12.2016న ఆ ఒప్పందం చేసుకున్నారు.
► రైతులకు సులభంగా రుణాల పేరుతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఒక ఒప్పందం (ఎంఓయూ) చేసుకుంది.
► డెయిరీ రంగంలో రైతులకు రుణాలిస్తామని చెప్పి ఆ ఒప్పందం.
►అంటే బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం, అందుకు బదులుగా వారు హెరిటేజ్‌కు మాత్రమే పాలు పోయాలన్న నిబంధన పెట్టారు.
► ఇదీ చంద్రబాబు వైఖరి. అంత దారుణ స్థితి.

అలాంటి పరిస్థితుల్లో..
►పాల ఉత్పత్తిదారులకు సరైన ధర రాని పరిస్థితుల్లో.. ఎక్కడైనా సహకార రంగం గట్టిగా ఉంటే, పోటీ ఏర్పడి, రైతులు, పాలు పోసే అక్క చెల్లెమ్మలకు ఆదాయం పెరుగుతుంది.
►దాని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 27 లక్షలకు పైగా నిమగ్నమై ఉన్న అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం కలుగుతుంది.
►వారికి మంచి ఆదాయం లభిస్తుంది. వారికి మంచి జరుగుతుంది.
►ఇవాళ డెయిరీ డెవలప్‌మెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌–ఏపీడీడీసీఎఫ్‌.
►దీని పని తీరు డెయిరీల పరిస్థితికి అద్దం పడుతోంది.
► అందుకే అమూల్‌ వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని మనం కష్టపడ్డాం.

ఒకవేళ అమూల్‌ రాకపోతే?
► ఒకవేళ అమూల్‌ రాకపోయి ఉంటే, ఇవాళ మెజారిటీ బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు మూతబడ్డాయి.
► కేవలం 800 గ్రామాల్లోనే పాల సేకరణ జరగుతోంది. చాలా డెయిరీలు మూతబడ్డాయి. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి.
► ప్రైవేటు రంగంలోనే డెయిరీలు నిలబడ్డాయి. దీంతో వాటికి పోటీ లేకుండా పోయింది.
► ప్రైవేటు డెయిరీల అనైతిక పద్ధతులు, పాడి రైతుల్లో లేని అవగాహనతో సహకార సంఘాలు నష్టాల పాలయ్యాయి. దాంతో ఆ రంగం పూర్తిగా ప్రైవేటు రంగంలోకి వెళ్లింది.
► వీటన్నింటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం 21.07.2020న అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఆ ఒప్పందం లక్ష్యాలు:
► మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి.
►వారి (పాల ఉత్పత్తిదారుల) సామాజిక ఆర్థిక ఉన్నతి. 
► రైతులకు మంచి పాల ధర అందించడం.
► వినియోగదారులకు కూడా నాణ్యమైన పాలు అందించడం.

మార్కెటింగ్‌ అనుసంధానం:
► మార్కెటింగ్‌ అనుసంధానం కోసం అమూల్‌ ఎంపిక చేసుకున్నాం.
►అందుకోసం ఒక వ్యవస్థ అవసరం. మహిళలల్లో సహకార స్ఫూర్తి రావాలి.
► ప్రతి గ్రామంలో బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు (బీఎంసీయూ)లు, ఆటోమేటిక్‌ పాల సేకరణ కేంద్రాలు కూడా రావాలి.
► అమూల్‌ ఇక్కడ ఎక్కువ ధరకు పాలు కొనుగోలు చేసి, ప్రాసెస్‌ చేసి, అమ్మి లాభాలు గడించి, ఆ మొత్తం తిరిగి బోనస్‌గా అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం.
► ఇది ఒక గొప్ప కార్యక్రమం. దేశ సహకార రంగంలో పని చేస్తున్న అతి ఉత్తమ సహకార సంస్థ అమూల్‌.
► 50 దేశాల్లో ఆ సంస్థ పని చేస్తోంది. ప్రపంచంలో 8వ స్థానంలోనూ, దేశంలో అతి పెద్ద సంస్థగానూ ఉంది.
► అమూల్‌ ఏడాదంతా రైతులకు మంచి ధర చెల్లించడమే కాకుండా, వచ్చిన ఆదాయాన్ని రైతులకు బోనస్‌గా ఇస్తుంది.

మహిళా డెయిరీ సహకార సంఘాలు
►రాష్ట్ర వ్యాప్తంగా 9899 గ్రామాలలో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉందని ప్రభుత్వం గుర్తించింది.
►అందుకే ఆయా గ్రామాలలో బీఎంసీయూలు ఏర్పాటు చేస్తోంది. అవన్నీ ఆర్బీకేల పరిధిలో ఉంటాయి.
►వాటిలో మహిళా డెయిరీ సహకార సంఘాలు ఏర్పాటు చేస్తాం.
►రూ.3 వేల కోట్లతో భవనాల నిర్మాణం. ఒక్కో దానికి రూ.16.90 లక్షల వ్యయం.
►బీఎంసీయూలు (ఒక్కోటి దాదాపు రూ.10 లక్షలు), ఆటోమేటిక్‌ పాల సేకరణ యూనిట్ల ఏర్పాటు (రూ.1.40 లక్షలు చొప్పున).
► ఆర్బీకేల పరిధిలో వాటి పక్కనే 9899 బీఎంసీయూలు, ఆటోమేటిక్‌ పాల సేకరణ కేంద్రాలు, పక్కా భవనాలు వస్తాయి. అవి గ్రామాల రూపురేఖలు మారుస్తాయి.
►సేకరించే పాలకు 10 రోజుల్లోనే పాల ఉత్పత్తిదారుల ఖాతాల్లో నగదు జమ. ఎక్కడా మధ్యవర్తి ఉండరు. లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.

తొలి దశలో..
► తొలి దశలో కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాలలో 400 గ్రామాల్లో సేకరణ మొదలైంది.
► ఇప్పటికే 7 వేల ఆవులు, గేదెలు ఇవ్వగా, వచ్చే ఫిబ్రవరి 2021 నాటికి లక్ష యూనిట్ల ఆవులు, గేదెలు ఇస్తాం. 
► ఆ తర్వాత 2021 ఆగస్టు నుంచి 2022 ఫిబ్రవరి వరకు మరో 3.69 లక్షల యూనిట్ల ఆవులు, గేదెలు ఇస్తాం.

ఇక అమూల్‌ ఇచ్చే పాల ధర:
 ఇక సేకరించే పాలకు అమూల్‌ ఏయే ధరలు చెల్లిస్తోందన్నది వివరించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. ఆ స్లైడ్‌ కూడా ప్రదర్శించి చూపారు.
► లీటరు గేదె పాలను (6 శాతం ఫ్యాట్,  9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌) హెరిటేజ్‌ సంస్థ రూ.33.60 కు, దొడ్ల డెయిరీ రూ.34.20 కి, జెర్సీ సంస్థ రూ.34.80 కి కొనుగోలు చేస్తుండగా, అమూల్‌ రూ.39 కి కొనుగోలు చేయబోతుంది. 
► అవే గేదె పాలను లీటరుకు (10 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌) సంగం, హెరిటేజ్‌ సంస్ధలు రూ.58 లకు, జెర్సీ సంస్ధ రూ.60 లకు కొనుగోలు చేస్తుండగా, అమూల్‌ సంస్ధ రూ.64.97లకు కొనుగోలు చేయనుంది. 
► ఇక ఆవు పాలు లీటరు (3.5 శాతం ఫ్యాట్, 8.5 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌)కు హెరిటేజ్‌ సంస్ధ రూ.23.12 ఇస్తుంటే, అమూల్‌ రూ.28 చెల్లించనుంది. 
► అంటే ఎక్కడ చూసినా ఎక్కువ ధరకు అమూల్‌ పాలు కొనుగోలు చేస్తోంది. ఆ తర్వాత లాభాలు కూడా పంచబోతోంది.
► ఆ విధంగా ఎంతో మంచి జరుగుతుందని ఈ కార్యక్రమం చేపట్టాము.

మా టార్గెట్‌ హెరిటేజ్‌ కాదు
► నిన్న లోకేష్‌ అనే వ్యక్తి ఏదో టీవీలో అన్నాడట. ఆంధ్రజ్యోతిలో రాశారట.
► ‘అమూల్‌ వల్ల హెరిటేజ్‌ చావదు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి పాలు సేకరిస్తామని అన్నాడట’.
► అంటే ఇంత కాలం వారు తక్కువ ధర ఇస్తున్నారనే కదా?
► చంద్రబాబు మీద కోపంతోనో, హెరిటేజ్‌ టార్గెట్‌గానో అమూల్‌ను తేలేదు.
► మా రాడార్‌లో చంద్రబాబు లేడు, మా మైండ్‌ సెట్‌ కూడా అది కాదు.

అక్క చెల్లెమ్మల కోసమే
► చేయూతలో దాదాపు 24.55 లక్షల అక్క చెల్లెమ్మలకు, ఆసరాలో దాదాపు 87 లక్షల అక్క చెల్లెమ్మలకు డబ్బులు ఇస్తున్నాం. 
► అంత డబ్బు ఇస్తున్నందున వారికి సరైన పద్ధతిలో దారి చూపిస్తే రిస్క్‌ లేకుండా రెగ్యులర్‌గా ఆదాయం వస్తుంది.
► దాని వల్ల వారు లక్షాధికారులు అవుతారు. మంచి జీవితం గడుపుతారు.
► అందుకే అమూల్‌తో పాటు, పలు సంస్థలను తీసుకువచ్చాము. అంతే తప్ప, చంద్రబాబు, హెరిటేజ్‌ కోసం కాదు.
► అంత తక్కువగా ఆలోచించే తత్వం కూడా మాది కాదు. ఆ అక్క చెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముగించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement