బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో పాలపై వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. బెంగళూరులో ఆన్‌లైన్ ద్వారా అమూల్ పాలు, పెరుగు విక్రయించనున్నట్టు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఇటీవల చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. అమూల్‌కు వ్యతిరేకంగా పలు కన్నడ సంస్థలు సోమవారం నిరసనలు, ధర్నాలు నిర్వహించాయి.
గో బ్యాక్ అమూల్, సేవ్ నందిని అంటూ హాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాలోనూ నిరసనలు జోరందుకుంటున్నాయి. అమూల్‌ను రాష్ట్రంలోకి తీసుకొచ్చి స్థానిక నందినీ డెయిరీని దెబ్బ తీసేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోందని విపక్ష కాంగ్రెస్, జేడీ(ఎస్) విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘‘గుజరాత్‌కు చెందిన బరోడా బ్యాంక్ మా విజయ బ్యాంక్‌ను కబళించింది. దేశంలోని నౌకాశ్రయాలు, విమానాశ్రయాలన్నింటినీ గుజరాతీ అయిన అదానీకి కట్టబెడుతున్నారు. ఇప్పుడు నందినీ డెయిరీపై పడ్డారు’’ అంటూ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య దుయ్యబట్టారు.
జేడీ(ఎస్) నేత కుమారస్వామి కూడా అమూల్‌పై విమర్శలతో ట్వీట్లు చేశారు. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. అమూల్ కర్ణాటకలోకి ప్రవేశించడం లేదని బీజేపీ ఐటీ విభాగం ఇన్‌చార్జి అమిత్ మాలవీయ చెప్పారు. నందినీ డెయిరీని అమూల్‌లో విలీనం చేస్తారన్నది కూడా కాంగ్రెస్ కుట్రపూరిత ప్రచారం మాత్రమేనన్నారు. బీజేపీ హయాంలోనే నందినీ డెయిరీ భారీగా విస్తరించిందని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment