సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (ఏపీ డీడీసీఎఫ్) ఆస్తులను గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (అమూల్)కు లీజుకిస్తూ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి దురుద్దేశాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళల సాధికారత, పాడి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టుకు నివేదించింది. పాల ఉత్పత్తిదారులకు సాధ్యమైనంత మంచి ధర రావాలన్న ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నామంది. దీనివల్ల దాదాపు 30 లక్షల మంది మహిళా పాడి రైతులు లబ్ధి పొందుతారని వివరించింది. ఈ విధాన నిర్ణయం వెనుక సామాజిక, సంక్షేమ కారణాలున్నాయని తెలిపింది. ఏపీడీడీసీఎఫ్ ఆస్తులను అమూల్ సంస్థకు వాణిజ్య ప్రయోజనాల కోసం లీజుకు ఇవ్వడం లేదని, పాలు, పాల ఉత్పత్తుల అమ్మకాల ద్వారా వచ్చే లాభాలను అమూల్ వాటాదారులకు పంచే పరిస్థితి ఉండదని స్పష్టం చేసింది. ఆ లాభాలను మహిళా పాల సహకార సంఘాల (ఎండీఎస్‌ఎస్) సభ్యుల మధ్య పంపిణీ చేయడం జరుగుతుందని వివరించింది.
ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు
ఏపీ డీడీసీఎఫ్ ఆస్తుల బదలాయింపుపై మంత్రి మండలి తీర్మానాన్ని ఏకపక్షంగా, చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి అమూల్, ఏపీ డీడీసీఎఫ్ మధ్య కుదిరిన పరస్పర అవగాహన ఒప్పందానికి సంబంధించిన జీవో 25ను రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలంటూ ఎంపీ కె.రఘురామకృష్ణరాజు హైకోర్టులో ఇటీవల పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పశు సంవర్థక, డెయిరీ డెవలప్‌మెంట్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య కౌంటర్ దాఖలు చేస్తూ.. అమూల్ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకే ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామన్న పిటిషనర్ రఘురామకృష్ణరాజు ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. పాల ఉత్పత్తిదారుల సంక్షేమం కోసం ఈ పిల్ దాఖలు చేశానని చెబుతున్న రఘురామకృష్ణరాజు తన పిటిషన్‌లో ఎక్కడా ఏపీ డీడీసీఎఫ్ ఆస్తులను అమూల్‌కు లీజుకిస్తే పాల రైతులు ఎలా ప్రభావితం అవుతారో చెప్పలేదని కౌంటర్‌లో పేర్కొన్నారు.
రాజకీయ ప్రయోజనం తప్ప ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదు
సంగం డెయిరీ అక్రమాలు బహిర్గతమైన సమయంలోనే రఘురామకృష్ణరాజు ఈ వ్యాజ్యం చేశారని.. ఇది వ్యక్తిగత ప్రయోజన, రాజకీయ ప్రయోజన వ్యాజ్యమే తప్ప ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎంత మాత్రం కాదని పూనం మాలకొండయ్య తన కౌంటర్‌లో పేర్కొన్నారు. అమూల్‌తో ఒప్పందం తరువాత మహిళా పాడి రైతులకు లీటరుకు రూ.4 నుంచి రూ.14 వరకు అదనంగా లభిస్తోందని తెలిపారు. ప్రైవేటు పాల కంపెనీలకు లబ్ధి చేకూర్చడమే ఈ పిల్ దాఖలు వెనుక ప్రధాన ఉద్దేశమని, ఈ ఒక్క కారణంతో ఈ వ్యాజ్యాన్ని భారీ జరిమానాతో కొట్టేయాలని హైకోర్టును అభ్యర్థించారు.
రఘురామ వాస్తవాలను తొక్కిపెట్టారు
రూ.వెయ్యి కోట్లకు పైగా బ్యాంకులను మోసం చేసిన రఘురామకృష్ణరాజుపై సీబీఐ తీవ్ర అభియోగాలతో ఇప్పటికే రెండు కేసులు నమోదు చేసిందని, వరా>్గల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేలా మాట్లాడినందుకు అతనిపై రాష్ట్రంలో పలు కేసులు నమోదయ్యాయని మాలకొండయ్య కోర్టుకు నివేదించారు. వీటి గురించి పిటిషనర్ ఎక్కడా కూడా వ్యాజ్యంలో ప్రస్తావించకుండా వాస్తవాలను తొక్కిపెట్టారని, ఇది హైకోర్టు పిల్ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment