
న్యూఢిల్లీ : పాల ఉత్పత్తిలో అత్యంత ప్రాచుర్యం పొందిన అమూల్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ కే. రత్నం తన పదవికి రాజీనామా చేశారు. రూ.450 కోట్ల కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో ఆయన పదవి నుంచి నిష్క్రమించారు. ప్రత్యేక బోర్డు ఆయన రాజీనామాను ఆమోదించింది. అయితే రూ.450 కోట్ల కుంభకోణ నేపథ్యంలో రత్నం తన పదవికి రాజీనామా చేశారనే వార్తలను మాత్రం బోర్డు ఖండించింది. వ్యక్తిగత కారణాలతో ఆయన కంపెనీ నుంచి వైదొలిగారని పేర్కొంది. 2014లో రత్నం అమూల్ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు, అమెరికాలో తన కుటుంబ సభ్యులతో సమయాన్ని వెచ్చించడం కోసం తాను ఎండీగా తప్పుకుంటున్నట్టు రత్నం కూడా చెప్పారు. ఏదైనా సొంతంగా కొత్తగా ప్రారంభించాలని ఉందని పేర్కొన్నారు.
గుజరాత్‌లోని ఆనంద్ నగరంలో ఉన్న అమూల్ పాల ఉత్పత్తుల సంస్థకు దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. అయితే అమూల్ డెయిరీలో జరిగిన అవినీతి, అవకతవకలకు రత్నమే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. టెండర్ల కేటాయింపు, రిక్రూట్‌మెంట్‌లో సుమారు 450 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే రత్నం ఎలాంటి కుంభకోణంలో భాగస్వామి కాదని అమూల్ ఉత్పత్తుల కంపెనీ చైర్మన్ రామ్‌సిన్ పర్మార్ చెబుతున్నారు. ఈ ఆరోపణలు సత్యానికి చాలా దూరంలో ఉన్నాయన్నారు. రాజీనామా చేసిన రత్నం స్థానంలో సీనియర్ జనరల్ మేనేజర్ జయేన్ మెహతాను నూతన ఎండీగా నియమిస్తున్నట్టు అమూల్ డెయిరీ ప్రకటించింది.