సాక్షి, ముంబై: తూర్పు విరార్‌లోని కణేర్‌లో అమూల్‌కు చెందిన అత్యాధునిక పాల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు. సుమారు రూ.180 కోట్లతో నిర్మించిన ఈ కేంద్రాన్ని ఈ నెల 31న రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ప్రారంభిస్తారని అమూల్ నిర్వాహక అధికారి సుధీంద్ర కుల్‌కర్ణి తెలిపారు. కణేర్-వైతర్ణ మార్గంలోని టోకరే ప్రాంతంలో 12 ఎకరాల స్థలంలో 2011 నుంచి ప్రారంభించిన డెయిరీ నిర్మాణ పనులు ఇటీవల పూర్తయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో అమూల్‌కు చెందిన రెండో డెయిరీ ఇదని తెలిపారు.
ముంబైతో పాటు ఠాణే నగరానికి స్వచ్ఛమైన పాలు సరఫరా చేయడం కోసం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ‘ఈ డెయిరీలో పెరుగు, మజ్జిగ, ఐస్‌క్రీమ్‌లను తాజా పాలతో తయారు చేస్తారు. ప్రతి రోజు ఆరు లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. భవిష్యత్‌లో సామర్థ్యాన్ని 10 లక్షల లీటర్ల వరకు పెంచే అవకాశముంద’న్నారు. 1.5 లక్షల లీటర్ల మజ్జిగ, 20 వేల లీటర్ల పెరుగు, 1.25 లక్షల లీటర్ల ఐస్‌క్రీమ్ తయారు చేసే సామర్థ్యం కలిగి ఉందని వివరించారు. ప్రస్తుతం విక్రమ్‌గడ్, వాడా తాలూకాల్లోని రైతుల నుంచి పాలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే వసయి తాలూకాల్లో ఉన్న రైతుల నుంచి కూడా పాలు తీసుకునేందుకు యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు.
రైతులకు మరింత లాభం...
ఠాణే జిల్లాలో క్రియాశీలకంగా పనిచేసే డెయిరీ లేకపోవడంతో పాల ఉత్పత్తి రైతులకు గిట్టుబాటు ధర లభించడం కోసం విక్రమ్‌గఢ్ తాలూకాలోని మల్వాడా గ్రామంలో మల్వాడా సహకార పాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ప్రతి రోజూ సుమారు వెయ్యి లీటర్ల పాలు సేకరిస్తారు.
కణేర్‌లో అమూల్ పాల ఉత్పత్తి కేంద్రం
Published Sun, Oct 27 2013 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
Advertisement
Advertisement