pruthviraj chauhan
-
బలనిరూపణ అంటే బీజేపీ పారిపోతోంది: కాంగ్రెస్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీలో బలం నిరూపించాల్సిందిగా బీజేపీని కోరితే ఆ పార్టీ పారిపోతోందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. తగినంత సంఖ్యా బలం లేకపోవడం వల్లే బీజేపీ వెనకడుగు వేస్తోందని మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో చెప్పారు. సంఖ్యాబలం లేని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం అక్రమమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అన్నారు. సంఖ్యాబల నిరూపణకు వెళదామని, అక్కడే ఎవరి బలమేమిటో తేలిపోతుందని బీజేపీకి చురకలంటించారు. బలనిరూపణకు వెళ్తే తమ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. గవర్నర్ కార్యాలయాన్ని ఉపయోగించుకొని బీజేపీ అక్రమ చర్యలకు దిగిందని ఆరోపించారు. -
అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై ఉపముఖ్యమంత్రి
పుణే: అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20వ తేదీలోగా తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ విషయాన్ని ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. దాంగేచౌక్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. నెల రోజుల్లోగా ఓ నిర్ణయం తీసుకుంటామంటూ నాగపూర్‌లో జరిగిన శాసనసభ శీతాకాల సమావేశాల్లో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అభయమిచ్చారని, ఇందుకు సంబంధించిన ప్రక్రి య పూర్తికావస్తోందని పవార్ అన్నారు. అయితే అక్రమ నిర్మాణాలన్నింటినీ క్రమబద్ధీకరించడం సాధ ్యం కాదని, ముఖ్యంగా అభివృద్ధి ప్రణాళిక కోసం ఉంచిన స్థలాల్లో నిర్మాణాల క్రమబద్ధీకరణ కుదరదని ఆయన తేల్చిచెప్పారు. తమ పార్టీ నేతృత్వంలో వివిధ శాఖలను నిర్వహిస్తున్న మంత్రులు చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారని స్పష్టం చేస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా విమర్శించారు. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ అంశం పట్టణాభివృద్ధిశాఖ పరిధిలో ఉందని, ఆ శాఖకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సారథ్యం వహిస్తున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల నియమావళి త్వరలో అమలులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అందువల్ల మెట్రో వంటి ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి జిల్లాలో 937 అంబులెన్సు సేవలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1,000 కోట్లని, ఇందులో రూ. 600 కోట్లను భరిం చేందుకు రాష్ర్ట ప్రభుత్వం, మిగతాది కేంద్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందన్నారు. ఈ అంబులెన్సులలో నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉంటారన్నారు. పుణే జిల్లాకు ఐదు అంబులెన్సులను కేటాయిస్తామన్నారు. -
బయటపెట్టండి!
ముంబై: ఆదర్శ్ కుంభకోణంపై జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన నివేదికను బయటపెట్టాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఢిల్లీలో శనివారం చేసిన వ్యాఖ్యలతో ఈ డిమాండ్లు మరింత ఊపందుకున్నాయి. దిసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టును ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టాలని సమాచార హక్కు కార్యకర్త అనిల్ గల్గాలీ ఆదివారం డిమాండ్ చేశారు. అప్పుడే కుంభకోణంలో నిందితులుగా ఉన్నవారి ముఖాలు ప్రజలకు తెలుస్తాయన్నారు. నివేదిక సిద్ధమై నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా దానిని మరాఠీలోకి మార్చుకోలేకపోవడంపై గల్గాలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ నిబంధనల ప్రకారం నివేదికను మరాఠీలోకి మార్చుకోవాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో నిర్లక్ష్యం చేసిందన్నారు. ఆదర్శ్ కుంభకోణంలో నిందితులెవరో నిగ్గు తేల్చేందుకు కమిషన్‌ను వేసి, రూ. 7.04 కోట్లు ఖర్చుచేసిందని, దానిని అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చి చర్చ జరిపేందుకు నిరాకరించడమెందుకని ప్రశ్నించారు. కుంభకోణానికి పాల్పడిన రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వమే కవచంలా ఉండి కాపాడుతోందని ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చవాన్ కార్యదర్శి భగవాన్ సాహేకు లేఖ రాశారు. ‘రాష్ట్ర అసెంబ్లీ నిబంధనల ప్రకారం ప్రతి నివేదికను ఆంగ్లంతోపాటు మరాఠీలోకి అనువదించుకోవాలి. ముంబై ఉగ్రదాడిపై నియమించిన రామ్‌ప్రధాన్ కమిటీ నివేదికను రెండు భాషల్లో సిద్ధం చేసుకున్నారు. అయితే ఆదర్శ్ కుంభకోణం నివేదిక విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను తుంగ లో తొక్కుతోంద’ని లేఖలో పేర్కొన్నారు. -
నేటి నుంచే అసెంబ్లీ
నాగపూర్: ప్రతిసారి మాదిరినే ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగే అవకాశాలు కని పిస్తున్నాయి. నాగపూర్‌లో సోమవారం ఉదయం నుంచే ప్రారంభమయ్యే ఈ సమావేశాల్లో ఆదర్శ్ కుంభకోణం, మూఢాచారాల వ్యతిరేక బిల్లు వంటి అంశాలపై చర్చోపచర్చలు నడుస్తాయని చెప్పవచ్చు. కేంద్రమంత్రి రాజీవ్ శుక్లాకు ముంబైలో నామమాత్రపు ధరకు భూమిని కేటాయించడంపైనా విపక్షాలు గొడవకు దిగే అవకాశాలున్నాయి. ప్రముఖ హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్య నేపథ్యంలో ఆయన ప్రతిపాదించిన మూఢాచారాల వ్యతిరేక బిల్లును ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించడం తెలిసిందే. దభోల్కర్ హత్య కేసులో ఇప్పటికీ పురోగతి లేకపోవడంపైనా విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలున్నాయి. దాదాపు 13-14 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లును ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని వార్కారీల సంఘాలు ప్రకటించాయి. విశేషమేమంటే ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సమావేశాల తొలిరోజు బంద్‌కు పిలుపునిచ్చే విపక్షాలు ఈసారి మాత్రం ఆ పని చేయలేదు. ప్రధాన ప్రతిపక్షం బీజే పీ మాత్రం విదర్భ ప్రాంతంలో రాస్తారోకోలకు పిలుపునిచ్చింది. అధిక వర్షాలతో పంటలు కోల్పోయిన విదర్భ రైతులకు పరిహారం ఇవ్వనందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపిం ది. ఆదర్శ్ కుంభకోణంలో చర్యల నివేదికను సభ లో ప్రవేశపెట్టాలని కూడా ఈ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు బీజేపీ హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కుంభకోణంపై ఇంటాబయ టా పోరాడుతామని స్పష్టం చేసింది. ఈ కేసు బాధ్యతను స్వీకరించిన సీబీఐ మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌పై దర్యాప్తునకు అనుమతించాలని గవర్నర్ కె.శంకర్ నారాయణన్‌ను కోరింది. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ భవనంలో చవాన్ తన బంధువులకు ఫ్లాట్ ఇప్పించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక నీటిపారుదలశాఖ ప్రాజెక్టుల స్తంభన అంశం కూడా ఈసారి చర్చకు వచ్చే అవకాశముంది. ఈ శాఖ గణాంకాలపై విపక్షాలు ఇది వరకే సందేహాలు వ్యక్తం చేశా యి. విదర్భలో రూ.66 వేల కోట్ల విలువైన నీటిపారుదల ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదని సభ లో విపక్షనాయకుడు వినోద్ తావ్డే ఆరోపించారు. విదర్భలో తగిన నీటిపారుదల సదుపాయాలు లేక పంటలు నాశనమవుతుండడంతో అక్కడ రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా జరుగుతున్నాయని ప్రధాని నియమించిన మిశ్రా కమిటీ 2006లోనే ప్రకటించింది. గత పదేళ్లలో విదర్భలో కేవలం 8.10 లక్షల హెక్టార్లకు మాత్రమే నీటిపారుదల సదుపాయం కల్పించినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయని తావ్డే అన్నారు. దీనిని బట్టి విదర్భపై ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తున్నట్టు రుజువవుతోం దని స్పష్టం చేశారు. యువజన నాయకుడు ఆశిష్ దేశ్‌ముఖ్ సైతం ప్రత్యేక విదర్భ కోసం పోరాటం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తెలంగాణతోపాటు విదర్భ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విపక్షాలతో ముఖ్యమంత్రి చర్చలు విధానసభ సమావేశాలకు ముందు రోజులు సభ సంప్రదాయాల ప్రకారం విపక్షాలకు ఇవ్వాల్సిన తేనీటి విందును ప్రభుత్వం రద్దు చేసింది. దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర పోరాటయోధుడు నెల్సన్ మండే లా మృతికి సంతాపంగా ఈ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో అధికార పక్ష నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయా న్ని ప్రకటించారు. అయితే రాష్ట్రంలోని వివిధ అంశాలపై చర్చించడానికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విపక్ష నాయకులను ఆహ్వానించారు. ఈ భేటీకి తాము హాజరయ్యామని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ప్రకటించింది. -
రూ. 2.25 కోట్ల జరిమానా చెల్లించండి: ప్రభుత్వం
కొల్హాపూర్: రూ. 2.25 కోట్ల జరిమానా చెల్లించాల్సిందిగా ఎంపీ రాజుశెట్టి నేతృత్వంలోని స్వాభిమాన్ శేత్కారీ సంఘటన్ పార్టీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. చెరకు పంటకు గిట్టుబాటు ధర కోసం పార్టీ గత ఏడాది ఆందోళన చేసిన సంగతి విదితమే. ఈ ఆందోళన కారణంగా ఆస్తులకు నష్టం వాటిల్లిందని ఆ పార్టీకి పంపిన నోటీసులో హోం శాఖ పేర్కొంది. కాగా ప్రస్తుతం స్వాభిమాన్ పార్టీ ఇదే అంశంపై కరాడ్ తాలూకాలో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి విదితమే. క్వింటాల్ చెరకుకు గిట్టుబాటు ధర కింద రూ. 3,000 చెల్లించాలంటూ శుక్రవారం ఆ పార్టీ ఆందోళనకు దిగాల్సి ఉన్నప్పటికీ సదరు డిమాండ్‌ను పరిశీలిస్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఫోన్‌ద్వారా గురువారం తెలియజేయడంతో వాయిదా వేసుకుంది. ఈ విషయమై ఆ పార్టీ నాయకుడు సదాఖోట్ మీడియాతో మాట్లాడుతూ 2012 క్రషింగ్ సీజన్‌కు సంబంధించి చెరకు కొనుగోలు ధరల విషయమై తమతో చర్చలు జరపాల్సిందిగా ఆయా చక్కెర పరిశ్రమల యాజమాన్యాలను కోరామని, అయితే అందుకు వారు నిరాకరించారని అన్నారు. అందువల్లనే చెరకు రైతులు వీధుల్లోకి రావాల్సి వచ్చిందన్నారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు రైతులు చనిపోయారన్నారు. అయినప్పటికీ బాధిత కుటుంబాలకు ఇప్పటిదాకా పరిహారం అందనే లేదన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం తమ పార్టీకి రూ. 2.25 కోట్ల జరిమానా విధించిందన్నారు. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన ఇద్దరు రైతుల గురించి ప్రభుత్వం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని, పైగా రైతాంగం విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. ఇదిలాఉంచితే చెరకు పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన సాంగ్లి, కొల్హాపూర్, సాతారా జిల్లాలలో స్వాభిమాన్ పార్టీ గత ఏడాది అనేక పర్యాయాలు ఆందోళనలు చేసింది. రహదారులను దిగ్బంధించడమే కాకుండా వాహనాలతోపాటు చెరకు పంటను తరలిస్తున్న ఎడ్ల బండ్లను ముందుకు కదలనీయకుండా అడ్డుకుంది. ఆందోళనకారులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో సాతారా, సాంగ్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. సాంగ్లి జిల్లాలో జరిగిన పోలీసుల కాల్పుల ఘటనలో ఇద్దరు రైతులు చనిపోయారు. అప్పుడే అంచనా వేశాం గత ఏడాది రైతాంగం ఆందోళనల వల్ల కలిగిన నష్టాన్ని అప్పట్లోనే అంచనా వేశామని సాంగ్లి జిల్లా కలెక్టర్ ఉత్తమ్ పాటిల్ తె లిపారు. కేవలం సాంగ్లి జిల్లాలోనే రూ. 50,41,400 మేర నష్టం వాటిల్లిందని ఆయన వివరించారు. -
అతివల తొలి బ్యాంకు ప్రారంభం
ముంబై: దేశంలోకెల్లా తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా, అందరూ మహిళలతో కూడిన భారతీయ మహిళా బ్యాంకు మంగళవారం ముంబైలో లాంఛనంగా ప్రారంభమైంది. ఇక్కడి నారిమన్ పాయింట్‌లోని ఎయిర్ ఇండియా భవనంలో ఏర్పాటు చేసిన ఈ బ్యాంకు శాఖను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 96వ జయంతినిపురస్కరించుకొని ప్రధాని మన్మోహన్సింగ్ యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ సమక్షంలో ప్రారంభించారు. ఢిల్లీ, కోల్‌కతా, గువాహటి, చెన్నై, అహ్మదాబాద్, ఇండోర్లలో మరో ఆరు శాఖలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. బ్యాంకు శాఖలతోపాటు ఏడు ఏటీఎంలు కూడా ఏకకాలంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముంబై శాఖలో సోనియా ఐదుగురు ఖాతాదారులకు బ్యాంకు పత్రాలు అందించగా ఐదుగురు మహిళా లబ్ధిదారులకు ప్రధాని రుణాల మంజూరు లేఖలు అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, చిదంబరం, మహారాష్ట్ర గవర్నర్ కె. శంకరనారాయణన్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పాల్గొన్నారు. బ్యాంకు ప్రత్యేకతలు: రూ. లక్ష లోపు సేవింగ్స్ డిపాజిట్ ఖాతాలపై 4.5 శాతం వడ్డీ, రూ. లక్ష దాటిన వాటిపై 5 శాతం వడ్డీ చెల్లించనుంది. మరే బ్యాంకు ఇవ్వని విధంగా కేటరింగ్ బిజినెస్, డే కేర్ సెంటర్లు, వంటింటి మెరుగుదల వంటి వాటికి రుణ సదుపాయం అందించనుంది. మహిళా ఆర్థిక సాధికారత దిశగా చిన్న అడుగు: ప్రధాని బ్యాంకు ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మాట్లాడుతూ దేశంలో మహిళల ఆర్థిక సాధికారత దిశగా ఈ బ్యాంకు ఏర్పాటు ఓ చిన్న అడుగు అని వ్యాఖ్యానించారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళల సాధికారత ఇంకా సుదూర లక్ష్యంగానే ఉందన్నారు. మహిళలు నేటికీ ఇంట్లో, స్కూల్లో, పని ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాల్లో వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సోనియా గాంధీ మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతి రోజున మహిళా బ్యాంకు ప్రారంభంకావడంకన్నా ఆమె జీవితానికి, కార్యదక్షతకు ఇచ్చే మరింత మెరుగైన నివాళి ఇంకేమీ ఉండదని సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. బ్యాంకు కార్యకలాపాలు ఇలా కేంద్రం ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించినట్లుగా రూ. వెయ్యి కోట్ల మూలనిధితో ఈ బ్యాంకు కార్యకలాపాలు సాగించనుంది. కార్యకలాపాల కోసం 110 మందిని కొత్తగా తీసుకోగా ఇతర సిబ్బందిని పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల తరహాలోనే డిపాజిట్ల సేకరణ, రుణాల మంజూరు, డెబిట్, క్రెడిట్ కార్డుల జారీ వంటి సేవలు అందిస్తుంది. 60 లక్షల మహిళా స్వయం సహాయక బృందాల రుణ అవసరాలు తీర్చడంపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు మహిళా వ్యాపారవేత్తలు, ఉద్యోగినుల సాధికారతకు తోడ్పాటు అందిస్తుంది. ప్రధానంగా మహిళలకు సేవలందిస్తూనే భవిష్యత్తులో పురుషుల నుంచి కూడా డిపాజిట్లు స్వీకరించనుంది. 2014 మార్చిలోగా 25 శాఖలు 100 ఏటీఎంలు, ఏడాదిలోగా 39 శాఖలు, ఏడేళ్లలో 771 శాఖలు, రూ. 60 వేల కోట్ల వ్యాపారం లక్ష్యం. -
ఉచితంగా ల్యాప్‌టాప్‌లు
ముంబై: అసంఘటిత రంగాల కార్మికుల ఓట్లు రాబట్టుకోవడానికి కాంగ్రెస్ అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇళ్లలో పనిచేసే వాళ్లు, నిర్మాణరంగ కార్మికుల పిల్లలకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని పృథ్వీరాజ్ చవాన్ సర్కారు భావిస్తోంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇది వరకే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం తెలిసిందే. మొదటిదశలో లక్షమంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని మహారాష్ట్ర కార్మికశాఖ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ముహూర్తం సమీపిస్తున్నందున వీటి పంపిణీ పథకాన్ని వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇళ్ల పనిమనుషుల పిల్లలకు మొదటిదశలో ఐదువేల ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయడానికి రూ.25 కోట్లు కేటాయించాలని కార్మికశాఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పనిమనుషుల సంక్షేమార్థం ఏర్పాటైన బోర్డు వద్ద నిధులు లేకపోవడంతో కార్మికశాఖ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. ‘బస్తాలు మోసే కూలీలు, నిర్మాణరంగ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన బోర్డులు వద్ద మాత్రం తగినన్ని నిధులున్నాయి. కాబట్టి అవి కూలీలు, నిర్మాణరంగ కార్మికుల సంతానానికి అవి త్వరలోనే ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి’ అని కార్మికశాఖ అధికారి ఒకరు వివరించారు. కాలేజీ విద్యార్థులకు మొదటిదశలోనే ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని, తదనంతరం హైస్కూలు విద్యార్థులకు వర్తింపజేస్తామని వివరించారు. అయితే నౌకర్ల పిల్లలకు ఈ పథకం వర్తింపజేయాలంటే ముందు ఇళ్ల పనుమనుషులు బోర్డులో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. వీరిని గుర్తించి వివరాలు నమోదు చేయడం కష్టసాధ్యమేనని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రైవేటుసంస్థల సాయం తీసుకుంటామని ఆయన వివరించారు. -
కణేర్‌లో అమూల్ పాల ఉత్పత్తి కేంద్రం
సాక్షి, ముంబై: తూర్పు విరార్‌లోని కణేర్‌లో అమూల్‌కు చెందిన అత్యాధునిక పాల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు. సుమారు రూ.180 కోట్లతో నిర్మించిన ఈ కేంద్రాన్ని ఈ నెల 31న రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ప్రారంభిస్తారని అమూల్ నిర్వాహక అధికారి సుధీంద్ర కుల్కర్ణి తెలిపారు. కణేర్-వైతర్ణ మార్గంలోని టోకరే ప్రాంతంలో 12 ఎకరాల స్థలంలో 2011 నుంచి ప్రారంభించిన డెయిరీ నిర్మాణ పనులు ఇటీవల పూర్తయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో అమూల్‌కు చెందిన రెండో డెయిరీ ఇదని తెలిపారు. ముంబైతో పాటు ఠాణే నగరానికి స్వచ్ఛమైన పాలు సరఫరా చేయడం కోసం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ‘ఈ డెయిరీలో పెరుగు, మజ్జిగ, ఐస్‌క్రీమ్‌లను తాజా పాలతో తయారు చేస్తారు. ప్రతి రోజు ఆరు లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. భవిష్యత్‌లో సామర్థ్యాన్ని 10 లక్షల లీటర్ల వరకు పెంచే అవకాశముంద’న్నారు. 1.5 లక్షల లీటర్ల మజ్జిగ, 20 వేల లీటర్ల పెరుగు, 1.25 లక్షల లీటర్ల ఐస్‌క్రీమ్ తయారు చేసే సామర్థ్యం కలిగి ఉందని వివరించారు. ప్రస్తుతం విక్రమ్‌గడ్, వాడా తాలూకాల్లోని రైతుల నుంచి పాలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే వసయి తాలూకాల్లో ఉన్న రైతుల నుంచి కూడా పాలు తీసుకునేందుకు యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. రైతులకు మరింత లాభం... ఠాణే జిల్లాలో క్రియాశీలకంగా పనిచేసే డెయిరీ లేకపోవడంతో పాల ఉత్పత్తి రైతులకు గిట్టుబాటు ధర లభించడం కోసం విక్రమ్‌గఢ్ తాలూకాలోని మల్వాడా గ్రామంలో మల్వాడా సహకార పాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ప్రతి రోజూ సుమారు వెయ్యి లీటర్ల పాలు సేకరిస్తారు. -
లసల్గావ్ మార్కెట్‌కు ఢిల్లీ బృందం
పుణే: ఉల్లిపాయల కొనుగోలు కోసం ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బృందం గురువారం నాసిక్ జిల్లా మార్కెట్‌కు వచ్చింది. జాతీయ రాజధాని నగరంలో కిలో ఉల్లిపాయలు రూ. 90 నుంచి రూ. 100 దాకా పలుకుతుండగా, ఈ మార్కెట్లో అంతకంటే తక్కువ ధరకు లభిస్తోంది. ఈ విషయమై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బృందం గురువారం నాసిక్ జిల్లాలోని లసల్గావ్ మార్కెట్‌కు వెళ్లింది. దీంతో ఆ మార్కెట్లో సరుకు లభ్యత విషయమై ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌తో మాట్లాడా. వారి అవసరాలకు అనుగుణంగా ఉల్లిపాయలను కొనుగోలు చేస్తారు’ అని అన్నారు. ‘ఇక్కడికి 200 కిలోమీటర్ల దూరంలో దేశంలోనే అత్యంత పెద్ద ఉల్లిపాయల మార్కెట్ ఉంది. అక్కడ ఉల్లిపాయలను అక్రమంగా దాచరు. అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉల్లి పంట దిగుబడి తగ్గిపోయింది. నవంబర్ ఒకటో తేదీకల్లా కొత ్త పంట మార్కెట్‌కు రావడం మొదలవుతుంది. అప్పటినుంచి పరిస్థితి కొంతమేర మెరుగుపడుతుంది’ అని అన్నారు. లసల్గావ్ మార్కెట్‌కు వచ్చే రైతుల కోసం అనేక సౌకర్యాలు కల్పించామని, అందువల్ల ఉల్లిపాయలను అనేకరోజులపాటు నిల్వ ఉంచేందుకు వీలవుతుందన్నారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బృందానికి కొనుగోలు చేసేందుకు వీలుగా అవసరమైనంతమేర ఉల్లిపాయలను అందుబాటులో ఉంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. -
'హోంమంత్రి పాటిల్ రాజీనామాకు ఇది సమయం కాదు'
ముంబై: ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో హోంమంత్రి పాటిల్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్పందించారు. పాటిల్ రాజీనామా కోరేందుకు ఇది సమయం కాదన్నారు. విస్తీర్ణంలోనూ, జనాభాపరంగానూ మహారాష్ట్ర పెద్ద రాష్ట్రమని, ఇలాంటి రాష్ట్రంలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం చాలా కష్టంతో కూడుకున్నదని చెప్పారు. పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరముందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ అఘాయిత్యానికి పాల్పడి, తప్పించుకు తిరుగుతున్నవారిని వెంటనే పట్టుకోవాలని పోలీసులను ఆదేశించామన్నారు. నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అత్యాచార బాధితురాలి వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మహిళ ఫోటో జర్నలిస్ట్ పై సామూహిక అత్యాచార ఘటన దేశవాణిజ్య రాజధాని ముంబైలో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. రేప్ ఉదంతం చోటు చేసుకున్న అనంతంర నిందితుల కోసం పోలీసులు యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన కేసులో ఐదుగురి నిందితుల ఊహ చిత్రాలను ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ విడుదల చేశారు. ఆ ఘాతుకానికి పాల్పడిన ఐదుగురు నిందితుల గాలింపు కోసం ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. వారు నిందితుల కోసం జల్లెడ పడుతున్నారని, అలాగే ఈ కేసును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించినట్లు పోలీసు అధికారులు వివరించారు. ఇప్పటి వరకు 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించామని చెప్పారు. వారిలో నలుగురు తమ అదుపులోనే ఉన్నారని చెప్పారు.