అతివల తొలి బ్యాంకు ప్రారంభం | PM Manmohan Singh inaugurates Bharatiya Mahila Bank, Sonia Gandhi attends function | Sakshi
Sakshi News home page

అతివల తొలి బ్యాంకు ప్రారంభం

Published Wed, Nov 20 2013 4:19 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

అతివల తొలి బ్యాంకు ప్రారంభం - Sakshi

అతివల తొలి బ్యాంకు ప్రారంభం

 ముంబై: దేశంలోకెల్లా తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా, అందరూ మహిళలతో కూడిన భారతీయ మహిళా బ్యాంకు మంగళవారం ముంబైలో లాంఛనంగా ప్రారంభమైంది. ఇక్కడి నారిమన్ పాయింట్‌లోని ఎయిర్ ఇండియా భవనంలో ఏర్పాటు చేసిన ఈ బ్యాంకు శాఖను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 96వ జయంతినిపురస్కరించుకొని ప్రధాని మన్మోహన్‌సింగ్ యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ సమక్షంలో ప్రారంభించారు. ఢిల్లీ, కోల్‌కతా, గువాహటి, చెన్నై, అహ్మదాబాద్, ఇండోర్‌లలో మరో ఆరు శాఖలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. బ్యాంకు శాఖలతోపాటు ఏడు ఏటీఎంలు కూడా ఏకకాలంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముంబై శాఖలో సోనియా ఐదుగురు ఖాతాదారులకు బ్యాంకు పత్రాలు అందించగా ఐదుగురు మహిళా లబ్ధిదారులకు ప్రధాని రుణాల మంజూరు లేఖలు అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, చిదంబరం, మహారాష్ట్ర గవర్నర్ కె. శంకరనారాయణన్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పాల్గొన్నారు.
 
 బ్యాంకు ప్రత్యేకతలు: రూ. లక్ష లోపు సేవింగ్స్ డిపాజిట్ ఖాతాలపై 4.5 శాతం వడ్డీ, రూ. లక్ష దాటిన వాటిపై 5 శాతం వడ్డీ చెల్లించనుంది.  మరే బ్యాంకు ఇవ్వని విధంగా కేటరింగ్ బిజినెస్, డే కేర్ సెంటర్లు, వంటింటి మెరుగుదల వంటి వాటికి రుణ సదుపాయం అందించనుంది.
 
 మహిళా ఆర్థిక సాధికారత దిశగా చిన్న అడుగు: ప్రధాని
 బ్యాంకు ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మాట్లాడుతూ దేశంలో మహిళల ఆర్థిక సాధికారత దిశగా ఈ బ్యాంకు ఏర్పాటు ఓ చిన్న అడుగు అని వ్యాఖ్యానించారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళల సాధికారత ఇంకా సుదూర లక్ష్యంగానే ఉందన్నారు. మహిళలు నేటికీ ఇంట్లో, స్కూల్లో, పని ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాల్లో వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సోనియా గాంధీ మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతి రోజున మహిళా బ్యాంకు ప్రారంభంకావడంకన్నా ఆమె జీవితానికి, కార్యదక్షతకు ఇచ్చే మరింత మెరుగైన నివాళి ఇంకేమీ ఉండదని సోనియాగాంధీ వ్యాఖ్యానించారు.
 
 బ్యాంకు కార్యకలాపాలు ఇలా

  •  కేంద్రం ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించినట్లుగా రూ. వెయ్యి కోట్ల మూలనిధితో ఈ బ్యాంకు కార్యకలాపాలు సాగించనుంది.
  •  కార్యకలాపాల కోసం 110 మందిని కొత్తగా తీసుకోగా ఇతర సిబ్బందిని పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకున్నారు.
  •  అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల తరహాలోనే డిపాజిట్ల సేకరణ, రుణాల మంజూరు, డెబిట్, క్రెడిట్ కార్డుల జారీ వంటి సేవలు అందిస్తుంది.
  •  60 లక్షల మహిళా స్వయం సహాయక బృందాల రుణ అవసరాలు తీర్చడంపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు మహిళా వ్యాపారవేత్తలు, ఉద్యోగినుల సాధికారతకు తోడ్పాటు అందిస్తుంది.
  •  ప్రధానంగా మహిళలకు సేవలందిస్తూనే భవిష్యత్తులో పురుషుల నుంచి కూడా డిపాజిట్లు స్వీకరించనుంది.
  •  2014 మార్చిలోగా 25 శాఖలు 100 ఏటీఎంలు, ఏడాదిలోగా 39 శాఖలు, ఏడేళ్లలో 771 శాఖలు, రూ. 60 వేల కోట్ల వ్యాపారం లక్ష్యం.

 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement