
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సోమవారం కలిశారు. తీహార్ జైలుకు వెళ్లిన సోనియా, మన్మోహన్‌లు సుమారు అరగంట సేపు ఆయనతో మాట్లాడారు. చిదంబరం ఆరోగ్యం గురించి వాకబు చేసిన ఇద్దరు నేతలు ఆయనపై మోపిన కేసులను రాజకీయంగా దీటుగా ఎదుర్కొంటామని, పార్టీ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కేంద్రం ఇటీవల కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించడం, జీఎస్టీ రాయితీల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాన్ని చిదంబరం, మన్మోహన్ సుదీర్ఘంగా చర్చించారని చెప్పారు.
అధికారాన్ని వాడుకోలేదు
వ్యక్తిగత లాభం కోసం ఆర్థిక మంత్రి హోదాను వాడుకోలేదని, అధికారులెవరినీ ప్రభావితం చేయలేదని మాజీ మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. తనకు బెయిల్ ఇవ్వరాదంటూ కోర్టులో సీబీఐ వేసిన పిటిషన్‌పై సోమవారం ఢిల్లీ హైకోర్టుకు ఆయన రీజాయిండర్ సమర్పించారు. తనపై ఇప్పటికే లుకౌవుట్ నోటీసు జారీ చేసిన సీబీఐ.. తాను విదేశాలకు పారిపోయే అవకాశముందని వాదించడం సరికాదని స్పష్టం చేశారు. ఐఎన్‌ఎక్స్ మీడియాకు వచ్చిన రూ.305 కోట్ల విదేశీ నిధులు అప్పటి నిబంధనల ప్రకారం 46.216 శాతం పరిమితికి లోబడే ఉందని తెలిపారు. ఈ కేసులో ప్రజా ధనం ఏదీ ముడిపడి లేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment