సోనియా ఈజ్‌ బ్యాక్‌ | Sonia Gandhi Named Interim Congress Chief after CWC Meeting | Sakshi
Sakshi News home page

సోనియా ఈజ్‌ బ్యాక్‌

Published Sun, Aug 11 2019 4:28 AM | Last Updated on Sun, Aug 11 2019 11:09 AM

Sonia Gandhi Named Interim Congress Chief after CWC Meeting - Sakshi

శనివారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, మన్మోహన్‌సింగ్‌

న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. కాంగ్రెస్‌ పార్టీలో గత రెండున్నర నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది. రాహుల్‌ తర్వాత తదుపరి పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారంటూ సాగిన ఊహాగానాలకూ తెరదించుతూ పార్టీ నూతన అధ్యక్షురాలిగా యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ మరోసారి ఎంపికయ్యారు. రాహుల్‌ రాజీనామా తర్వాత తాత్కాలిక బాధ్యతలు స్వీకరించేందుకు నో చెప్పిన సోనియా ఎట్టకేలకు ఆ బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించారు. తదుపరి చీఫ్‌ను ఎన్నుకునేంత వరకు సోనియా తాత్కాలిక బాధ్యతలు నిర్వర్తిస్తారని సీడబ్ల్యూసీ రాత్రి 11 గంటలకు తీర్మానం చేసింది. ఏఐసీసీ చీఫ్‌ను ఎన్నుకునేందుకు శనివారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ భేటీ నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. తొలుత ఉదయం భేటీ అయిన సీడబ్ల్యూసీ (కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ) ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే రాత్రికి వాయిదా పడింది. తర్వాత రెండోసారి రాత్రి 9 గంటల సమయంలో సీడబ్ల్యూసీ భేటీ జరిగింది.  

రాహుల్‌ రాజీనామా ఆమోదం
శనివారం రెండోసారి జరిగిన భేటీలో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్‌ చేసిన రాజీనామాను సీడబ్ల్యూసీ ఆమోదించింది. తర్వాత పార్టీ రాజ్యాంగాన్ని అనుసరించి సోనియాను కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక చీఫ్‌గా నియమించింది. సీడబ్ల్యూసీ భేటీ తర్వాత పార్టీ సీనియర్‌ నేత ఆజాద్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. 2017, డిసెంబర్‌ 16న కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ బాధ్యతలు స్వీకరించారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో 52 సీట్లకు పరిమితం కావడంతో మే 25న అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించారు.



రాహుల్‌.. థ్యాంక్యూ: సీడబ్ల్యూసీ
సీడబ్ల్యూసీ భేటీలో భాగంగా మూడు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించామని కాంగ్రెస్‌ నేతలు రణ్‌దీప్‌ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. ‘కాంగ్రెస్‌ పార్టీకి రాహుల్‌ అందించిన అద్భుతమైన నాయకత్వానికి సీడబ్ల్యూసీ కృతజ్ఞతలు తెలుపుతోంది. పార్టీని క్రమశిక్షణ, అకింతభావంతో నడిపించారు. తన దూకుడుతో కాంగ్రెస్‌ యువనాయకత్వానికి రాహుల్‌ ఆదర్శంగా నిలిచారు. ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకున్నారు’ అని వెల్లడించారు.కశ్మీర్‌లో పరిస్థితిపై, రాజకీయ నేతల నిర్బంధం, మీడియాపై ఆంక్షలను ఖండిస్తూ సీడబ్ల్యూసీలో తీర్మానం చేశామన్నారు. జమ్మూకశ్మీర్‌లో ప్రతిపక్ష పార్టీల ప్రతినిధి బృందాన్ని అనుమతించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నామని తెలిపారు.

కశ్మీర్‌పై కేంద్రం స్పందించాలి: రాహుల్‌
సీడబ్ల్యూసీ భేటీకి హాజరైన రాహుల్‌ గాంధీ సమావేశం కొనసాగుతుండగానే మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ..‘జమ్మూకశ్మీర్‌లో ఏం జరుగుతుందో బయటపెట్టాల్సిన బాధ్యత ప్రధాని మోదీ, భారత ప్రభుత్వంపై ఉంది. అక్కడ భారీ హింస జరుగుతున్నట్లు, శాంతిభద్రతలు దిగజారుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి’ అని తెలిపారు.  

ఐదు సీడబ్ల్యూసీ బృందాల ఏర్పాటు..
కాంగ్రెస్‌కు పార్టీ నూతన అధ్యక్షుడి నియామకం విషయమై చర్చించేందుకు పార్టీ ముఖ్యనేతలు మన్మోహన్, ప్రియాంక, అహ్మద్‌ పటేల్, ఏకే ఆంటోనీ, ఆజాద్, చిదంబరం తదితరులు శనివారం ఉదయం 11 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ఉండే కాంగ్రెస్‌ శ్రేణులతో సంప్రదింపులు జరిపాకే తుది నిర్ణయం తీసుకోవాలని సీడబ్ల్యూసీ భేటీలో అంగీకరించారు. ఇందుకోసం ఈశాన్య, తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఐదు సీడబ్ల్యూసీ బృందాలను నియమించారు. ఈశాన్య సీడబ్ల్యూసీ బృందంలో అహ్మద్‌ పటేల్, అంబికాసోనీ, మాజీ సీఎం హరీశ్‌రావత్‌ ఉండగా, తూర్పు సీడబ్ల్యూసీ గ్రూపులో వేణుగోపాల్, అస్సాం మాజీ సీఎం తరుణ్‌ గొగోయ్, కుమారి సెల్జా సభ్యులుగా ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాల బృందంలో ప్రియాంక, జ్యోతిరాదిత్య సింధియా, చిదంబరం ఉండగా, పశ్చిమ రాష్ట్రాల సీడబ్ల్యూసీ గ్రూపులో ఆజాద్, ఖర్గే, ఆంటోనీ, మోతీలాల్‌ వోరా ఉన్నారు. అలాగే దక్షిణ రాష్ట్రాల బృందంలో మన్మోహన్, ఆనంద్‌ శర్మ, ముకుల్‌ వాస్నిక్‌ సభ్యులుగా ఉన్నారు. ఈ సీడబ్ల్యూసీ బృందాలు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ రాష్ట్రాల అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంప్రదింపులు జరిపాయి.  

మెజారిటీ నేతలు మద్దతిచ్చినా..
ఈ సందర్భంగా మెజారిటీ కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలు రాహుల్‌ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరినట్లు సమాచారం. కొంతమంది నేతలు మాత్రం ప్రియాంక పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రాహుల్‌ గాంధీయే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని ఏపీ కాంగ్రెస్‌ నేత శైలజానాథ్, తెలంగాణ తరఫున ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, భట్టివిక్రమార్క, రేవంత్‌ రెడ్డిలు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని సీడబ్ల్యూసీ బృందాన్ని కోరారు. ఈ విజ్ఞప్తిని రాహుల్‌ తిరస్కరించారు.

సంప్రదింపులకు మేం దూరం: సోనియాగాంధీ
గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తే ఈసారి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని రాహుల్‌ గాంధీ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  ప్రియాంక అధ్యక్ష బాధ్యతలు చేపడతారన్న వాదనలకు తెరపడింది. నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియకు తాము దూరంగా ఉంటా మని సోనియాగాంధీ తెలిపారు. సీడబ్ల్యూసీ భేటీకి ముందు ఆమె మీడియాతో మాట్లా డుతూ.. ‘నేను, రాహుల్‌ గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులుగా పనిచేశాం. కాబట్టి శనివారం జరిగే సీడబ్ల్యూసీ సంప్రదింపుల సమావేశాలకు హాజరై పార్టీ నేతల అభిప్రాయాలను ప్రభావితం చేయాలనుకోవడం లేదు. అందుకే ఈ అధ్యక్ష ఎంపిక ప్రక్రియలో మేం పాల్గొనడం లేదు’ అని స్పష్టం చేశారు. సంప్రదింపుల బృందాల్లో తమ పేర్లను పొరపాటున చేర్చిఉంటారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. ఈ ఏడాదిలోనే మహారాష్ట్ర, జార్ఖండ్, హరియాణా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున అధ్యక్షుడిని ఎంత త్వరగా ఎంపికచేస్తే అంత మంచిదని పార్టీ హైకమాండ్‌కు నేతలు సూచించినట్లు పేర్కొన్నాయి.

సోనియా... శక్తిమంతమైన మహిళ
అసలు పేరు: సోనియా మైనీ
తల్లిదండ్రులు: స్టెఫానో మైనీ, పౌలా ప్రిడెబాన్‌
జననం: డిసెంబర్‌ 9, 1946 ( ఇటలీలో)
ఉన్నత విద్యాభ్యాసం: కేంబ్రిడ్జి, బ్రిటన్‌
పెళ్లి:  1968లో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీతో
సంతానం: రాహుల్, ప్రియాంక


1991లో రాజీవ్‌ గాంధీ ఎల్టీటీఈ తీవ్రవాదుల ఆత్మాహుతి దాడిలో మరణించారు. అనంతరం జరిగిన వివిధ పరిణామాల నేపథ్యంలో 1997లో ఆమె రాజకీయ ప్రవేశం చేశారు. 1998లో కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు చేపట్టారు. దాదాపు 20 ఏళ్లపాటు కొనసాగి, 2017లో కొడుకు రాహుల్‌ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించారు. ఆరోగ్య సమస్యలతో గత కొంతకాలంగా ఆమె క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉండగా పార్టీకి చెందిన ఆర్థికవేత్త మన్మోహన్‌సింగ్‌ (2004– 2014) రెండుసార్లు ప్రధానిగా పనిచేశారు. 1999లో అమేథీ నుంచి, ఆ తర్వాత రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా ఉన్నారు. ఆమె ప్రత్యక్షంగా ఏ ప్రభుత్వ హోదాలో లేనప్పటికీ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా పేరుతెచ్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement