ముంబై: అసంఘటిత రంగాల కార్మికుల ఓట్లు రాబట్టుకోవడానికి కాంగ్రెస్ అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇళ్లలో పనిచేసే వాళ్లు, నిర్మాణరంగ కార్మికుల పిల్లలకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని పృథ్వీరాజ్ చవాన్ సర్కారు భావిస్తోంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇది వరకే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం తెలిసిందే. మొదటిదశలో లక్షమంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని మహారాష్ట్ర కార్మికశాఖ వర్గాలు తెలిపాయి.
ఎన్నికల ముహూర్తం సమీపిస్తున్నందున వీటి పంపిణీ పథకాన్ని వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇళ్ల పనిమనుషుల పిల్లలకు మొదటిదశలో ఐదువేల ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయడానికి రూ.25 కోట్లు కేటాయించాలని కార్మికశాఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పనిమనుషుల సంక్షేమార్థం ఏర్పాటైన బోర్డు వద్ద నిధులు లేకపోవడంతో కార్మికశాఖ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. ‘బస్తాలు మోసే కూలీలు, నిర్మాణరంగ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన బోర్డులు వద్ద మాత్రం తగినన్ని నిధులున్నాయి. కాబట్టి అవి కూలీలు, నిర్మాణరంగ కార్మికుల సంతానానికి అవి త్వరలోనే ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి’ అని కార్మికశాఖ అధికారి ఒకరు వివరించారు.
కాలేజీ విద్యార్థులకు మొదటిదశలోనే ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని, తదనంతరం హైస్కూలు విద్యార్థులకు వర్తింపజేస్తామని వివరించారు. అయితే నౌకర్ల పిల్లలకు ఈ పథకం వర్తింపజేయాలంటే ముందు ఇళ్ల పనుమనుషులు బోర్డులో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. వీరిని గుర్తించి వివరాలు నమోదు చేయడం కష్టసాధ్యమేనని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రైవేటుసంస్థల సాయం తీసుకుంటామని ఆయన వివరించారు.
ఉచితంగా ల్యాప్‌టాప్‌లు
Published Sat, Nov 9 2013 12:04 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM