కొల్హాపూర్: రూ. 2.25 కోట్ల జరిమానా చెల్లించాల్సిందిగా ఎంపీ రాజుశెట్టి నేతృత్వంలోని స్వాభిమాన్ శేత్కారీ సంఘటన్ పార్టీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. చెరకు పంటకు గిట్టుబాటు ధర కోసం పార్టీ గత ఏడాది ఆందోళన చేసిన సంగతి విదితమే. ఈ ఆందోళన కారణంగా ఆస్తులకు నష్టం వాటిల్లిందని ఆ పార్టీకి పంపిన నోటీసులో హోం శాఖ పేర్కొంది. కాగా ప్రస్తుతం స్వాభిమాన్ పార్టీ ఇదే అంశంపై కరాడ్ తాలూకాలో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి విదితమే. క్వింటాల్ చెరకుకు గిట్టుబాటు ధర కింద రూ. 3,000 చెల్లించాలంటూ శుక్రవారం ఆ పార్టీ ఆందోళనకు దిగాల్సి ఉన్నప్పటికీ సదరు డిమాండ్‌ను పరిశీలిస్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఫోన్‌ద్వారా గురువారం తెలియజేయడంతో వాయిదా వేసుకుంది.
ఈ విషయమై ఆ పార్టీ నాయకుడు సదాఖోట్ మీడియాతో మాట్లాడుతూ 2012 క్రషింగ్ సీజన్‌కు సంబంధించి చెరకు కొనుగోలు ధరల విషయమై తమతో చర్చలు జరపాల్సిందిగా ఆయా చక్కెర పరిశ్రమల యాజమాన్యాలను కోరామని, అయితే అందుకు వారు నిరాకరించారని అన్నారు. అందువల్లనే చెరకు రైతులు వీధుల్లోకి రావాల్సి వచ్చిందన్నారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు రైతులు చనిపోయారన్నారు. అయినప్పటికీ బాధిత కుటుంబాలకు ఇప్పటిదాకా పరిహారం అందనే లేదన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం తమ పార్టీకి రూ. 2.25 కోట్ల జరిమానా విధించిందన్నారు. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన ఇద్దరు రైతుల గురించి ప్రభుత్వం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని, పైగా రైతాంగం విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు.
ఇదిలాఉంచితే చెరకు పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన సాంగ్లి, కొల్హాపూర్, సాతారా జిల్లాలలో స్వాభిమాన్ పార్టీ గత ఏడాది అనేక పర్యాయాలు ఆందోళనలు చేసింది. రహదారులను దిగ్బంధించడమే కాకుండా వాహనాలతోపాటు చెరకు పంటను తరలిస్తున్న ఎడ్ల బండ్లను ముందుకు కదలనీయకుండా అడ్డుకుంది. ఆందోళనకారులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో సాతారా, సాంగ్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. సాంగ్లి జిల్లాలో జరిగిన పోలీసుల కాల్పుల ఘటనలో ఇద్దరు రైతులు చనిపోయారు.
అప్పుడే అంచనా వేశాం
గత ఏడాది రైతాంగం ఆందోళనల వల్ల కలిగిన నష్టాన్ని అప్పట్లోనే అంచనా వేశామని సాంగ్లి జిల్లా కలెక్టర్ ఉత్తమ్ పాటిల్ తె లిపారు. కేవలం సాంగ్లి జిల్లాలోనే రూ. 50,41,400 మేర నష్టం వాటిల్లిందని ఆయన వివరించారు.
రూ. 2.25 కోట్ల జరిమానా చెల్లించండి: ప్రభుత్వం
Published Fri, Nov 22 2013 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM
Advertisement