Raju Shetty
-
ప్రజలే ఓట్లతో పాటు నోట్లు కూడా ఇచ్చి గెలిపిస్తున్నారు
ఓటు కోసం నోట్లు పంచడం సాధారణంగా చూస్తుంటాం. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అవసరమైతే మందులు, విందులు ఇస్తుంటారు. కానీ మహారాష్ట్రలోని ఓ లోక్‌సభ నియోజకవర్గంలో మాత్రం వీటికి పూర్తిగా భిన్నమైన దృశ్యాలు కన్పిస్తున్నాయి. అక్కడ లోక్‌సభ అభ్యర్థికి ఓటుతో పాటు నోట్లు కూడా ఇస్తుండడం విశేషం. ఇలాంటి దృశ్యాలు మహారాష్ట్ర కొల్హాపూర్ జిల్లా హతకణంగలే లోక్‌సభ నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. ‘స్వాభిమాని శేత్కరీ సంఘటన’ నేత ఎంపీ రాజు శెట్టికి ఓటర్లు ఓట్లు వేయడంతోపాటు నోట్లు కూడా ఇచ్చి మీకు అండగా ఉంటామని చెబుతున్నారు. ఇలా రాజు శెట్టికి ఇప్పటి వరకు అనేక మంది ఓటర్లు రూ.1.36 లక్షల నగదు అందించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ ‘నోట్ల మద్దతు’ కోట్లలోకి చేరే అవకాశాలున్నాయి. రైతుల సమస్యలకు కట్టుబడి ఉన్న నేతగా మలినం లేని, ఆరోపణలు లేని నేతగా రాజు శెట్టికి గుర్తింపు ఉంది. ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు మద్దతుగా ఈ నిధి (నగదు) అందిస్తున్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో ఖర్చుతో కూడుకున్న బహిరంగ సభలు ఉండవు. డబ్బుల వృథా ఉండదు. ‘రైతుల సమస్య కోసం నేను పోరాడుతాను. అందుకే నాకు ప్రజలు అండదండలు అందిస్తున్నార’ని రాజు శెట్టి చెబుతున్నారు. రాజు శెట్టి ఇప్పటి వరకు జిల్లా పరిషత్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు రెండుసార్లు లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఈ ఎన్నికలలో ‘ఏక్ ఓట్.. ఏక్ నోట్’ ఉద్యమానికి పెద్దపీట వేశారు. స్వాభిమాని శేత్కరీ సంఘటన ఉద్యమాల కారణంగా తమకు ఏవైతే లభించాయో వాటిలో పిడికెడన్ని ఆయనకు ఇవ్వాలని రైతులు భావిస్తున్నారు. ఈ విధంగా ఆయనకు ఎన్నికల సమయంలో మద్దతుగా నిధులిచ్చేవారు అత్యంత సామాన్య ప్రజలుంటారు. ఈసారి మద్దతు నిధిని అందించేందుకు పలువురు ముందుకు వచ్చారు. ముఖ్యంగా ఇప్పటి వరకు అందిన వివరాల మేరకు దేవప్పా కాంబ్లే రూ.11 వేలు, సుభాష్ ఘోరపడే రూ.15 వేలు అందించారు. ఇంకా షకీల్ భగవాన్, వీరేంద్ర మోహితే రూ.5 వేల చొప్పున అందించగా శిరోల్ తాలూకా కురుందవాడ్ నుంచి డాక్టరు అవినాష్ కోగనోల్ లోక్‌సభ ఎన్నికల నిధిగా ఏకంగా లక్ష రూపాయలు అందించారు. ఇలా వచ్చిన నిధులను ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులపై ఖర్చు చేయడంతోపాటు మిగిలిన నిధులను స్వాభిమాని శేత్కరీ సంఘటన కార్యకలాపాల కోసం వినియోగిస్తారు. ముఖ్యంగా ఓటర్లు ఇచ్చిన పైసా పైసాకు రాజు శెట్టి లెక్కలు చూపుతారు. దుబారా ఖర్చు అసలు ఉండకుండా జాగ్రత్త పడతారు. ఇలా ఓటర్ల చందాలతో ఎన్నికయ్యే రాజు శెట్టి గురించి అనేక మంది ప్రశంసలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలే మరణించిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రాజు శెట్టిని అభినందించిన వారిలో ఉన్నారు.– గుండారపు శ్రీనివాస్, సాక్షి– ముంబై రాజు శెట్టికి ఎన్నికల్లో ఓటర్ల ద్వారా అందిన నిధులు 2009: రూ.44 లక్షలు 2014: రూ.64 లక్షలు 2019: రూ.1.36 లక్షలు (ఇప్పటి వరకు) -
రైతు సమస్యలపై కాంగ్రెస్‌తో పనిచేస్తాం
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీతో కలసి పనిచేస్తానని స్వాభిమాన్ షేత్కారీ సంఘటన చీఫ్, లోక్‌సభ సభ్యుడు రాజు శెట్టి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సోమవారం నాడిక్కడ భేటీ అనంతరం శెట్టి మీడియాతో మాట్లాడారు. రైతుల సమస్యలపై దృష్టి సారించనున్నట్లు రాహుల్ కాంగ్రెస్ ప్లీనరీలో ప్రకటించిన మరుసటి రోజే ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మార్చి 29న మహారాష్ట్రలో నిర్వహించనున్న రైతు సదస్సుకు హాజరు కావాల్సిందిగా రాహుల్‌ను ఆయన ఆహ్వానించారు. గతేడాది ఆగస్టులో ఎన్డీఏ నుంచి శెట్టి బయటికొచ్చిన సంగతి తెలిసిందే. -
రూ. 2.25 కోట్ల జరిమానా చెల్లించండి: ప్రభుత్వం
కొల్హాపూర్: రూ. 2.25 కోట్ల జరిమానా చెల్లించాల్సిందిగా ఎంపీ రాజుశెట్టి నేతృత్వంలోని స్వాభిమాన్ శేత్కారీ సంఘటన్ పార్టీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. చెరకు పంటకు గిట్టుబాటు ధర కోసం పార్టీ గత ఏడాది ఆందోళన చేసిన సంగతి విదితమే. ఈ ఆందోళన కారణంగా ఆస్తులకు నష్టం వాటిల్లిందని ఆ పార్టీకి పంపిన నోటీసులో హోం శాఖ పేర్కొంది. కాగా ప్రస్తుతం స్వాభిమాన్ పార్టీ ఇదే అంశంపై కరాడ్ తాలూకాలో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి విదితమే. క్వింటాల్ చెరకుకు గిట్టుబాటు ధర కింద రూ. 3,000 చెల్లించాలంటూ శుక్రవారం ఆ పార్టీ ఆందోళనకు దిగాల్సి ఉన్నప్పటికీ సదరు డిమాండ్‌ను పరిశీలిస్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఫోన్‌ద్వారా గురువారం తెలియజేయడంతో వాయిదా వేసుకుంది. ఈ విషయమై ఆ పార్టీ నాయకుడు సదాఖోట్ మీడియాతో మాట్లాడుతూ 2012 క్రషింగ్ సీజన్‌కు సంబంధించి చెరకు కొనుగోలు ధరల విషయమై తమతో చర్చలు జరపాల్సిందిగా ఆయా చక్కెర పరిశ్రమల యాజమాన్యాలను కోరామని, అయితే అందుకు వారు నిరాకరించారని అన్నారు. అందువల్లనే చెరకు రైతులు వీధుల్లోకి రావాల్సి వచ్చిందన్నారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు రైతులు చనిపోయారన్నారు. అయినప్పటికీ బాధిత కుటుంబాలకు ఇప్పటిదాకా పరిహారం అందనే లేదన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం తమ పార్టీకి రూ. 2.25 కోట్ల జరిమానా విధించిందన్నారు. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన ఇద్దరు రైతుల గురించి ప్రభుత్వం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని, పైగా రైతాంగం విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. ఇదిలాఉంచితే చెరకు పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన సాంగ్లి, కొల్హాపూర్, సాతారా జిల్లాలలో స్వాభిమాన్ పార్టీ గత ఏడాది అనేక పర్యాయాలు ఆందోళనలు చేసింది. రహదారులను దిగ్బంధించడమే కాకుండా వాహనాలతోపాటు చెరకు పంటను తరలిస్తున్న ఎడ్ల బండ్లను ముందుకు కదలనీయకుండా అడ్డుకుంది. ఆందోళనకారులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో సాతారా, సాంగ్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. సాంగ్లి జిల్లాలో జరిగిన పోలీసుల కాల్పుల ఘటనలో ఇద్దరు రైతులు చనిపోయారు. అప్పుడే అంచనా వేశాం గత ఏడాది రైతాంగం ఆందోళనల వల్ల కలిగిన నష్టాన్ని అప్పట్లోనే అంచనా వేశామని సాంగ్లి జిల్లా కలెక్టర్ ఉత్తమ్ పాటిల్ తె లిపారు. కేవలం సాంగ్లి జిల్లాలోనే రూ. 50,41,400 మేర నష్టం వాటిల్లిందని ఆయన వివరించారు.