నీటి వనరులను కొల్లగొట్టే చెరకు సాగుకు స్వస్తి చెప్పి, ఆరోగ్యదాయకమైన జీరిక చెట్ల సాగు వైపు తెలుగు రాష్ట్రాల్లో అభ్యుదయ రైతుల దృష్టి మరలుతోందా? ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తే.. అవుననే సమాధానం వస్తుంది. తామర తంపరగా సుగర్ వ్యాధి వ్యాప్తికి తెలుగు రాష్ట్రాలు కేంద్రాలుగా నిలుస్తున్న నేపథ్యంలో ఆరోగ్యదాయకమైన తాటి, ఈత, ఖర్జూర, జీరిక చెట్ల నీరాతో తయారయ్యే బెల్లం, చక్కెర, సిరప్ తదితర ఉత్పత్తుల వాడకంపై నగర, పట్టణ వాసుల దృష్టి మరలుతోంది. సుగర్ వ్యాధిగ్రస్తులు సైతం నిక్షేపంగా ఉపయోగించదగిన తీపి పదార్థాలు కావటంతో వీటికి మార్కెట్‌లో అధిక ధర లభిస్తోంది. దీంతో అభ్యుదయ రైతులు జీరిక చెట్ల సాగుపై దృష్టి సారిస్తున్నారు. వీరిలో అగ్రగణ్యులు ఎం. అప్పిరెడ్డి.
‘తాటి, ఈత, కొబ్బరి చెట్ల కన్నా అత్యంత నాణ్యమైన నీరాను జీరిక చెట్టు అందిస్తుంది. దీన్నే గిరిక తాడి, జీలుగ, డాలర్ చెట్టు అని పిలుస్తున్నారు. అంతేకాకుండా.. ఏడాదిలో 6 నెలలకు పైగా రోజుకు 40–50 లీటర్ల మేరకు ఎటువంటి పోషణా లేకుండా నీరా దిగుబడిని అందిస్తుంది. ఈ నీరాతో తయారయ్యే బెల్లం, పంచదారలో ఫ్రక్టోజు అధికంగా ఉంటుంది. కాబట్టి, సుగర్ వ్యాధిగ్రస్తులు కూడా దీన్ని వాడొచ్చు. అందుకే నేను 40 ఏళ్లుగా కొనసాగిస్తున్న చెరకు సాగుకు స్వస్తి చెప్పి జీరిక సాగుకు శ్రీకారం చుడుతున్నా..’ అంటున్నారు సీనియర్ రైతు నేత అప్పిరెడ్డి. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నివాసం ఉంటున్న ఆయన అఖిల భారత రైతు సమన్వయ సమితి డైరెక్టర్‌గా ఉన్నారు. తెలంగాణా రాష్ట్ర చెరకు రైతుల సంఘం మాజీ అధ్యక్షులు కూడా. ‘ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా, పర్యావరణపరంగా నష్టదాయకమైన చెరకును వదిలెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది.
దీనికి ప్రత్యామ్నాయంగా తాటి, ఈత, ఖర్జూర, జీరిక నీరా ద్వారా బెల్లం, పంచదార, బెల్లం పాకం తదితర 200 ఉత్పత్తులు తయారుచేయవచ్చని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. తూ.గో. జిల్లా పందిరిమామిడిలోని డా. వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ తాటి ఉత్పత్తుల పరిశోధనా స్థానంలో సీనియర్ శాస్త్రవేత్త డా. వెంగయ్య విస్తృతంగా పరిశోధనలు చేసి, ఫలితాలను అందుబాటులోకి తెచ్చారు. మూడేళ్ల క్రితం సాక్షి సాగుబడిలో ప్రచురితమైన డా. వెంగయ్య వ్యాసాల ద్వారానే అద్భుత వృక్షం జీరిక గురించి రైతులోకానికి తెలియవచ్చింది.. అన్నారాయన.
కొరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇనుమడిస్తున్న ఆరోగ్యదాయకమైన ఆహార స్పృహ తాటి, జీరిక నీరాతో బెల్లం, పంచదార ఇతర తీపి ఉత్పత్తులకు మార్కెట్‌లో గిరాకీ బాగా పెరుగుతోందని ఆయన అంటున్నారు. జీరిక పంచదారకు కిలో రూ. వెయ్యి వరకు ధర పలుకుతోంది. మన దేశంలోనే కాదు, విదేశాల్లోనూ మంచి గిరాకీ ఉంది. అందువల్లనే తాను ఈ ఏడాది వంద ఎకరాల్లో జీరిక సాగుకు శ్రీకారం చుడుతున్నానని అప్పిరెడ్డి అంటున్నారు.
కోట్లాదిగా ఉన్న తాటి చెట్ల నుంచి నీరా సేకరించి వాడుకలోకి తేవటంతోపాటు.. అంతకు ఎన్నోరెట్లు ఎక్కువ మోతాదులో నీరాను అందించే జీరిక చెట్ల పెంపకంపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను ఎంతగానో పెంపొందించవచ్చని అప్పిరెడ్డి ప్రభుత్వాలకు సూచిస్తున్నారు.
ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, శ్రీకాకుళం, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ ఏజన్సీ ప్రాంతాల్లో జీరిక చెట్లు వేల సంవత్సరాల నుంచి సహజ సిద్ధంగా పెరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు, స్థానికులు వీటి నుంచి నీరాను తీస్తూ ఆరోగ్యాన్ని పొందటమే కాక ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటున్నారు. ఒక్క చెట్టుకు సంవత్సరానికి కౌలుకు ఇస్తే రూ. 30–35 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. సొంతంగా నీరా తీసే వారు ఏడాదికి చెట్టుకు రూ. లక్ష వరకు సంపాయిస్తూ, అదే తమ ముఖ్య ఆదాయ వనరుగా భావిస్తున్నారు. ఏ మాత్రం పోషణ ఖర్చు లేకుండానే జీరిక చెట్లు ఇస్తున్న ఆదాయం ఇది.
జీరిక మరుగున పడిన గొప్ప ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని అందించే చెట్టు. వీటి సాగును అభివృద్ధి చేయటం ద్వారా, రైతాంగం ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఎంతో అవకాశం ఉందని శాస్త్ర పరిశోధనల ద్వారా రూఢి అయ్యింది. మన దేశ ప్రజల అవసరాలు తీర్చటంతో పాటు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయవచ్చు. శ్రీలంక, కంబోడియా, ఇండోనేషియా వంటి దేశాలు ఈ జాతి చెట్ల నీరా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తూ భారీగా ఆదాయాన్ని గడిస్తున్నాయి. మన ప్రభుత్వాలు, రైతులు జీరిక చెట్ల పెంపకం ఆవశ్యకతను గుర్తెరగాలి. జీరిక మొక్క నాటిన ఆరేళ్లలో నీరా దిగుడిని ఇవ్వటం ప్రారంభం అవుతోంది. మరింత త్వరగా నీరా దిగుబడినిచ్చే విధంగా టిష్యూకల్చర్ మొక్కల ఉత్పత్తి కోసం కూడా చురుగ్గా ప్రయత్నాలు జరుగుతున్నాయని అప్పిరెడ్డి తెలిపారు. స్వల్ప వనరులతోనే అద్భుతాలు సృష్టించవచ్చు. గ్రామీణ ప్రాంతీయులకు ఉపాధి అవకాశాలు పెంపొందించవచ్చు. ప్రభుత్వాలు జీరిక ప్రయోజకత్వాన్ని గుర్తించాలి. ఇందుకోసం పెద్దగా నిధులు కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. కావలసిందల్లా శాస్త్రీయ దృక్పథం. సంకల్పం మాత్రమే అని అప్పిరెడ్డి (83090 24948) అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment