న్యూఢిల్లీ: చెరకు పంటకు ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్(ఎఫ్‌ఆర్‌పీ)ను క్వింటాల్‌కు రూ.10 చొప్పున పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. దీంతో ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే 2023–24 సీజన్‌లో సంవత్సరంలో క్వింటాల్ చెరకు ధర రూ.315కు పెరిగింది. చక్కెర మిల్లులు రైతులకు క్వింటాల్‌కు కనీసం రూ.315 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగింది. ఎఫ్‌ఆర్‌పీని పెంచుతూ ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. 2022–23లో క్వింటాల్ చెరుకు ఎఫ్‌ఆర్‌పీ రూ.305 ఉండగా, ఈసారి రూ.315 కానుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
వ్యవసాయం, అన్నదాతల సంక్షేమానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. రైతన్నలకు మన ప్రధానమంత్రి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్(సీఏసీపీ) సిఫార్సుల ఆధారంగా చెరుకు ఎఫ్‌ఆర్‌పీని ఖరారు చేస్తుంటారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకుంటారు. 2014–15 సీజన్‌లో చెరకు ఎఫ్‌ఆర్‌పీ క్వింటాల్‌కు రూ.210 ఉండేది. 2013–14లో చక్కెర మిల్లులు రూ.57,104 కోట్ల విలువైన చెరకు పంటను కొనుగోలు చేశాయి. 2022–23లో రూ.1,11,366 కోట్ల విలువైన 3,353 లక్షల టన్నుల చెరకును సేకరించాయి. ఇండియాలో దాదాపు 5 కోట్ల మంది రైతులు చెరుకు సాగు చేస్తున్నారు. చక్కెర మిల్లుల్లో దాదాపు 5 లక్షల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు.
నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు!
దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలకు మరింత ఊతం ఇవ్వడమే లక్ష్యంగా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్(ఎన్‌ఆర్‌ఎఫ్) ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం ముద్రవేసింది. ప్రధాని మోదీ అధ్యక్షత బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం వెల్లడించారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లు–2023ను త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టునున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ఉన్న ‘సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు చట్టం–2008’ స్థానంలో ఈ బిల్లును తీసుకొన్నట్లు వివరించారు. 2027–28 దాకా పరిశోధనల కోసం రూ.50,000 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇందులో రూ.14,000 కోట్లను వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఖర్చు చేస్తుందన్నారు. మిగతా రూ.36,000 కోట్లను ప్రైవేట్ రంగ సంస్థలు, అంతర్జాతీయ పరిశోధక సంస్థల నుంచి సేకరిస్తామన్నారు. ఎన్‌ఆర్‌ఎఫ్ పాలక మండలికి ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తారని, ఇందులో 15 నుంచి 25 మంది నిపుణులు, పరిశోధకులు సభ్యులుగా ఉంటారని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు నేతృత్వంలో కార్యనిర్వాహక మండలి సైతం పని చేస్తుందన్నారు.
‘పీఎం–ప్రణామ్’కు ఆమోదం
ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని పెంచడం, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘పీఎం–ప్రణామ్’ కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే యూరియా సబ్సిడీ పథకాన్ని మరో మూడేళ్లపాటు కొనసాగించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.3.68 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూ.1,451 కోట్ల రాయితీ ఇచ్చేందుకు ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అలాగే దేశంలో సల్ఫర్–కోటెడ్ యూరియా(యూరియా గోల్డ్)ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. నేలలో సల్ఫర్ లోపాన్ని సరిచేయడానికి ఈ యూరియా తోడ్పడుతుంది. నేల సారాన్ని కాపాడుకోవడమే ‘పీఎం–ప్రణామ్’ లక్ష్యమని కేంద్రం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment