Fair and Remunerative Price
-
చెరకు ధర క్వింటాల్‌కు రూ.315
న్యూఢిల్లీ: చెరకు పంటకు ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్(ఎఫ్ఆర్పీ)ను క్వింటాల్‌కు రూ.10 చొప్పున పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. దీంతో ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే 2023–24 సీజన్లో సంవత్సరంలో క్వింటాల్ చెరకు ధర రూ.315కు పెరిగింది. చక్కెర మిల్లులు రైతులకు క్వింటాల్‌కు కనీసం రూ.315 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగింది. ఎఫ్ఆర్పీని పెంచుతూ ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. 2022–23లో క్వింటాల్ చెరుకు ఎఫ్ఆర్పీ రూ.305 ఉండగా, ఈసారి రూ.315 కానుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వ్యవసాయం, అన్నదాతల సంక్షేమానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. రైతన్నలకు మన ప్రధానమంత్రి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్(సీఏసీపీ) సిఫార్సుల ఆధారంగా చెరుకు ఎఫ్ఆర్పీని ఖరారు చేస్తుంటారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకుంటారు. 2014–15 సీజన్లో చెరకు ఎఫ్ఆర్పీ క్వింటాల్‌కు రూ.210 ఉండేది. 2013–14లో చక్కెర మిల్లులు రూ.57,104 కోట్ల విలువైన చెరకు పంటను కొనుగోలు చేశాయి. 2022–23లో రూ.1,11,366 కోట్ల విలువైన 3,353 లక్షల టన్నుల చెరకును సేకరించాయి. ఇండియాలో దాదాపు 5 కోట్ల మంది రైతులు చెరుకు సాగు చేస్తున్నారు. చక్కెర మిల్లుల్లో దాదాపు 5 లక్షల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు! దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలకు మరింత ఊతం ఇవ్వడమే లక్ష్యంగా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్(ఎన్ఆర్ఎఫ్) ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం ముద్రవేసింది. ప్రధాని మోదీ అధ్యక్షత బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం వెల్లడించారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లు–2023ను త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టునున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ‘సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు చట్టం–2008’ స్థానంలో ఈ బిల్లును తీసుకొన్నట్లు వివరించారు. 2027–28 దాకా పరిశోధనల కోసం రూ.50,000 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇందులో రూ.14,000 కోట్లను వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఖర్చు చేస్తుందన్నారు. మిగతా రూ.36,000 కోట్లను ప్రైవేట్ రంగ సంస్థలు, అంతర్జాతీయ పరిశోధక సంస్థల నుంచి సేకరిస్తామన్నారు. ఎన్ఆర్ఎఫ్ పాలక మండలికి ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తారని, ఇందులో 15 నుంచి 25 మంది నిపుణులు, పరిశోధకులు సభ్యులుగా ఉంటారని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు నేతృత్వంలో కార్యనిర్వాహక మండలి సైతం పని చేస్తుందన్నారు. ‘పీఎం–ప్రణామ్’కు ఆమోదం ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని పెంచడం, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘పీఎం–ప్రణామ్’ కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే యూరియా సబ్సిడీ పథకాన్ని మరో మూడేళ్లపాటు కొనసాగించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.3.68 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూ.1,451 కోట్ల రాయితీ ఇచ్చేందుకు ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అలాగే దేశంలో సల్ఫర్–కోటెడ్ యూరియా(యూరియా గోల్డ్)ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. నేలలో సల్ఫర్ లోపాన్ని సరిచేయడానికి ఈ యూరియా తోడ్పడుతుంది. నేల సారాన్ని కాపాడుకోవడమే ‘పీఎం–ప్రణామ్’ లక్ష్యమని కేంద్రం వెల్లడించింది. -
చెరకుకు రూ.25 మద్దతు
► చక్కెర ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం ► ‘స్వదేశీ’ రక్షణకు ఆమోదం ► ప్రజాసేకరణ విధానానికీ పచ్చజెండా న్యూఢిల్లీ: మిల్లులు చెరకు రైతులకు చెల్లించాల్సిన కనీస ధర (ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్)ను క్వింటా లుకు రూ.25 పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్.. రక్షణ రంగంలో స్వదేశీ తయారీ ఆయుధాల వాడకాన్ని ప్రోత్సహించటంతోపాటు స్థానిక వస్తువుల సేకరణ వంటి విషయాల్లో మేకిన్ ఇండియాను వేగవంతం చేసే అంశాలకూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పునరుత్పాదక విద్యుదుత్పత్తి రంగం బలోపేతానికి నిధుల సేకరణకు బాండ్లను అమ్మాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. ఐదుకోట్ల రైతులకు మేలు 2017–18 సీజన్ నుంచి క్వింటాల్ చెరకుకు రూ.25ల ఫెయిర్ ప్రైస్‌ను పెంచేందుకు కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతమున్న క్వింటాలు చెరకు ధర రూ. 230కి ఇది 10.6 శాతం పెంపు. కేబినెట్ నిర్ణయం ద్వారా దేశంలోని దాదాపు ఐదుకోట్ల మంది చెరకు రైతులకు మేలు జరగనుంది. దీంతో ఈ ఏడాది అక్టోబర్నుంచి చెరకు రైతులకు చక్కెర మిల్లులు క్వింటాలుకు రూ.255 చెల్లించాల్సి ఉంటుంది. గతేడాదితో పోలిస్తే.. చక్కెర ఉత్పత్తి తగ్గటంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే ఎస్ఏపీ.. కేంద్రం ఇచ్చే ఫెయిర్ ప్రైస్ కన్నా ఎక్కువగా ఉంది. మేకిన్ ఇండియాకు ప్రోత్సాహకంగా..: రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించాలనే ప్రతిపాదన దీర్ఘ కాలంగా ఉంది. దీనిపై బుధవారం నాటి భేటీలో కేబినెట్ చర్చించింది. ‘రక్షణ రంగంలో మేకిన్ ఇండియాను ప్రోత్సహించే ప్రతిపాదనను కేబినెట్ చర్చించింది. ఈ రంగంలో ప్రభుత్వమే కొనుగోలుదారుడు కావటంతో ప్రైవేటురంగంలో తయారీని ప్రోత్సహించేందుకు పూచీకత్తు అవసరం అవుతుంది. దీనివల్ల ప్రభుత్వరంగ సంస్థల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వీలుంటుంది’ అని జైట్లీ తెలిపారు. భారతీయ పారిశ్రామిక దిగ్గజాలతో కలిసి దీర్ఘకాల వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పర్చుకునేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని జైట్లీ వెల్లడించారు. ప్రస్తుతానికి యుద్ధ విమానం, హెలికాప్టర్, జలాంతర్గామి, ఆయుధ వాహనాల మోడళ్లకు ఆమోదం లభించిందన్నారు. మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగంగా.. ప్రజా సేకరణ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడుతుందని వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘రూ.50 లక్షల కన్నా ఎక్కువ విలువైన మొత్తాన్ని సేకరించిన స్థానిక సప్లయర్లకు 20శాతం మార్జిన్ లభిస్తుంది’ అని ప్రకటనలో పేర్కొంది. మరికొన్ని కేబినెట్ నిర్ణయాలు ⇒ అంతర్గత జలరవాణా వ్యవస్థను ప్రోత్సహించేందుకు జాతీయ జలమార్గాలకు కేంద్ర రోడ్డు నిధుల నుంచి 2.5 శాతం నిధులను కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. ⇒ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులకోసం బాండ్ల అమ్మకం ద్వారా రూ.2,360 కోట్లు సేకరించేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. సోలార్ పార్క్, గ్రీన్ కారిడార్, ఉత్పత్తి ఆధారంగా పవన విద్యుత్‌కు పారితోషి కాలు తదితర కార్యక్రమాల్లో వీటిని వినియోగించనున్నారు. ⇒ అవయవాల మార్పిడి సేవలకు సంబంధించి భారత్–స్పెయిన్ వైద్య,ఆరోగ్య శాఖల మధ్య కుదదిరిన ఒప్పందానికి కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. కీలక అవయవాలు అవసాన దశకు చేరుకున్న వారికి ఈ ఒప్పందం ద్వారా మేలు జరగనుంది. ⇒ ఢిల్లీలోని జన్‌పథ్ హోటల్‌ను మూసేసి.. ఆ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించే ఆలోచనకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఐటీడీసీకి చెందిన ఈ హోటల్‌ను నెలరోజుల్లో మూసేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. -
కందులకు గిట్టుబాటు ధర కల్పించాలి
నిర్మల్‌టౌన్ : కందులకు రూ. 10వేలు గిట్టుబాటు ధర కల్పించాలని దళిత బహుజన వామపక్షాల ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం వారు పరిశీలించారు. ఈ సీజన్ లో రైతులు ఎక్కువగా కంది పంటను వేశారని తెలిపారు. గత ఏడాది కందులకు రూ. 8500 నుంచి రూ. 12వేల వరకు మద్ధతు ధరతో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారని గుర్తుచేశారు. కాగా ఈ యేడాది కేవలం రూ.5050 మద్దతు ధరను కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 3,667 క్వింటాళ్ల కందుల కొనుగోలు చేశారని తెలిపారు. మద్ధతు ధర పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశీలనలో నాయకులు కిషన్ కుమార్, జగన్ మోహన్, ఎస్ఎన్ రెడ్డి, శంకర్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.