చెరకుకు రూ.25 మద్దతు | Support for sugarcane Rs. 25 | Sakshi
Sakshi News home page

చెరకుకు రూ.25 మద్దతు

Published Thu, May 25 2017 1:05 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

చెరకుకు రూ.25 మద్దతు - Sakshi

చెరకుకు రూ.25 మద్దతు

► చక్కెర ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర కేబినెట్‌ నిర్ణయం
► ‘స్వదేశీ’ రక్షణకు ఆమోదం
► ప్రజాసేకరణ విధానానికీ పచ్చజెండా  


న్యూఢిల్లీ: మిల్లులు చెరకు రైతులకు చెల్లించాల్సిన కనీస ధర (ఫెయిర్‌ అండ్‌ రెమ్యూనరేటివ్‌ ప్రైస్‌)ను క్వింటా లుకు రూ.25 పెంచుతూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్‌.. రక్షణ రంగంలో స్వదేశీ తయారీ ఆయుధాల వాడకాన్ని ప్రోత్సహించటంతోపాటు స్థానిక వస్తువుల సేకరణ వంటి విషయాల్లో మేకిన్‌ ఇండియాను వేగవంతం చేసే అంశాలకూ కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పునరుత్పాదక విద్యుదుత్పత్తి రంగం బలోపేతానికి నిధుల సేకరణకు బాండ్లను అమ్మాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు.

ఐదుకోట్ల రైతులకు మేలు
2017–18 సీజన్‌ నుంచి క్వింటాల్‌ చెరకుకు రూ.25ల ఫెయిర్‌ ప్రైస్‌ను పెంచేందుకు కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతమున్న క్వింటాలు చెరకు ధర రూ. 230కి ఇది 10.6 శాతం పెంపు. కేబినెట్‌ నిర్ణయం ద్వారా దేశంలోని దాదాపు ఐదుకోట్ల మంది చెరకు రైతులకు మేలు జరగనుంది. దీంతో ఈ ఏడాది అక్టోబర్‌నుంచి చెరకు రైతులకు చక్కెర మిల్లులు క్వింటాలుకు రూ.255 చెల్లించాల్సి ఉంటుంది. గతేడాదితో పోలిస్తే.. చక్కెర ఉత్పత్తి తగ్గటంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే ఎస్‌ఏపీ.. కేంద్రం ఇచ్చే ఫెయిర్‌ ప్రైస్‌ కన్నా ఎక్కువగా ఉంది.

మేకిన్‌ ఇండియాకు ప్రోత్సాహకంగా..: రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించాలనే ప్రతిపాదన దీర్ఘ కాలంగా ఉంది. దీనిపై బుధవారం నాటి భేటీలో కేబినెట్‌ చర్చించింది. ‘రక్షణ రంగంలో మేకిన్‌ ఇండియాను ప్రోత్సహించే ప్రతిపాదనను కేబినెట్‌ చర్చించింది. ఈ రంగంలో ప్రభుత్వమే కొనుగోలుదారుడు కావటంతో ప్రైవేటురంగంలో తయారీని ప్రోత్సహించేందుకు పూచీకత్తు అవసరం అవుతుంది. దీనివల్ల ప్రభుత్వరంగ సంస్థల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వీలుంటుంది’ అని జైట్లీ తెలిపారు. భారతీయ పారిశ్రామిక దిగ్గజాలతో కలిసి దీర్ఘకాల వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పర్చుకునేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని జైట్లీ వెల్లడించారు.

ప్రస్తుతానికి యుద్ధ విమానం, హెలికాప్టర్, జలాంతర్గామి, ఆయుధ వాహనాల మోడళ్లకు ఆమోదం లభించిందన్నారు. మేకిన్‌ ఇండియా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగంగా.. ప్రజా సేకరణ విధానానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీని ద్వారా స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఏర్పడుతుందని వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘రూ.50 లక్షల కన్నా ఎక్కువ విలువైన మొత్తాన్ని సేకరించిన స్థానిక సప్లయర్లకు 20శాతం మార్జిన్‌ లభిస్తుంది’ అని ప్రకటనలో పేర్కొంది.

మరికొన్ని కేబినెట్‌ నిర్ణయాలు
అంతర్గత జలరవాణా వ్యవస్థను ప్రోత్సహించేందుకు జాతీయ జలమార్గాలకు కేంద్ర రోడ్డు నిధుల నుంచి 2.5 శాతం నిధులను కేటాయించేందుకు ఆమోదం తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులకోసం బాండ్ల అమ్మకం ద్వారా రూ.2,360 కోట్లు సేకరించేందుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. సోలార్‌ పార్క్, గ్రీన్‌ కారిడార్, ఉత్పత్తి ఆధారంగా పవన విద్యుత్‌కు పారితోషి కాలు తదితర కార్యక్రమాల్లో వీటిని వినియోగించనున్నారు.
అవయవాల మార్పిడి సేవలకు సంబంధించి భారత్‌–స్పెయిన్‌ వైద్య,ఆరోగ్య శాఖల మధ్య కుదదిరిన ఒప్పందానికి కేంద్ర కేబినెట్‌ అంగీకారం తెలిపింది. కీలక అవయవాలు అవసాన దశకు చేరుకున్న వారికి ఈ ఒప్పందం ద్వారా మేలు జరగనుంది.
ఢిల్లీలోని జన్‌పథ్‌ హోటల్‌ను మూసేసి.. ఆ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించే ఆలోచనకు కేబినెట్‌  పచ్చజెండా ఊపింది. ఐటీడీసీకి చెందిన ఈ హోటల్‌ను నెలరోజుల్లో మూసేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement