న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 284 నగరాల్లో 808 ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం త్వరలోనే ఈ వేలం నిర్వహించనుందని కేంద్ర సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 113 నగరాల్లో 388 ఎఫ్‌ఎం స్టేషన్లు నడుస్తున్నాయని చెప్పారు. కవరేజీ పెంచేందుకు గాను మారుమూల ప్రాంతాల్లోనూ రేడియో టవర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కమ్యూనిటీ రేడియోలు సహా రేడియో స్టేషన్లకు లైసెన్స్ జారీ ప్రక్రియను సులభతరం చేశామన్నారు. టయర్–2, 3 నగరాల్లోనూ విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఆలిండియా రేడియో ఎఫ్‌ఎం ట్రాన్స్‌మిటర్ల ద్వారా దేశంలోని భౌగోళిక ప్రాంతాన్ని 59 శాతం నుంచి 66 శాతానికి, జనాభాలో 68 నుంచి 80 శాతం మందికి సేవలందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. మారుమూల, గిరిజన, వామపక్ష తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లోని వారికి ఉచితంగా 8 లక్షల డీడీ ఫ్రీ డిష్ సెట్ టాప్ బాక్సులను అందజేయనున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment