సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలివిడత మూడు జిల్లాల్లో అమూల్ (ఆనంద్ డెయిరీ) పాలసేకరణ ప్రారంభం కానుంది. చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో ఈ నెల 25 నుంచి ప్రారంభించడానికి ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తోంది. పాలసేకరణ, పాల ఉత్పత్తుల అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్న అమూల్ తన ప్రతినిధులతో వివిధ జిల్లాల్లో సర్వే చేపట్టింది. పాల దిగుబడి అధికంగా ఉన్న జిల్లాలతోపాటు ఏపీ డెయిరీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు కొనసాగుతున్న ప్లాంట్లలోని యాంత్రిక పరికరాల సామర్థ్యాన్ని పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా పాలను సేకరించనుంది. లోటుపాట్లను సరిచేసుకుని 25 నుంచి అధికారికంగా 300 పాలసేకరణ కేంద్రాలను ప్రారంభించనుంది. ప్రైవేట్ డెయిరీల నుంచి ఎదురయ్యే పోటీని అధిగమించడానికి, పాల ఉత్పత్తిదారుల మహిళా సంఘాల ఏర్పాటుకు ఏపీ డెయిరీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మొత్తం 9,899 పాలసేకరణ కేంద్రాలను దశల వారీగా ఏర్పాటు చేయనుంది.
జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కోర్ కమిటీలు..
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమూల్ కార్యక్రమాలు వేగంగా జరగడానికి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కోర్ కమిటీలను ఏపీ డెయిరీ ఏర్పాటు చేసింది. జాయింట్ కలెక్టర్, డ్వామా పీడీ, డీఆర్‌డీఏ పీడీ, డీసీవో, సబ్ కలెక్టర్, పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్‌లు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. మహిళా పాల ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు, రైతులకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా పాడిపశువుల కొనుగోలు, సిబ్బందికి శిక్షణ వంటి కార్యక్రమాలను కోర్ కమిటీలు పర్యవేక్షిస్తాయి. రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకేలు) పరిధిలో ఏర్పాటు కానున్న ఈ పాలసేకరణ కేంద్రాల నిర్మాణాలు, పాలలోని వెన్న శాతం గుర్తించడానికి, ఇతర పనులకు అవసరమైన యాంత్రిక పరికరాల సరఫరా, రూట్‌మ్యాప్‌ల ఖరారు వంటి ప్రధాన బాధ్యతలను ఇవి నిర్వహిస్తాయి. అదేవిధంగా ప్రతి 15 ఆర్బీకేలకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపగల అధికారులు, రైతుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలనే గట్టి నిబద్ధత కలిగిన అధికారులకు ఈ బాధ్యతలు అప్పగిస్తారు. పాల ఉత్పత్తిదారులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండి, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే ప్రధాన బాధ్యత వీరికి డెయిరీ అప్పగిస్తుంది. గ్రామాల్లో పశుపోషణ పట్ల రైతులందరికీ ఆసక్తి కలిగించడానికి, ఆ పోషణ చేసేందుకు ముందుకు వస్తున్న రైతులకు ప్రభుత్వం కల్పించనున్న సౌకర్యాలను గ్రామ సభల ద్వారా ప్రభుత్వం వివరించనుంది. భవిష్యత్‌లో పెరగనున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాడిపశువుల సంఖ్యను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
పాల ఉత్పత్తిదారులకు అనేక సౌకర్యాలు
పాల ఉత్పత్తిదారులకు అనేక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. సేకరణ కేంద్రాలకు పాలు పోసిన రైతులకు ప్రతి 10 రోజులకు ఒకసారి నగదు చెల్లింపులు చేస్తాం. పాడి పశువులకు అవసరమైన దాణాను ఆర్‌బీకేల్లో అందుబాటులో ఉంచుతాం. పశువులకు సత్వర వైద్యం అందుబాటులోకి తీసుకువస్తాం. రెండు వేల లీటర్ల పాలను సేకరించడానికి అవకాశం ఉన్న గ్రామాల్లో ముందుగా పాల సేకరణ కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. పాలలోని వెన్నశాతం, నగదు చెల్లింపులు, ఇతర సేవలు అందించే విషయంలో పారదర్శకంగా ఉంటాం. పశు సంపదను ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న పేదల బతుకుల్లో వెలుగులు నింపడానికి చర్యలు తీసుకుంటున్నాం.
– బాబు అహ్మద్, ఎండీ, ఏపీ డెయిరీ
Comments
Please login to add a commentAdd a comment