రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పాడి రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా పాడి సంపద అభివృద్ధికి చర్యలు చేపట్టింది. మూగజీవాల ఆరోగ్య పరిరక్షణతో పాటు మేలు జాతి పునరుత్పత్తి పథకం ప్రారంభించింది.
నెల్లిమర్ల: పాడి సంపద అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. పశువులు, జీవాల ఆరోగ్య సంరక్షణకు ఇప్పటికే 1962 సంచార పశు వైద్యశాలలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మూగజీవాలకు సరైన రోగ నిర్దారణ చేసి, మరణాలను అరికట్టేందుకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది.
ఆవులు, గేదెలు మేలు రకం ఆడ దూడలకు జన్మనివ్వడానికి, పాల ఉత్పత్తని పెంచడానికి రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా మేలు జాతి పునరుత్పత్తి పథకం ప్రారంభించింది.
ఈ పథకం ద్వారా పాడి రైతులకు సబ్సిడీపై లింగ నిర్ధారిత వీర్యం ఇంజక్షన్లను అందజేస్తారు. తద్వారా పాల ఉత్పత్తిని, మేలు రకం ఆడ దూడల పునరుత్పత్తిని పెంచుతారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పథకాన్ని ప్రస్తుతం చురుగ్గా అమలు చేస్తున్నారు. మొత్తం 8వేల పశువులకు ఇంజక్షన్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పథకం ఉద్దేశం ఇదే...
విజయనగరం జిల్లాలోని 27 మండలాల్లో పాడి సంపదను పెంచడం పథకం ఉద్దేశం. ఆవులు, గేదెలకు మేలు జాతి లింగ నిర్దారిత వీర్యం ఉపయోగించి, ఆడ(పెయ్య) దూడలను ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కచ్చితంగా 90 శాతం ఆడ దూడలనే పుట్టించడం, సదరు సాంకేతికతను రైతుల చెంతకు తీసుకెళ్లడం ఉద్దేశం.
తద్వారా భవిష్యత్తులో అధిక శాతం మేలు జాతి పశువుల సంఖ్యను పెంచాలని సంబంధిత అధికారులు యోచిస్తున్నారు. అంతేగాకుండా ఈ పథకం ద్వారా పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు, పాడి రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మేలు జాతి ఆడ దూడలను ఉత్పత్తి చేసే వీర్య కణాలను పశువులకు అందిస్తున్నారు. ఈ ఏడాది 8 వేల పశువులకు సదరు ఇంజక్షన్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
లింగ నిర్దారిత వీర్య కణాల రకాలివే
రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం ద్వారా పశువులకు అందించడానికి ప్రభుత్వం కొన్ని రకాల మేలు జాతి వీర్య కణాలను ఎంపిక చేసింది. విదేశీ గోజాతులైన జెర్సీ, హెచ్‌ఎఫ్, వాటి క్రాస్ బ్రీడ్, స్వదేశీ జాతులైన గిర్, సాహివాల్ తదితర రకాలు అందుబాటులో ఉన్నాయి. గేదెల్లో ముర్రా జాతికి చెందిన వీర్య నాళికలు అందుబాటులో ఉన్నాయి.
లింగ నిర్దారిత వీర్యంపై ఆసక్తి కలిగిన ఔత్సాహిక రైతులందరికీ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఇటీవల కాలంలోనే ఈనిన పశువులు, 1 నుంచి 3 ఈతల మధ్య క్రమం తప్పకుండా ఎదకు వచ్చే పశువులు, ఎటువంటి గర్భకోశ వ్యాధులు లేనటువంటి పశువులను పథకానికి ఎంపిక చేస్తున్నారు.
గ్రామాల ఎంపిక
పథకం అమలుకు జిల్లా వ్యాప్తంగా మేలైన పశు సంపద, ఔత్సాహిక పశు పోషకులున్న గ్రామాలను పశు సంవర్ధకశాఖ అధికారులు ఎంపిక చేశారు. మొదటి దశలో జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో రెండేసి చొప్పున గ్రామాల్లో పథకం అమలు చేస్తునారు. ఎంపిక చేసిన గ్రామాల్లో కనీసం 35 నుంచి 40 పశువులను గుర్తించి, రైతులతో ఒప్పందం చేసుకున్నారు.
ఆసక్తి కలిగిన రైతులకు అవగాహన కల్పించి, పథకాన్ని విస్తరింపజేస్తున్నారు. తద్వారా జిల్లాలోని అన్ని గ్రామాల్లో పాడి సంపదను అభివృద్ధి చేస్తారు. పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.
ఆడ దూడల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యం
రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం ద్వారా ఆడ దూడల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీని ద్వారా లింగ నిర్దారిత మేలు జాతి వీర్య కణాలను సబ్సిడీపై రైతులకు అందిస్తున్నాం. గ్రామాల్లోని పాడి రైతులకు సబ్సిడీపై వీర్య కణాల ఇంజక్షన్లు అందజేస్తున్నాం. రూ.1350 విలువ చేసే రెండు వీర్య కణాలను రూ.500కే అందిస్తున్నాం.
మొదటి దశ పథకం అమలుకు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా గ్రామాలను గుర్తించాం. ఆయా గ్రామాల్లో ఈ ఏడాది మొత్తం 8 వేల ఇంజక్షన్లను పశువులకు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆసక్తి కలిగిన రైతులు సంబంధిత పశుసంవర్ధక శాఖాధికారులను సంప్రదించాలి.
– డాక్టర్ వైవి.రమణ, జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి
సబ్సిడీపై రెండు వీర్య నాళికలు
ఈ పథకం ద్వారా ప్రభుత్వం పశువుల కృత్రిమ గర్భధారణకు అవసరమైన వీర్య నాళికలను సబ్సిడీపై పాడి రైతులకు అందజేస్తుంది. రెండు వీర్య నాళికల ధర రూ.1350 కాగా రైతు కేవలం రూ 500 చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన రూ.850 ప్రభుత్వమే సబ్సిడీగా అందజేస్తుంది.
ఒకవేళ రెండు పర్యాయాలు కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్ చేసిన తర్వాత కూడా పశువు గర్భం దాల్చకపోతే రైతు చెల్లించిన మొత్తం రూ.500 ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.
మొదటిసారి గర్భం దాల్చిన పశువుకు మగ దూడ పుట్టినట్లయితే ఎటువంటి మొత్తం తిరిగి చెల్లించరు. రెండోసారి గనుక మగ దూడ పుట్టినట్లయితే రూ.250 తిరిగి రైతుకు చెల్లిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment