దేశీ ఆవుకు యమ డిమాండ్‌ | Huge demand for domestic cow | Sakshi
Sakshi News home page

దేశీ ఆవుకు యమ డిమాండ్‌

Jan 4 2022 4:51 AM | Updated on Jan 4 2022 8:27 AM

Huge demand for domestic cow - Sakshi

సాక్షి, అమరావతి: దేశీయ నాటు ఆవుల సంతతిని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం స్వదేశీ నాటు ఆవుల క్షేత్రాలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ ఒంగోలు, పుంగనూరు జాతి ఆవులతోపాటు దేశీయంగా లభించే గిర్, సాహివాల్, రెడ్‌ సింధి, రాటి జాతి ఆవుల పరిరక్షణ ధ్యేయంగా ‘వైఎస్సార్‌ దేశీయ గో పెంపక కేంద్రాల’ పేరిట ఇప్పటికే రూ.17.40 కోట్లతో 58 చోట్ల యూనిట్లు ఏర్పాటు చేసింది. వీటికి రైతుల నుంచి డిమాండ్‌ పెరుగుతుండటంతో కొత్తగా రూ.15.60 కోట్లతో మరో 52 పెంపక కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో స్వదేశీ ఆవులను పునరుత్పత్తి చేస్తూ వాటి సంతతిని పెంపొందించడం, ఏ–2 పాల ఉత్పత్తిని రెట్టింపు చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూర్చాలన్న సంకల్పంతో వీటిని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే జిల్లాకు నాలుగు చొప్పున పెంపక క్షేత్రాలను ఏర్పాటు చేయగా, తాజాగా మరో నాలుగు చొప్పున ఏర్పాటు చేయబోతుంది. 

ఒక్కో యూనిట్‌కు రూ.30 లక్షలు 
వీటి ఏర్పాటు కోసం జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటైన జిల్లాస్థాయి మానిటరింగ్‌ కమిటీల ద్వారా పాడి రైతులతో ఏర్పాటైన జాయింట్‌ లయబిలిటీ గ్రూపుల(జేఎల్‌జీ)ను ఎంపిక చేస్తారు. ఒక్కొక్క గ్రూపునకు రూ.30 లక్షల అంచనా వ్యయంతో ఒక్కో యూనిట్‌ మంజూరు చేస్తారు. ఈ మొత్తంలో 50 శాతం (రూ.15 లక్షలు) సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందిస్తుంది. మిగిలిన మొత్తంలో రూ.6 లక్షలు జేఎల్‌జీ గ్రూపు భరించాల్సి ఉండగా, రూ.9 లక్షలను బ్యాంక్‌ రుణంగా అందిస్తారు. ఒకవేళ సబ్సిడీ పోను మిగిలిన 50 శాతం తామే భరించేందుకు ముందుకొస్తే ఆ గ్రూపునకు బ్యాంక్‌ రుణంతో సంబంధం లేకుండా యూనిట్‌ మంజూరు చేస్తారు. ఒక్కో యూనిట్‌ కింద ఒక్కొక్కటీ రూ.75 వేల నుంచి రూ.లక్ష విలువైన 20 దేశీ ఆవులు, ఓ ఆబోతును అందజేస్తారు. మిగిలిన మొత్తంతో పాల ఉత్పత్తి కోసం ప్రత్యేక పరికరాలు, సంరక్షణకు ప్రత్యేకంగా షెడ్లు నిర్మించుకోవాలి. ప్రతి క్షేత్రానికి అనుసంధానంగా ఐదెకరాల్లో సేంద్రియ పశుగ్రాసం సాగు చేపట్టాల్సి ఉంటుంది. 
విజయనగరం జిల్లాలో వైఎస్సార్‌ స్వదేశీ గోపెంపకం కేంద్రంలోని ఒంగోలు జాతి గోవులు 

‘ఆంధ్రా గో పుష్టి’ పేరిట బ్రాండింగ్‌ 
నేషనల్‌ స్టాండర్డ్స్‌ ఫర్‌ ఆర్గానిక్‌ ప్రొడక్షన్‌ (ఎన్‌ఎస్‌ఓపీ) ప్రమాణాలతో ఏర్పాటయ్యే ఈ క్షేత్రాలకు అదితి ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ (బెంగళూరు) ద్వారా సేంద్రియ ధ్రువీకరణ చేస్తారు. ఇక్కడ ఉత్పత్తయ్యే ఏ–2 పాలతో పాటు ఆవుల పేడ, గో మూత్రం, పంచగవ్య, జీవామృతం వంటి ఉప ఉత్పత్తులకు ‘ఆంధ్రా గో పుష్టి’ పేరిట బ్రాండింగ్‌ చేసి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తారు. పాల సేకరణకు ప్రత్యేకంగా అమూల్‌ అవుట్‌లెట్లు ఏర్పాటు చేస్తారు. పాల ఉప ఉత్పత్తులు, పునరుత్పత్తి ద్వారా వృద్ధి చేసిన స్వదేశీ ఆవులు, ఆబోతులను ఆర్బీకేల ద్వారా విక్రయించుకోవచ్చు. పునరుత్పత్తి ద్వారా ఐదేళ్లలో వాటి సంతతిని ఒక్కో క్షేత్రంలో 50 ఆవులు, 31 ఎద్దులను వృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అదనపు ఆదాయం..
అంతరించిపోతున్న అరుదైన దేశీ ఆవుల సంతతిని పరిరక్షించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్న ఏ–2 పాల ఉత్పత్తిని పెంచడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే ఏర్పాటు చేసిన 58 గో క్షేత్రాలను త్వరలోనే సీఎం జగన్‌ చేతుల మీదుగా ప్రారంభించనున్నాం.
– డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, పశు సంవర్ధక శాఖ మంత్రి

నాటు ఆవుల పరిరక్షణే..
దేశీ నాటు ఆవులను సంరక్షించడమే లక్ష్యంగా  కొత్తగా మరో 52  క్షేత్రాలను ఏర్పాటు చేయబోతున్నాం. వీటికోసం జేఎల్‌జీ గ్రూపుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.  
– డాక్టర్‌ ఆర్‌.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశు సంవర్ధక శాఖ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement