Domestic cow
-
దేశీ ఆవుకు యమ డిమాండ్
సాక్షి, అమరావతి: దేశీయ నాటు ఆవుల సంతతిని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం స్వదేశీ నాటు ఆవుల క్షేత్రాలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ ఒంగోలు, పుంగనూరు జాతి ఆవులతోపాటు దేశీయంగా లభించే గిర్, సాహివాల్, రెడ్ సింధి, రాటి జాతి ఆవుల పరిరక్షణ ధ్యేయంగా ‘వైఎస్సార్ దేశీయ గో పెంపక కేంద్రాల’ పేరిట ఇప్పటికే రూ.17.40 కోట్లతో 58 చోట్ల యూనిట్లు ఏర్పాటు చేసింది. వీటికి రైతుల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో కొత్తగా రూ.15.60 కోట్లతో మరో 52 పెంపక కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో స్వదేశీ ఆవులను పునరుత్పత్తి చేస్తూ వాటి సంతతిని పెంపొందించడం, ఏ–2 పాల ఉత్పత్తిని రెట్టింపు చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూర్చాలన్న సంకల్పంతో వీటిని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే జిల్లాకు నాలుగు చొప్పున పెంపక క్షేత్రాలను ఏర్పాటు చేయగా, తాజాగా మరో నాలుగు చొప్పున ఏర్పాటు చేయబోతుంది. ఒక్కో యూనిట్‌కు రూ.30 లక్షలు వీటి ఏర్పాటు కోసం జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటైన జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీల ద్వారా పాడి రైతులతో ఏర్పాటైన జాయింట్ లయబిలిటీ గ్రూపుల(జేఎల్‌జీ)ను ఎంపిక చేస్తారు. ఒక్కొక్క గ్రూపునకు రూ.30 లక్షల అంచనా వ్యయంతో ఒక్కో యూనిట్ మంజూరు చేస్తారు. ఈ మొత్తంలో 50 శాతం (రూ.15 లక్షలు) సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందిస్తుంది. మిగిలిన మొత్తంలో రూ.6 లక్షలు జేఎల్‌జీ గ్రూపు భరించాల్సి ఉండగా, రూ.9 లక్షలను బ్యాంక్ రుణంగా అందిస్తారు. ఒకవేళ సబ్సిడీ పోను మిగిలిన 50 శాతం తామే భరించేందుకు ముందుకొస్తే ఆ గ్రూపునకు బ్యాంక్ రుణంతో సంబంధం లేకుండా యూనిట్ మంజూరు చేస్తారు. ఒక్కో యూనిట్ కింద ఒక్కొక్కటీ రూ.75 వేల నుంచి రూ.లక్ష విలువైన 20 దేశీ ఆవులు, ఓ ఆబోతును అందజేస్తారు. మిగిలిన మొత్తంతో పాల ఉత్పత్తి కోసం ప్రత్యేక పరికరాలు, సంరక్షణకు ప్రత్యేకంగా షెడ్లు నిర్మించుకోవాలి. ప్రతి క్షేత్రానికి అనుసంధానంగా ఐదెకరాల్లో సేంద్రియ పశుగ్రాసం సాగు చేపట్టాల్సి ఉంటుంది. విజయనగరం జిల్లాలో వైఎస్సార్ స్వదేశీ గోపెంపకం కేంద్రంలోని ఒంగోలు జాతి గోవులు ‘ఆంధ్రా గో పుష్టి’ పేరిట బ్రాండింగ్ నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్ఎస్ఓపీ) ప్రమాణాలతో ఏర్పాటయ్యే ఈ క్షేత్రాలకు అదితి ఆర్గానిక్ సర్టిఫికేషన్ (బెంగళూరు) ద్వారా సేంద్రియ ధ్రువీకరణ చేస్తారు. ఇక్కడ ఉత్పత్తయ్యే ఏ–2 పాలతో పాటు ఆవుల పేడ, గో మూత్రం, పంచగవ్య, జీవామృతం వంటి ఉప ఉత్పత్తులకు ‘ఆంధ్రా గో పుష్టి’ పేరిట బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తారు. పాల సేకరణకు ప్రత్యేకంగా అమూల్ అవుట్లెట్లు ఏర్పాటు చేస్తారు. పాల ఉప ఉత్పత్తులు, పునరుత్పత్తి ద్వారా వృద్ధి చేసిన స్వదేశీ ఆవులు, ఆబోతులను ఆర్బీకేల ద్వారా విక్రయించుకోవచ్చు. పునరుత్పత్తి ద్వారా ఐదేళ్లలో వాటి సంతతిని ఒక్కో క్షేత్రంలో 50 ఆవులు, 31 ఎద్దులను వృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదనపు ఆదాయం.. అంతరించిపోతున్న అరుదైన దేశీ ఆవుల సంతతిని పరిరక్షించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఏ–2 పాల ఉత్పత్తిని పెంచడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే ఏర్పాటు చేసిన 58 గో క్షేత్రాలను త్వరలోనే సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నాం. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశు సంవర్ధక శాఖ మంత్రి నాటు ఆవుల పరిరక్షణే.. దేశీ నాటు ఆవులను సంరక్షించడమే లక్ష్యంగా కొత్తగా మరో 52 క్షేత్రాలను ఏర్పాటు చేయబోతున్నాం. వీటికోసం జేఎల్‌జీ గ్రూపుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. – డాక్టర్ ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశు సంవర్ధక శాఖ -
'దేశీ ఆవు'కు మహర్దశ
సాక్షి, అమరావతి: దేశీయ మేలు జాతి పాడి ఆవుల పెంపకం, పాల ఉత్పత్తి, మార్కెటింగ్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వదేశీ నాటు ఆవుల పెంపక క్షేత్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ క్షేత్రాల ద్వారా అటు స్వదేశీ జాతి ఆవుల సంరక్షణ, ఇటు రైతుకు అదనపు ఆదాయం సమకూరేలా ప్రభుత్వం సంకల్పించింది. వీటి ఏర్పాటుకు రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ లయబిలిటీ గ్రూపు (జేఎల్‌జీ)లను ఎంపిక చేసింది. ఈ గ్రూపులు ఇప్పటికే తమ వాటా సొమ్మును జమ చేయగా, జూన్ నెలాఖరులోగా గ్రూపులకు బ్యాంకు నుంచి రుణం మంజూరుతో పాటు సబ్సిడీ సొమ్ములు విడుదల చేసి, జూలై నాటికల్లా క్షేత్రాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో యూనిట్ రూ.30 లక్షలతో.. రూ.17.40 కోట్ల అంచనాతో రాష్ట్ర వ్యాప్తంగా 58 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్కటి రూ.75 వేల విలువైన 25 దేశీ నాటు ఆవులను ఒక్కో యూనిట్‌కు అందజేస్తారు. వీటి కోసం రూ.10.50 కోట్లు ఖర్చు కానుంది. గోవుల కోసం నిర్మించే షెడ్లు, ఫెన్సింగ్ కోసం ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షల చొప్పున రూ.5.80 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక ఒక్కో యూనిట్‌కు పాల ఉత్పత్తి కోసం ఉపయోగించే పరికరాల కోసం రూ.1,12,250 చొప్పున రూ.65.54 లక్షలు, నిర్వహణ కోసం రూ.1,37,250 చొప్పున రూ.79.46 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఈ విధంగా ఒక్కో యూనిట్‌కు రూ.30 లక్షల చొప్పున ఖర్చు కానుంది. ఈ మొత్తంలో రూ.3 లక్షలు (10 శాతం) జేఎల్‌జీ గ్రూపు భరించనుండగా, రాష్రీ్టయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై), నేషనల్ ఎడాప్షన్ ఫండ్ ఫర్ క్‌లెమైట్ చేంజ్ (ఎన్‌ఎఎఫ్‌సీఎస్) నిధుల నుంచి సబ్సిడీ రూపంలో రూ.18 లక్షలు (60 శాతం) అందించనున్నారు. మిగిలిన రూ.9 లక్షలు (30 శాతం) బ్యాంకుల నుంచి రుణంగా మంజూరు చేయనున్నారు. జూలై నాటికి క్షేత్రాలు ప్రారంభం.. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటైన జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీల ద్వారా ఎంపిక చేసిన జేఎల్‌జీ గ్రూపులు తమ వాటాగా రూ.3 లక్షలు ఇప్పటికే జమ చేశారు. ఈ నెలాఖరులోగా గ్రూపులకు బ్యాంకు రుణాలు మంజూరుతో పాటు పాల ఉత్పత్తుల కోసం అవసరమైన పరికరాల ఎంపిక పూర్తి చేస్తారు. ఎంపిక చేసుకున్న పరికరాలను జూన్ 15 నుంచి 30వ తేదీలోగా కొనుగోలు చేస్తారు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఈ క్షేత్రాల కోసం షెడ్లు నిర్మించే ప్రక్రియను జూన్ 24వ తేదీలోగా పూర్తి చేయనున్నారు. పశుగ్రాసం కొరత లేకుండా చేసేందుకు ఆర్గానిక్ మేనేజ్మెంట్ ప్లాన్ (ఓఎంపీ) ద్వారా పశుగ్రాసం సాగు చేసేందుకు బెంగుళూరుకు చెందిన అదితి ఆర్గానిక్ సరి్టఫికేషన్ ద్వారా జూన్ 1 నంచి 10వ తేదీ వరకు క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తారు. జూన్ 10 నుంచి 30వ తేదీలోగా రుణంతో పాటు సబ్సిడీ మొత్తం జమ చేస్తారు. జూలై మొదటి వారంలో ఎంపిక చేసుకున్న దేశీ ఆవులు కొనుగోలు ప్రక్రియ చేపడతారు. రెండో వారంలో పాల ఉత్పత్తికి శ్రీకారం చుడతారు. ఏ–2 మిల్క్ కు జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ దేశీయ నాటు ఆవులుగా పిలిచే గిర్ (గుజరాత్), షాహివాలా (హరియాణా, పంజాబ్), ఒంగోలు, పుంగనూరు జాతి పశువుల పాలను ఏ–2 మిల్క్‌గా పిలుస్తారు. ఈ పాలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఒక్కో లీటర్ మన రాష్ట్రంలోనే రూ.80 నుంచి రూ.100 పలుకుతోంది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లో లీటర్ రూ.150 నుంచి రూ.180కి పైగా పలుకుతుంది. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధి నివారణకు ఎంతో ఉపయోగపడే ఏ–2 పాల ఉత్పత్తి, వినియోగాన్ని పెంచడంతో పాటు స్వదేశీ జాతులను సంరక్షించడం లక్ష్యంగా దేశీ నాటు ఆవు క్షేత్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. పాలకు మంచి ధర.. మా గోశాలలో వివిధ జాతులకు చెందిన 112 ఆవులు, గేదెలు ఉన్నాయి. జేఎల్‌జీ గ్రూపుగా ఏర్పడి స్వదేశీ నాటు ఆవుల కోసం దరఖాస్తు చేసాం. మా వాటాగా రూ.3 లక్షలు చెల్లించాం. ఈ ప్రాజెక్టు కింద 25 నాటు ఆవులిస్తారు. ఒక్కో ఆవు 4 నుంచి 5 లీటర్ల పాలిస్తుంది. వీటికి విజయవాడ మార్కెట్లోనే లీటర్ రూ.100 ధర పలుకుతోంది. హైదరాబాద్‌లో ఏకంగా రూ.150 నుంచి రూ.180 వరకు ధర ఉంటోంది. – రవికుమార్, సురభి గోశాల. రైతుకు అదనపు ఆదాయం.. దేశీ నాటు ఆవులను సంరక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ క్షేత్రాలను ఏర్పాటు చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఏ–2 పాల ఉత్పత్తిని పెంచడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూర్చాలన్నదే ప్రభుత్వం సంకల్పం. ఇప్పటికే గ్రూపుల ఎంపిక పూర్తయ్యింది. వచ్చే నెలలో రుణాల మంజూరు, షెడ్ల నిర్మాణ ప్రక్రియ పూర్తి చేసి, జూలై మొదటి వారంలో క్షేత్రాలను ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నాం. – ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ -
‘గిన్నిస్’ దిశగా పొట్టి ఆవు అడుగులు
చిత్రంలో కనిపిస్తున్న ఈ ఆవు పొట్టిగానే ఉన్నా దీని ఘనత ఎంతో గొప్పది. తన పొట్టి లక్షణంతోనే గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. కైకలూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన రైతు అట్లూరి శ్యామ్‌ప్రసాద్ దీనిని పోషిస్తున్నారు. ‘కసర్గడ్’ జాతికి చెందిన ఈ దేశీయ ఆవు ఎత్తు కేవలం 29 అంగుళాలు. ఈ ఆవును 2013 ఏప్రిల్‌లో కేరళ రాష్ట్రం కొట్టాయంలో కొనుగోలు చేసినట్లు శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. 86 కేజీల బరువుగల ఈ ఆవు ఇప్పటికి మూడు ఈతలల్లో మూడు దూడలకు జన్మనిచ్చిందన్నారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కలవపూడిలో జన్మభూమి సభ సందర్భంగా నిర్వహించిన పశుప్రదర్శన ఈ ఆవును ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు. దీని ప్రాముఖ్యతను ముఖ్యమంత్రికి కైకలూరు పశువైద్యాధికారి సూరపనేని ప్రతాప్, అట్లూరి శ్యామ్‌ప్రసాద్ వివరించారు. ఇప్పటివరకు గిన్నిస్ రికార్డుల్లో కేరళకు చెందిన 33 అంగుళాల ఎత్తున్న ఆవుకు స్థానం దక్కిందని ప్రతాప్ తెలిపారు. కసర్గడ్ ఆవు పాలల్లో అల్ఫా-2 కేసీన్ ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయని వివరించారు. మధుమేహం, రక్తపోటు నివారణకు ఈ పాలు దివ్వ ఔషధంలా పనిచేస్తాయని పేర్కొన్నారు. ఈ ఆవు వివరాలను గిన్నిస్ బుక్‌లో నమోదుకు పంపాలని సీఎంను కోరామన్నారు. కసర్గడ్ సంతతి అభివృద్ధికి పరిశోధనలు జరపాలని సీఎం చంద్రబాబు పశువైద్యాధికారులను ఆదేశించినట్లు డాక్టర్ సూరపనేని తెలిపారు. -గోపవరం(కైకలూరు)