పశు సంచార అంబులెన్స్ లోపల విభాగాలను పరిశీలిస్తున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పశువుల ఆరోగ్య సంరక్షణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ కింద రెండో దశలో రూ.111.62 కోట్ల వ్యయంతో 165 పశు అంబులెన్స్ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ జెండా ఊపి ఈ అంబులెన్స్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనంలోకి వెళ్లి.. వాటి పనితీరు, సేవలను స్వయంగా పరిశీలించారు.
అంబులెన్స్‌లో కల్పించిన సౌకర్యాలతో పాటు తొలి దశలో ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా అందించిన సేవలను పశు సంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్ర కుమార్ సీఎంకు వివరించారు. టోల్ ఫ్రీ నంబర్ 1962కు ఫోన్ రాగానే వాహనం నేరుగా ఆ గ్రామానికి చేరుకొని రైతు ఇంటి ముంగిటే సేవలందిస్తుందని చెప్పారు. మెరుగైన వైద్యం అవసరమైతే సమీప పశు వైద్యశాలకు తరలించి వైద్య సేవలనంతరం పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి ఉచితంగా అదే అంబులెన్స్‌లో రైతు ఇంటికి భద్రంగా చేరుస్తున్నారన్నారు.
పంజాబ్, చత్తీస్‌గఢ్, కేరళ తదితర రాష్ట్రాల బృందాలు ఇప్పటికే ఏపీలో పర్యటించి, మన అంబులెన్స్‌లను, వీటి ద్వారా అందిస్తోన్న సేవలను పరిశీలించి వెళ్లారని.. ఆయా రాష్ట్రాల్లో మన మోడల్‌లోనే అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. అంబులెన్స్‌లో కల్పించిన సౌకర్యాలు, అందిస్తోన్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. సకాలంలో వైద్యం అందని పరిస్థితి రాష్ట్రంలో ఉండకూడదని సూచించారు. మూగ జీవాలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు.
పశు సంచార అంబులెన్స్ డ్రైవర్లకు నమస్కరిస్తున్న సీఎం జగన్
అందుబాటులో 340 అంబులెన్స్‌లు
తొలిదశలో రూ.129.07 కోట్లతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 పశు అంబులెన్స్‌లు ఏర్పాటు చేయగా, తాజాగా రెండో దశలో మరో 165 పశు అంబులెన్స్‌లను ప్రభుత్వం రైతులకు అందుబాటులోకి తెచ్చింది. మొత్తంగా రూ.240.69 కోట్లతో 340 పశు అంబులెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటి కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ (1962)ను ఏర్పాటు చేసింది. ఈ కాల్ సెంటర్ 3.71 లక్షల కాల్స్‌ను అటెండ్ చేయగా, అంబులెన్స్‌లు 1,28,625 ట్రిప్‌లు తిరిగాయి.
1,81,791 పశువులు, సన్న జీవాలు, పెంపుడు జంతువులను ప్రాణాపాయం నుంచి రక్షించి 1,26,559 మంది పశు పోషకులకు లబ్ధి చేకూర్చాయి. బుధవారం నాటి కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, స్పెషల్ సీఎస్ వై.మధుసూదనరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎం.హనుమంతరావు, లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు ముస్తాఫా, మద్దాల గిరి, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment