పశు సంచార అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి అప్పలరాజు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి
వైద్య ఆరోగ్య శాఖలో ఒక సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేశాం. అదే రీతిలో పశు సంవర్థక శాఖలో కూడా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అందుకు అనుగుణంగా గ్రామ స్థాయిలో పశు సంవర్థక విభాగాన్ని బలోపేతం చేయాలి. ఆర్బీకేల్లో పని చేస్తోన్న పశు సంవర్థక సహాయకుల సమర్థతను మెరుగు పరిచేలా చర్యలు తీసుకోవాలి. గ్రామ స్థాయిలో పనిచేసే ఒకరిద్దరు వలంటీర్లను ఈ సేవల్లో భాగస్వాములను చేయాలి.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘నాణ్యమైన, మెరుగైన పశు వైద్య సేవలు అందించేందుకు సమర్థవంతంగా పనిచేసే పటిష్టమైన అంచెల విధానాన్ని తీసుకురావాలి. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో పని చేసేలా హేతుబద్ధమైన వ్యవస్థ ఉండాలి. తగిన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలి. యూనిఫార్మిటీ తీసుకురావడం ద్వారా నాణ్యమైన సేవలు అందుబాటులోకి తీసుకు రావచ్చు. ఇందుకోసం తగిన మార్గదర్శక ప్రణాళిక తయారు చేయాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖలపై బుధవారం ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూగ జీవాలకు అందిస్తోన్న సేవల్లో దేశానికి మనం మార్గనిర్దేశంగా నిలిచామని, దాన్ని ఇదే రీతిన కొనసాగించాలన్నారు. మండల స్థాయిలో ఉన్న ఈ వ్యవస్థ నుంచి ఆర్బీకేల్లో ఉన్న పశు సంవర్థక సహాయకులకు పూర్తి స్థాయి మద్దతు, సహకారం ఉండేలా చూడాలని చెప్పారు. దీనివల్ల సంతృప్త స్థాయిలో పశువులకు తగిన వైద్య సేవలుు అందించడానికి వీలవుతుందన్నారు. ఈ మేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌ఓపీ) తయారు చేయాలని ఆదేశించారు. ఈ వ్యవస్థ ఏర్పాటు విషయంలో ఏం చేయాలో నిర్ధిష్టమైన విధానాన్ని నిర్ధేశించుకున్న తర్వాత నాడు – నేడు కింద మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
పర్యవేక్షణ కోసం హెల్త్ కార్డు
► ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రతి పశువుకూ హెల్త్ కార్డు జారీ చేయాలి. వాటి ఆరోగ్య పరిస్థితి, పోషకుల వివరాలు ఆ కార్డులో పొందుపర్చాలి. ఈ కార్డుల జారీ వల్ల వాటికి అందుతున్న వైద్య సేవలపై పర్యవేక్షణ సులభతరం అవుతుంది.
► పశువులకు నూరు శాతం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలి. నెలవారీ లక్ష్యాలు నిర్దేశించుకుని పని చేయాలి. పశువులకు పంపిణీ చేసిన మందులను నిల్వ చేయడానికి ప్రతి ఆర్బీకేలో ఫ్రిజ్ సహా అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చాలి.
► పశు సంవర్థక శాఖలో అన్ని రకాల సేవల కోసం ఒకే నంబరు వినియోగించాలి. పశు పోషకుల వద్ద కాల్ సెంటర్ నెంబర్ ఉండాలి. పశువుల అంబులెన్స్‌ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఎస్‌ఓపీ రూపొందించాలి. పశు సంవర్థక శాఖ ద్వారా అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ వివక్ష లేకుండా అర్హులందరికీ అందేలా చూడాలి. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని అమలు చేసే దిశగా కృషి చేయాలి.
పాడి రైతుల జీవనోపాధిపై దృష్టి
► గడిచిన రెండేళ్లుగా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలకు వైఎస్సార్ చేయూత పథకం కింద ఏడాదికి రూ.18,750 చొప్పున ఇచ్చాం. ఈ డబ్బు వారి జీవనోపాధి మార్గాలను మెరుగు పరచడానికి, ఆ మార్గాలను బలోపేతం చేయడానికి ఉపయోగ పడుతుంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళా పాడి రైతులకు జీవనోపాధి కల్పనపై దృష్టి సారించాలి.
► పశుపోషణ సహా ఇతర జీవనోపాధి మార్గాల కోసం అవసరమైన రుణాలు మంజూరు విషయంలో అధికారులు దృష్టి సారించాలి. పాలల్లో రసాయన మూలకాలు ఉన్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలి. పాల నాణ్యత పెరిగేలా శ్రద్ధ వహించాలి. రసాయనాలకు తావులేని పశు పోషణ విధానలపై అవగాహన పెంచాలి. ఆ దిశగా పాడి రైతులకు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన మిల్క్ సొసైటీల వద్ద అమూల్ భాగస్వామ్యంతో శిక్షణ ఇవ్వాలి. చిత్తూరు డెయిరీని సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలి. డెయిరీ పునరుద్దరణకు రెండు మూడు వారాల్లో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలి.
ఆర్బీకే స్థాయిలో ఆక్వా కొనుగోళ్లు
► ఆక్వా రైతులకు మేలు చేసేందుకే ఫీడ్, సీడ్ రేట్లపై నియంత్రణ కోసం చట్టాలను తీసుకొచ్చాం. వీటిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఎలా తీసేశామో అదే రీతిలో ఆక్వా ఉత్పత్తుల కొనుగోళ్లలో కూడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలి. – ఆర్బీకే స్థాయిలో ఆక్వా కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా ఆర్బీకే వ్యవస్థను బలోపేతం చేయాలి. అందుకనుగుణంగా యాక్షన్ ప్లాన్‌ను రూపొందించుకోవాలి. సహకార రంగంలో డెయిరీలు ఏర్పాటు చేస్తున్నట్టుగానే ఆక్వా రంగంలో కూడా సహకార పద్ధతిలోనే కొత్త ప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పాటుపై తగిన ఆలోచన చేయాలి. ఆక్వా సాగయ్యే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించాలి.
► ఫిషింగ్ హార్బర్ల పనులు వేగవంతం చేయాలి. నిర్ధేశించిన లక్ష్యం మేరకు పనులు పూర్తయ్యేలా చూడాలి. అప్పుడే మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయి. మత్స్యకారుల ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర జీడీపీ పెరుగుతుంది. ప్రతి ఫిషింగ్ హార్బర్ నుంచి ఏటా కనీసం రూ.వెయ్యి కోట్లకు పైగా ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతాయి. ఇది పరోక్షంగా ఆర్థికాభివృద్ధికి దోహద పడుతుంది. ఉపాధి కోసం మన మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఎంతమాత్రం ఉండదు.
► ఈ సమావేశంలో పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ (అప్సడా) వైస్ చైర్మన్ వడ్డి రఘురాం, పశు సంవర్థక, పాడి పరిశ్రామిభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.మధుసూదనరెడ్డి, పశు సంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్, మత్స్య శాఖ కమిషనర్ కే.కన్నబాబు, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీ అహ్మద్ బాబు తదితరులు పాల్గొన్నారు.
రెండో ఫేజ్ హార్బర్లకు పర్యావరణ అనుమతులు
► రెండవ ఫేజ్‌లో నిర్మించనున్న వాడరేవు, బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి అటవీ, పర్యావరణ సహా అన్ని రకాల అనుమతులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని అధికారులు సీఎంకు వివరించారు.
► మొదటి ఫేజ్‌లో చేపట్టిన ఫిషింగ్ హార్బర్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు 92.5 శాతం పూర్తయ్యాయని, ఫిబ్రవరి 15 నాటికి మిగిలిన పనులు పూర్తవుతాయని చెప్పారు. నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో కూడా పనులు వేగం పుంజుకున్నాయని తెలిపారు. ప్రతి 3 నెలలకొకటి చొప్పున డిసెంబర్‌కల్లా మొదటి ఫేజ్ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. మొత్తం 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి రూ.3,520.57 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు.
► ఏపీలో పశువులకు వైద్య సేవలు అందిస్తున్న అంబులెన్స్ విధానంపై ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పంజాబ్, ఛత్తీస్‌గఢ్, కేరళకు చెందిన అధికారులు రాష్ట్రాన్ని సందర్శించి వెళ్లారని, ఆయా రాష్ట్రాల్లో ఏపీ మోడల్‌లోనే పశు అంబులెన్స్‌ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారని వివరించారు.
► ఆర్బీకే స్థాయిలో ఖాళీగా ఉన్న 4,765 పశు సంవర్థక సహాయకుల పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జగనన్న పాల వెల్లువ కింద 2.6 లక్షల మంది రైతులు సభ్యులుగా చేరారని, వారి నుంచి ఇప్పటి వరకు 6.06 కోట్ల లీటర్ల పాలను సేకరించామన్నారు. వచ్చే 2 నెలల్లో మరో 1,422 గ్రామాల్లోకి జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment