veterinary clinics
-
పాడి రైతుకు తోడు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు పాడి రైతన్నలకు బాసటగా నిలుస్తూ పశువులకు పూర్తిస్థాయి ఆరోగ్య భద్రత కల్పిస్తున్నాయి. ఆర్బీకేల రాకతో తమ కష్టాలకు తెర పడిందని పాడి రైతులు చెబుతున్నారు. ప్రాథమిక వైద్యం కోసం మండల కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన అవస్థలు తొలగిపోయాయి. ఆర్బీకేలతో గ్రామ స్థాయిలో పశువైద్య సేవలందించడమే కాకుండా సర్టిఫై చేసిన నాణ్యమైన పశుగ్రాస విత్తనాలు, సంపూర్ణ మిశ్రమ దాణా, మినరల్ మిక్చర్, చాప్ కట్టర్స్.. ఏది కావాలన్నా గుమ్మం వద్దకే తెచ్చి ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 108 అంబులెన్స్‌ల తరహాలో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రూ.240.69 కోట్ల వ్యయంతో రెండు విడతల్లో 340 అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. వీటిని నియోజక వర్గానికి రెండు చొప్పన అందుబాటులోకి తీసుకొచ్చి ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రతి అంబులెన్స్ లో రూ.35 వేల విలువైన 81 రకాల మందులను అందుబాటులో ఉంచారు. 54 రకాల అత్యాధునిక పరికరాలతో పాటు వెయ్యి కిలోలు బరువున్న జీవాలను ఎత్తగలిగేలా హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యం కల్పించారు. ఇప్పటివరకు కాల్ సెంటర్‌కు రైతుల నుంచి రోజుకు సగటున 1500 కాల్స్ చొప్పున 3.90 లక్షల కాల్స్ రాగా మారుమూల పల్లెల్లో 1.30 లక్షల ట్రిప్పులు తిరిగాయి. దాదాపు 2 లక్షలకుపైగా పశువులకు అత్యవసర వైద్య సేవలు అందించారు. ఇప్పటి వరకు 1.35 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. ఏపీ తరహాలో పంజాబ్, కేరళ, ఛత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాలు వెటర్నరీ అంబులెన్స్‌లను తీసుకొస్తున్నాయి. ఆర్బీకేల ద్వారా అందిస్తున్న పశు వైద్యసేవలపై ‘సాక్షి బృందం’ రాష్ట్రవ్యాప్తంగా క్షేత్ర స్థాయి పరిశీలన నిర్వహించింది. మూగ జీవులపై మమకారం.. వైఎస్సార్ పశు సంరక్షణ పథకం కింద పశువులకు హెల్త్‌కార్డులు జారీ చేయడమే కాకుండా పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులతో ఆర్ధిక చేయూతనిస్తున్నారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు అందిస్తున్నారు. కృత్రిమ గర్భదారణ, పునరుత్పత్తి, దూడల సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతినెలా 3వ శనివారం పాడి రైతులకు, 2, 4వ బుధవారాల్లో గొర్రెలు, మేకల పెంపకందారులకు వైఎస్సార్ పశువిజ్ఞానబడులు నిర్వహిస్తూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఆర్బీకేల్లో దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా పాడి, మూగజీవాల పెంపకంపై శిక్షణ ఇస్తున్నారు. పాడి రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా 155251, 1962 టోల్‌ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. రెండున్నరేళ్లలో సేవలిలా.. రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కాగా పాడి సంపద ఎక్కువగా ఉన్న 8,330 ఆర్బీకేల్లో ట్రైవిస్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి నెలా రూ.4 వేల విలువైన మందులను సరఫరా చేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా గత 32 నెలల్లో 4,468 టన్నుల గడ్డి విత్తనాలు, 62,435 టన్నుల సంపూర్ణ మిశ్రమం, 60 వేల కిలోల నూట్రిషనల్ సప్లిమెంట్స్, 350 టన్నుల పశువుల మేతతో పాటు 3,909 చాప్ కట్టర్స్ పంపిణీ చేశారు. ఆర్బీకేల ద్వారా 2 కోట్ల పశువులకు టీకాలిచ్చారు. 33.08 లక్షల పశువులకు హెల్త్ కార్డులు జారీ చేశారు. 14.73 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ జరిగింది. 1.61 కోట్ల పశువులకు ప్రాథమిక వైద్యసేవలు అందించారు. పశువిజ్ఞాన బడుల్లో 13.99 లక్షల మంది రైతులకు శిక్షణ నిచ్చారు. ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు 42 వేల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులందించి రుణ పరపతి కల్పిస్తున్నారు. 75 శాతం రాయితీపై విత్తనాలు గతంలో నాణ్యమైన పచ్చగడ్డి దొరక్క పశువులు సకాలంలో ఎదకు వచ్చేవి కావు. పాల దిగుబడి సరిగా ఉండేది కాదు. ఆర్బీకేల ద్వారా రాయితీపై నాణ్యమైన మొక్కజొన్న (ఆఫ్రికన్ టాల్ గడ్డి రకం) విత్తనాలను 75 శాతం రాయితీపై తీసుకొని సాగు చేశా. 60 రోజుల్లో 9 అడుగులు పెరిగి ఎకరానికి 5–6 టన్నుల దిగుబడి వచ్చింది. ఇప్పుడు మేత ఇష్టంగా తింటున్నాయి. సకాలంలో ఎదకు రావటమే కాకుండా పాల దిగుబడి రోజుకి 2–3 లీటర్లు పెరిగింది. సీఎం జగన్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – అంకంరెడ్డి రవికుమార్, ఓఈపేట, అనకాపల్లి జిల్లా ఆరోగ్యంగా పశువులు.. అదనంగా లాభం నాకు 8 పశువులున్నాయి. గడ్డి కత్తిరించే యంత్రాల ద్వారా మేత వృథా కాకుండా ఎలా నివారించవచ్చో పశువిజ్ఞాన బడి కార్యక్రమాల ద్వారా తెలుసుకున్నా. 40 శాతం రాయితీపై గడ్డి కత్తిరించే యంత్రాన్ని ఆర్బీకేలో తీసుకున్నా. మొక్కజొన్న గడ్డిని ముక్కలుగా చేసి అందిస్తున్నా. గేదెలు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాయి. గతంలో 62 లీటర్ల పాల దిగుబడి రాగా ప్రస్తుతం 70 లీటర్లు వస్తున్నాయి. అదనంగా రూ.320 లాభం వస్తోంది. ప్రభుత్వానికి నిజంగా రుణపడి ఉంటాం. – చిలంకూరి తిరుపతయ్య, లింగారెడ్డిపల్లి, ప్రకాశం జిల్లా మేతకు ఇబ్బంది లేదు.. గతంలో పశుగ్రాసం కోసం చాలా ఇబ్బందిపడే వాళ్లం. ఇటీవలే ఆర్బీకేలో సీఎస్హెచ్–24 గడ్డిజాతి విత్తనాలను రాయితీపై తీసుకున్నా. ఎకరం పొలంలో 15 కిలోలు చల్లా. 60 రోజుల్లో ఆరడుగులు పెరిగింది. కత్తిరించి పశువులకు మేతగా వేస్తున్నాం. సకాలంలో ఎదకు వస్తున్నాయి. పాల దిగుబడి కూడా పెరిగింది. –శ్రీరాం లక్ష్మీనారాయణ, చిల్లకల్లు, ఎన్టీఆర్ జిల్లా ఆర్బీకేల ద్వారా పశువైద్య సేవలు ఆర్బీకేల ద్వారా పాడిరైతుల గడప వద్దకే పశు వైద్య సేవలందిస్తున్నాం. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. పాడిరైతుకు ఏది కావాలన్నా ఆర్బీకేల ద్వారా అందిస్తున్నాం. రూ.4 వేల విలువైన మందులతో పాటు నాణ్యమైన పశుగ్రాస విత్తనాలు, సంపూర్ణ మిశ్రమ దాణా, గడ్డికోసే యంత్రాలను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతున్నాం. –డాక్టర్ అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ వెన్న శాతం, దిగుబడి పెరిగింది వైఎస్సార్ జిల్లా వెలమవారిపల్లెకు చెందిన జే.గుర్రప్ప జీవనాధారం పాడిపోషణే. తనకున్న 15 పశువులకు మేతగా ఎండుగడ్డి, శనగ కట్టెతో పాటు ఆరు బయట లభ్యమయ్యే పచ్చగడ్డి అందించినప్పుడు ఆశించిన పాల దిగుబడి వచ్చేది కాదు. పశువులు తరచూ అనారోగ్యాల బారిన పడేవి. ఆర్నెళ్ల క్రితం ఆర్బీకే ద్వారా 50 కిలోల గడ్డి విత్తనాలు తీసుకొని సాగు చేశాడు. గడ్డిలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పశువులు ఇష్టంగా మేత మేశాయి. పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. రోజుకు 4–4.5 లీటర్ల పాలు ఇచ్చే ఈ పశువులు ప్రస్తుతం 5–6.5 లీటర్లు ఇస్తున్నాయి. పాలల్లో వెన్న శాతం 5–6 నుంచి 7–8 శాతానికి పెరిగింది. లీటర్‌పై రూ.10 అదనంగా పొందగలుగుతున్నట్లు గుర్రప్ప ఆనందంగా చెబుతున్నాడు. -
మూగ జీవాలకు కొండంత భరోసా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పశువుల ఆరోగ్య సంరక్షణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ కింద రెండో దశలో రూ.111.62 కోట్ల వ్యయంతో 165 పశు అంబులెన్స్ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ జెండా ఊపి ఈ అంబులెన్స్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనంలోకి వెళ్లి.. వాటి పనితీరు, సేవలను స్వయంగా పరిశీలించారు. అంబులెన్స్‌లో కల్పించిన సౌకర్యాలతో పాటు తొలి దశలో ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా అందించిన సేవలను పశు సంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్ర కుమార్ సీఎంకు వివరించారు. టోల్ ఫ్రీ నంబర్ 1962కు ఫోన్ రాగానే వాహనం నేరుగా ఆ గ్రామానికి చేరుకొని రైతు ఇంటి ముంగిటే సేవలందిస్తుందని చెప్పారు. మెరుగైన వైద్యం అవసరమైతే సమీప పశు వైద్యశాలకు తరలించి వైద్య సేవలనంతరం పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి ఉచితంగా అదే అంబులెన్స్‌లో రైతు ఇంటికి భద్రంగా చేరుస్తున్నారన్నారు. పంజాబ్, చత్తీస్‌గఢ్, కేరళ తదితర రాష్ట్రాల బృందాలు ఇప్పటికే ఏపీలో పర్యటించి, మన అంబులెన్స్‌లను, వీటి ద్వారా అందిస్తోన్న సేవలను పరిశీలించి వెళ్లారని.. ఆయా రాష్ట్రాల్లో మన మోడల్లోనే అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. అంబులెన్స్‌లో కల్పించిన సౌకర్యాలు, అందిస్తోన్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. సకాలంలో వైద్యం అందని పరిస్థితి రాష్ట్రంలో ఉండకూడదని సూచించారు. మూగ జీవాలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. పశు సంచార అంబులెన్స్ డ్రైవర్లకు నమస్కరిస్తున్న సీఎం జగన్ అందుబాటులో 340 అంబులెన్స్‌లు తొలిదశలో రూ.129.07 కోట్లతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 పశు అంబులెన్స్‌లు ఏర్పాటు చేయగా, తాజాగా రెండో దశలో మరో 165 పశు అంబులెన్స్‌లను ప్రభుత్వం రైతులకు అందుబాటులోకి తెచ్చింది. మొత్తంగా రూ.240.69 కోట్లతో 340 పశు అంబులెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటి కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ (1962)ను ఏర్పాటు చేసింది. ఈ కాల్ సెంటర్ 3.71 లక్షల కాల్స్‌ను అటెండ్ చేయగా, అంబులెన్స్‌లు 1,28,625 ట్రిప్‌లు తిరిగాయి. 1,81,791 పశువులు, సన్న జీవాలు, పెంపుడు జంతువులను ప్రాణాపాయం నుంచి రక్షించి 1,26,559 మంది పశు పోషకులకు లబ్ధి చేకూర్చాయి. బుధవారం నాటి కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, స్పెషల్ సీఎస్ వై.మధుసూదనరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎం.హనుమంతరావు, లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు ముస్తాఫా, మద్దాల గిరి, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పశు వైద్యానికీ పటిష్ట వ్యవస్థ
వైద్య ఆరోగ్య శాఖలో ఒక సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేశాం. అదే రీతిలో పశు సంవర్థక శాఖలో కూడా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అందుకు అనుగుణంగా గ్రామ స్థాయిలో పశు సంవర్థక విభాగాన్ని బలోపేతం చేయాలి. ఆర్బీకేల్లో పని చేస్తోన్న పశు సంవర్థక సహాయకుల సమర్థతను మెరుగు పరిచేలా చర్యలు తీసుకోవాలి. గ్రామ స్థాయిలో పనిచేసే ఒకరిద్దరు వలంటీర్లను ఈ సేవల్లో భాగస్వాములను చేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘నాణ్యమైన, మెరుగైన పశు వైద్య సేవలు అందించేందుకు సమర్థవంతంగా పనిచేసే పటిష్టమైన అంచెల విధానాన్ని తీసుకురావాలి. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో పని చేసేలా హేతుబద్ధమైన వ్యవస్థ ఉండాలి. తగిన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలి. యూనిఫార్మిటీ తీసుకురావడం ద్వారా నాణ్యమైన సేవలు అందుబాటులోకి తీసుకు రావచ్చు. ఇందుకోసం తగిన మార్గదర్శక ప్రణాళిక తయారు చేయాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖలపై బుధవారం ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూగ జీవాలకు అందిస్తోన్న సేవల్లో దేశానికి మనం మార్గనిర్దేశంగా నిలిచామని, దాన్ని ఇదే రీతిన కొనసాగించాలన్నారు. మండల స్థాయిలో ఉన్న ఈ వ్యవస్థ నుంచి ఆర్బీకేల్లో ఉన్న పశు సంవర్థక సహాయకులకు పూర్తి స్థాయి మద్దతు, సహకారం ఉండేలా చూడాలని చెప్పారు. దీనివల్ల సంతృప్త స్థాయిలో పశువులకు తగిన వైద్య సేవలుు అందించడానికి వీలవుతుందన్నారు. ఈ మేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) తయారు చేయాలని ఆదేశించారు. ఈ వ్యవస్థ ఏర్పాటు విషయంలో ఏం చేయాలో నిర్ధిష్టమైన విధానాన్ని నిర్ధేశించుకున్న తర్వాత నాడు – నేడు కింద మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పర్యవేక్షణ కోసం హెల్త్ కార్డు ► ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రతి పశువుకూ హెల్త్ కార్డు జారీ చేయాలి. వాటి ఆరోగ్య పరిస్థితి, పోషకుల వివరాలు ఆ కార్డులో పొందుపర్చాలి. ఈ కార్డుల జారీ వల్ల వాటికి అందుతున్న వైద్య సేవలపై పర్యవేక్షణ సులభతరం అవుతుంది. ► పశువులకు నూరు శాతం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలి. నెలవారీ లక్ష్యాలు నిర్దేశించుకుని పని చేయాలి. పశువులకు పంపిణీ చేసిన మందులను నిల్వ చేయడానికి ప్రతి ఆర్బీకేలో ఫ్రిజ్ సహా అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చాలి. ► పశు సంవర్థక శాఖలో అన్ని రకాల సేవల కోసం ఒకే నంబరు వినియోగించాలి. పశు పోషకుల వద్ద కాల్ సెంటర్ నెంబర్ ఉండాలి. పశువుల అంబులెన్స్‌ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఎస్ఓపీ రూపొందించాలి. పశు సంవర్థక శాఖ ద్వారా అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ వివక్ష లేకుండా అర్హులందరికీ అందేలా చూడాలి. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని అమలు చేసే దిశగా కృషి చేయాలి. పాడి రైతుల జీవనోపాధిపై దృష్టి ► గడిచిన రెండేళ్లుగా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలకు వైఎస్సార్ చేయూత పథకం కింద ఏడాదికి రూ.18,750 చొప్పున ఇచ్చాం. ఈ డబ్బు వారి జీవనోపాధి మార్గాలను మెరుగు పరచడానికి, ఆ మార్గాలను బలోపేతం చేయడానికి ఉపయోగ పడుతుంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళా పాడి రైతులకు జీవనోపాధి కల్పనపై దృష్టి సారించాలి. ► పశుపోషణ సహా ఇతర జీవనోపాధి మార్గాల కోసం అవసరమైన రుణాలు మంజూరు విషయంలో అధికారులు దృష్టి సారించాలి. పాలల్లో రసాయన మూలకాలు ఉన్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలి. పాల నాణ్యత పెరిగేలా శ్రద్ధ వహించాలి. రసాయనాలకు తావులేని పశు పోషణ విధానలపై అవగాహన పెంచాలి. ఆ దిశగా పాడి రైతులకు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన మిల్క్ సొసైటీల వద్ద అమూల్ భాగస్వామ్యంతో శిక్షణ ఇవ్వాలి. చిత్తూరు డెయిరీని సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలి. డెయిరీ పునరుద్దరణకు రెండు మూడు వారాల్లో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలి. ఆర్బీకే స్థాయిలో ఆక్వా కొనుగోళ్లు ► ఆక్వా రైతులకు మేలు చేసేందుకే ఫీడ్, సీడ్ రేట్లపై నియంత్రణ కోసం చట్టాలను తీసుకొచ్చాం. వీటిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఎలా తీసేశామో అదే రీతిలో ఆక్వా ఉత్పత్తుల కొనుగోళ్లలో కూడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలి. – ఆర్బీకే స్థాయిలో ఆక్వా కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా ఆర్బీకే వ్యవస్థను బలోపేతం చేయాలి. అందుకనుగుణంగా యాక్షన్ ప్లాన్‌ను రూపొందించుకోవాలి. సహకార రంగంలో డెయిరీలు ఏర్పాటు చేస్తున్నట్టుగానే ఆక్వా రంగంలో కూడా సహకార పద్ధతిలోనే కొత్త ప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పాటుపై తగిన ఆలోచన చేయాలి. ఆక్వా సాగయ్యే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించాలి. ► ఫిషింగ్ హార్బర్ల పనులు వేగవంతం చేయాలి. నిర్ధేశించిన లక్ష్యం మేరకు పనులు పూర్తయ్యేలా చూడాలి. అప్పుడే మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయి. మత్స్యకారుల ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర జీడీపీ పెరుగుతుంది. ప్రతి ఫిషింగ్ హార్బర్ నుంచి ఏటా కనీసం రూ.వెయ్యి కోట్లకు పైగా ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతాయి. ఇది పరోక్షంగా ఆర్థికాభివృద్ధికి దోహద పడుతుంది. ఉపాధి కోసం మన మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఎంతమాత్రం ఉండదు. ► ఈ సమావేశంలో పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) వైస్ చైర్మన్ వడ్డి రఘురాం, పశు సంవర్థక, పాడి పరిశ్రామిభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.మధుసూదనరెడ్డి, పశు సంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్, మత్స్య శాఖ కమిషనర్ కే.కన్నబాబు, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీ అహ్మద్ బాబు తదితరులు పాల్గొన్నారు. రెండో ఫేజ్ హార్బర్లకు పర్యావరణ అనుమతులు ► రెండవ ఫేజ్‌లో నిర్మించనున్న వాడరేవు, బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి అటవీ, పర్యావరణ సహా అన్ని రకాల అనుమతులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని అధికారులు సీఎంకు వివరించారు. ► మొదటి ఫేజ్‌లో చేపట్టిన ఫిషింగ్ హార్బర్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు 92.5 శాతం పూర్తయ్యాయని, ఫిబ్రవరి 15 నాటికి మిగిలిన పనులు పూర్తవుతాయని చెప్పారు. నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో కూడా పనులు వేగం పుంజుకున్నాయని తెలిపారు. ప్రతి 3 నెలలకొకటి చొప్పున డిసెంబర్‌కల్లా మొదటి ఫేజ్ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. మొత్తం 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి రూ.3,520.57 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ► ఏపీలో పశువులకు వైద్య సేవలు అందిస్తున్న అంబులెన్స్ విధానంపై ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పంజాబ్, ఛత్తీస్‌గఢ్, కేరళకు చెందిన అధికారులు రాష్ట్రాన్ని సందర్శించి వెళ్లారని, ఆయా రాష్ట్రాల్లో ఏపీ మోడల్లోనే పశు అంబులెన్స్‌ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారని వివరించారు. ► ఆర్బీకే స్థాయిలో ఖాళీగా ఉన్న 4,765 పశు సంవర్థక సహాయకుల పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జగనన్న పాల వెల్లువ కింద 2.6 లక్షల మంది రైతులు సభ్యులుగా చేరారని, వారి నుంచి ఇప్పటి వరకు 6.06 కోట్ల లీటర్ల పాలను సేకరించామన్నారు. వచ్చే 2 నెలల్లో మరో 1,422 గ్రామాల్లోకి జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నామని తెలిపారు. -
మొబైల్ అంబులేటరీ క్లినిక్స్‌ను ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
రెండో దశ పశువుల అంబులెన్సులు ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య (మొబైల్ అంబులేటరీ క్లినిక్స్) సేవలను మరింత విస్తరించే దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. ఇప్పటికే నియోజకవర్గానికి ఒకటి చొప్పున రూ.129.07 కోట్లతో 175 వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వీటికి అదనంగా రూ.111.62 కోట్లతో రూపొందిన మరో 165 వాహనాలు నేటి నుంచి రోడ్డెక్కబోతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్ద జెండా ఊపి వీటిని ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌ల విషయంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు ఏపీని స్ఫూర్తిగా తీసుకొని అడుగులు వేస్తున్నాయి. 81 రకాల మందులు.. 54 రకాల పరికరాలు ఈ అంబులెన్స్‌ల కోసం జాతీయ స్థాయిలో 1962 కాల్ సెంటర్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమీకృత కాల్ సెంటర్ 155251ను అనుసంధానించారు. ఈ నంబర్ల ద్వారా అంబులెన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ అంబులెన్స్‌లో పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లొమా సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్లను అందుబాటులో ఉంచారు. ప్రతి అంబులెన్స్‌లో రూ.35 వేల విలువైన 81 రకాల మందులు అందుబాటులో ఉంచారు. 54 రకాల అత్యాధునిక పరికరాలతో పాటు వెయ్యి కిలోల బరువు ఎత్తగలిగే హైడ్రాలిక్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. నిర్వహణ బాధ్యతలను జీవీకే–ఈఎంఆర్‌ఐకు అప్పగించారు. కాల్ సెంటర్‌కు రోజుకు సగటున 1,500 చొప్పున 8 నెలల్లో 3.75 లక్షల ఫోన్‌కాల్స్ రాగా, ఒక్కో వాహనం రోజుకు సగటున 120 కిలోమీటర్లకు పైగా వెళ్లి వైద్య సేవలు అందిస్తోంది. 2,250 ఆర్బీకేల పరిధిలో 4 వేల గ్రామాల్లో 1.85 లక్షల జీవాలకు వైద్య సేవలందించాయి. 6,345 వేలకు పైగా మేజర్, 10,859 మైనర్ శస్త్ర చికిత్సలు చేశారు. అత్యవసర వైద్యసేవల ద్వారా లక్షకు పైగా మూగ, సన్న జీవాల ప్రాణాలను కాపాడగలిగారు. తద్వారా 1.75 లక్షల మంది లబ్ధి పొందారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పశుపోషకుల ఇంటి ముంగిటే వైద్య సేవ
సాక్షి, అమరావతి: 108 అంబులెన్స్ తరహాలోనే మూగజీవాల ఆరోగ్య పరిరక్షణ కోసం అత్యాధునిక సౌకర్యాలతో ప్రభుత్వం తీసుకొస్తున్న డాక్టర్ వైఎస్సార్ సంచార పశు వైద్యశాలలు (మొబైల్ వెటర్నరీ అంబులేటరీ క్లినిక్) మే 19 నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. ‘డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ’ పథకం ద్వారా దాదాపు రూ.278 కోట్లతో 340 వాహనాలు కొనుగోలుతో పాటు వాటి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున 175 వాహనాలను సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గురువారం సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.‘డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ’ పథకం ద్వారా ప్రస్తుతం మొదటి దశలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రూ.142.90 కోట్లతో 175 వాహనాలు, రెండో దశలో రూ.134.74 కోట్లతో మిగిలిన 165 వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలలో సైతం పాడి పశువులతో పాటు, పెంపుడు జంతువులకు అత్యవసరమైన, నాణ్యమైన పశువైద్యసేవలు అందించేందుకు వీలుగా ఈ వాహనాల నిర్వహణకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ.. ఒక్కొక్క వాహన నిర్వహణకు నెలకు రూ.1.90 లక్షల చొప్పున నిధులను కేటాయించింది. -
మత్స్యకారులు కోరిన చోట జెట్టీలు
సాక్షి, అమరావతి: మత్స్యకారులు కోరుకున్న ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జెట్టీల నిర్మాణాలకు ఏ ప్రాంతాలు అనువుగా ఉన్నాయో తొలుత పరిశీలన చేయాలని సూచించారు. మరపడవల లంగరు కోసం అనువైన జెట్టీలు లేకపోవడంతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో మత్స్యకారులు చెన్నై, గుజరాత్‌కు తరలి వెళ్లిపోతున్నారని, వారంతా సొంత ప్రాంతాలకు తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మత్స్య, పశు సంవర్ధక శాఖలపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, ప్రకాశం జిల్లా వాడరేవుల్లో రెండు పెద్ద జెట్టీల నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భీమిలి సమీపంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై అధికారులతో సీఎం సమీక్షించారు. శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లా మరపడవలు కూడా చేరుకోవడంతో విశాఖ హార్బర్‌పై భారం పెరుగుతోందని, దీన్ని నివారించేందుకు తీరంలో అనువైన జట్టీలను నిరి్మంచాలని సూచించారు. బందరు పోర్టును మేజర్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నారు. నిజాంపట్నం హార్బర్ రెండోదశ విస్తరణకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్.. చేపలు, రొయ్యలు అధికంగా సాగు చేసే ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. చేపలు, రొయ్య పిల్లలు, మేతను పరీక్షించడానికి అనువుగా ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. సీడ్, ఫీడ్ కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా ఏర్పాటయ్యే గ్రామ సచివాలయాల్లో మత్స్యశాఖ అసిస్టెంట్ల సహాయంతో రైతులు ప్రభుత్వ పథకాలను సది్వనియోగం చేసుకునేలా చూడాలని సూచించారు. తూర్పు గోదావరి జిల్లాలో హేచరీజోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో ఫార్మా కంపెనీలకు అనుమతి ఇవ్వడంతో కాలుష్యం అంతా సముద్రంలోకి చేరుతోందన్నారు. ఇదే ప్రాంతం నుంచి తాను పాదయాత్ర చేసినట్టు సీఎం గుర్తు చేశారు. ఒక ప్రాంతాన్ని నిర్దిష్ట జోన్‌గా ప్రకటించిన తర్వాత అక్కడ ఇతర పరిశ్రమలకు అనుమతి ఇవ్వడం, పర్యావరణాన్ని కలుíÙతం చేయడం సరికాదన్నారు. దీనిపై పూర్తిగా అధ్యయనం చేసి ఒక విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆక్వా పంట చేతికి వచ్చిన సమయంలో గిట్టుబాటు ధరలు పతనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీన్ని సవాల్‌గా తీసుకుని సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. అంతర్జాతీయ సంస్థల సహకారంతో వారి బ్రాండ్ వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రతిభావంతుల సహకారం తీసుకుంటే మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగై రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. ప్రతి గ్రామానికి పశు వైద్యశాల రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రెండేళ్లలో పశు వైద్యశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రెండు వేల పశువులున్న చోట చికిత్స, దాణా నిల్వకు అనువైన ప్రాంతాలను గుర్తించాలన్నారు. పశుపోషణ రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా ఉండేలా చూడాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో వెయ్యి పశువులున్న గ్రామాల్లో వైద్యశాల ఏర్పాటు చేయాలన్నారు. పశువులకు కూడా హెల్త్‌కార్డులను జారీ చేసి చెవులకు ట్యాగ్, క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర నిధులను ఇందుకు వినియోగించాలని సూచించారు. పశువుల ఔషధాల కొనుగోలులో ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటించాలన్నారు. పులివెందులలోని ‘ఏపీకార్ల్’కు నేరుగా నీటిని సరఫరా చేసేలా నీటిపారుదలశాఖతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల పరిశోధనలకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. అక్కడ ముర్రా గేదెలు, పుంగనూరు జాతి ఆవుల అభివృద్దికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరువు బాధిత ప్రాంతాల్లో పశువుల మేతకు కొరత లేకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు రూ.50 కోట్లు ఇవ్వాలని ఆదేశించారు. పశువుల వైద్యం కోసం వచ్చే ఏడాది నుంచి 102 వాహనాలను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. పశు సంవర్ధకశాఖలో ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలన్నారు. సీఎం సమీక్షలో మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, మత్స్యశాఖ కమిషనర్ రామ్‌శంకర్ నాయక్, పశు సంవర్థకశాఖ డైరెక్టర్ సోమశేఖరం తదితరులు పాల్గొన్నారు. ►రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రెండేళ్లలో పశు వైద్యశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. రెండు వేల పశువులున్న చోట చికిత్స, దాణా నిల్వకు అనువైన ప్రాంతాలను గుర్తించాలి. గిరిజన ప్రాంతాల్లో వెయ్యి పశువులున్న గ్రామాల్లో వైద్యశాల ఏర్పాటు చేయాలి. – అధికారులకు సీఎం ఆదేశం -
86 పశు వైద్యశాలలు మంజూరు
ఘట్కేసర్: జిల్లాకు 86 పశు వైద్యశాలలు మంజూరయ్యాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో గురువారం 3.5 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ప్రతాప్సింగారంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు సౌకర్యం లేని 1300 గ్రామాలకు రవాణా వసతి కల్పిస్తామని చెప్పారు. అన్ని గ్రామాలకూ రోడ్లు వేస్తామన్నారు. మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ.. అవసరమైన చోట ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు చేస్తామన్నారు. నీటి ఎద్దడి సమస్యకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్ నియోజకవర్గం శివారు ప్రాంతంలో ఉన్నందున 3 డిపోలను ఏర్పాటు చేయాలన్నారు. చెంగిచర్ల డిపో నుంచి రోడ్డు వేయాలని కోరారు. సమావేశంలో మండల పరిషత్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు మంద సంజీవరెడ్డి, శామీర్‌పేట్ ఎంపీపీ చంద్రశేఖర్, టీఆర్ఎస్ నాయకుడు నక్క ప్రభాకర్‌గౌడ్, సింగిల్ విండో చైర్మన్ గొంగళ్ల స్వామి, మండల ఉపాధ్యక్షుడు గ్యార లక్ష్మయ్య, ఎంపీటీసీ సభ్యులు మంకం రవి, కేశవనాథం, రమాదేవి, సర్పంచ్‌లు స్వర్ణలత, నక్క వరలక్ష్మి, మూసీ శంకరన్న, నాయకులు బైరు రాములు, లక్ష్మణ్, నరసింహ, కొంతం వెంకట్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, బొక్క ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ యాట కుమార్, ధరంకార్ సత్యరాం పాల్గొన్నారు. ఆహ్వానపత్రం అందలేదు.. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమకు ఆహ్వానం అందలేదంటూ ప్రతాప్‌సింగారం సర్పంచ్ బాషగల్ల ఆండాలు, ఎంపీటీసీ సభ్యులు సంజీవ్‌లు సమావేశం నుంచి బయటకు వెళ్లారు. గ్రామానికి ప్రథమ పౌరురాలైన సర్పంచ్‌కు తెలియకుండా అధికారులు ఇలా చేయడం భావ్యం కాదని ఎంపీటీసీ సభ్యుడు సంజీవ్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన రజక సంఘం ప్రారంభ కార్యక్రమాన్ని సైతం ఆహ్వానించలేదని ఆయన ఆరోపించారు.