
సాక్షి, అమరావతి: 108 అంబులెన్స్ తరహాలోనే మూగజీవాల ఆరోగ్య పరిరక్షణ కోసం అత్యాధునిక సౌకర్యాలతో ప్రభుత్వం తీసుకొస్తున్న డాక్టర్ వైఎస్సార్ సంచార పశు వైద్యశాలలు (మొబైల్ వెటర్నరీ అంబులేటరీ క్లినిక్) మే 19 నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. ‘డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ’ పథకం ద్వారా దాదాపు రూ.278 కోట్లతో 340 వాహనాలు కొనుగోలుతో పాటు వాటి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున 175 వాహనాలను సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గురువారం సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.‘డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ’ పథకం ద్వారా ప్రస్తుతం మొదటి దశలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రూ.142.90 కోట్లతో 175 వాహనాలు, రెండో దశలో రూ.134.74 కోట్లతో మిగిలిన 165 వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలలో సైతం పాడి పశువులతో పాటు, పెంపుడు జంతువులకు అత్యవసరమైన, నాణ్యమైన పశువైద్యసేవలు అందించేందుకు వీలుగా ఈ వాహనాల నిర్వహణకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ.. ఒక్కొక్క వాహన నిర్వహణకు నెలకు రూ.1.90 లక్షల చొప్పున నిధులను కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment