సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు పాడి రైతన్నలకు బాసటగా నిలుస్తూ పశువులకు పూర్తిస్థాయి ఆరోగ్య భద్రత కల్పిస్తున్నాయి. ఆర్బీకేల రాకతో తమ కష్టాలకు తెర పడిందని పాడి రైతులు చెబుతున్నారు. ప్రాథమిక వైద్యం కోసం మండల కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన అవస్థలు తొలగిపోయాయి. ఆర్బీకేలతో గ్రామ స్థాయిలో పశువైద్య సేవలందించడమే కాకుండా సర్టిఫై చేసిన నాణ్యమైన పశుగ్రాస విత్తనాలు, సంపూర్ణ మిశ్రమ దాణా, మినరల్ మిక్చర్, చాప్ కట్టర్స్.. ఏది కావాలన్నా గుమ్మం వద్దకే తెచ్చి ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
108 అంబులెన్స్‌ల తరహాలో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రూ.240.69 కోట్ల వ్యయంతో రెండు విడతల్లో 340 అంబులెన్స్‌లను సిద్ధం చేశారు.
వీటిని నియోజక వర్గానికి రెండు చొప్పన అందుబాటులోకి తీసుకొచ్చి ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రతి అంబులెన్స్ లో రూ.35 వేల విలువైన 81 రకాల మందులను అందుబాటులో ఉంచారు. 54 రకాల అత్యాధునిక పరికరాలతో పాటు వెయ్యి కిలోలు బరువున్న జీవాలను ఎత్తగలిగేలా హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యం కల్పించారు.
ఇప్పటివరకు కాల్ సెంటర్‌కు రైతుల నుంచి రోజుకు సగటున 1500 కాల్స్ చొప్పున 3.90 లక్షల కాల్స్ రాగా మారుమూల పల్లెల్లో 1.30 లక్షల ట్రిప్పులు తిరిగాయి. దాదాపు 2 లక్షలకుపైగా పశువులకు అత్యవసర వైద్య సేవలు అందించారు. ఇప్పటి వరకు 1.35 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. ఏపీ తరహాలో పంజాబ్, కేరళ, ఛత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాలు వెటర్నరీ అంబులెన్స్‌లను తీసుకొస్తున్నాయి. ఆర్బీకేల ద్వారా అందిస్తున్న పశు వైద్యసేవలపై ‘సాక్షి బృందం’ రాష్ట్రవ్యాప్తంగా క్షేత్ర స్థాయి పరిశీలన నిర్వహించింది.
మూగ జీవులపై మమకారం..
వైఎస్సార్ పశు సంరక్షణ పథకం కింద పశువులకు హెల్త్‌కార్డులు జారీ చేయడమే కాకుండా పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులతో ఆర్ధిక చేయూతనిస్తున్నారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు అందిస్తున్నారు. కృత్రిమ గర్భదారణ, పునరుత్పత్తి, దూడల సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రతినెలా 3వ శనివారం పాడి రైతులకు, 2, 4వ బుధవారాల్లో గొర్రెలు, మేకల పెంపకందారులకు వైఎస్సార్ పశువిజ్ఞానబడులు నిర్వహిస్తూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఆర్బీకేల్లో దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా పాడి, మూగజీవాల పెంపకంపై శిక్షణ ఇస్తున్నారు. పాడి రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా 155251, 1962 టోల్‌ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు.
రెండున్నరేళ్లలో సేవలిలా..
రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కాగా పాడి సంపద ఎక్కువగా ఉన్న 8,330 ఆర్బీకేల్లో ట్రైవిస్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి నెలా రూ.4 వేల విలువైన మందులను సరఫరా చేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా గత 32 నెలల్లో 4,468 టన్నుల గడ్డి విత్తనాలు, 62,435 టన్నుల సంపూర్ణ మిశ్రమం, 60 వేల కిలోల నూట్రిషనల్ సప్లిమెంట్స్, 350 టన్నుల పశువుల మేతతో పాటు 3,909 చాప్ కట్టర్స్ పంపిణీ చేశారు.
ఆర్బీకేల ద్వారా 2 కోట్ల పశువులకు టీకాలిచ్చారు. 33.08 లక్షల పశువులకు హెల్త్ కార్డులు జారీ చేశారు. 14.73 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ జరిగింది. 1.61 కోట్ల పశువులకు ప్రాథమిక వైద్యసేవలు అందించారు. పశువిజ్ఞాన బడుల్లో 13.99 లక్షల మంది రైతులకు శిక్షణ నిచ్చారు. ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు 42 వేల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులందించి రుణ పరపతి కల్పిస్తున్నారు.
75 శాతం రాయితీపై విత్తనాలు
గతంలో నాణ్యమైన పచ్చగడ్డి దొరక్క పశువులు సకాలంలో ఎదకు వచ్చేవి కావు. పాల దిగుబడి సరిగా ఉండేది కాదు. ఆర్బీకేల ద్వారా రాయితీపై నాణ్యమైన మొక్కజొన్న (ఆఫ్రికన్ టాల్ గడ్డి రకం) విత్తనాలను 75 శాతం రాయితీపై తీసుకొని సాగు చేశా. 60 రోజుల్లో 9 అడుగులు పెరిగి ఎకరానికి 5–6 టన్నుల దిగుబడి వచ్చింది. ఇప్పుడు మేత ఇష్టంగా తింటున్నాయి. సకాలంలో ఎదకు రావటమే కాకుండా పాల దిగుబడి రోజుకి 2–3 లీటర్లు పెరిగింది. సీఎం జగన్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– అంకంరెడ్డి రవికుమార్, ఓఈపేట, అనకాపల్లి జిల్లా
ఆరోగ్యంగా పశువులు.. అదనంగా లాభం
నాకు 8 పశువులున్నాయి. గడ్డి కత్తిరించే యంత్రాల ద్వారా మేత వృథా కాకుండా ఎలా నివారించవచ్చో పశువిజ్ఞాన బడి కార్యక్రమాల ద్వారా తెలుసుకున్నా. 40 శాతం రాయితీపై గడ్డి కత్తిరించే యంత్రాన్ని ఆర్బీకేలో తీసుకున్నా. మొక్కజొన్న గడ్డిని ముక్కలుగా చేసి అందిస్తున్నా. గేదెలు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాయి. గతంలో 62 లీటర్ల పాల దిగుబడి రాగా ప్రస్తుతం 70 లీటర్లు వస్తున్నాయి. అదనంగా రూ.320 లాభం వస్తోంది. ప్రభుత్వానికి నిజంగా రుణపడి ఉంటాం.
– చిలంకూరి తిరుపతయ్య, లింగారెడ్డిపల్లి, ప్రకాశం జిల్లా
మేతకు ఇబ్బంది లేదు..
గతంలో పశుగ్రాసం కోసం చాలా ఇబ్బందిపడే వాళ్లం. ఇటీవలే ఆర్బీకేలో సీఎస్‌హెచ్–24 గడ్డిజాతి విత్తనాలను రాయితీపై తీసుకున్నా. ఎకరం పొలంలో 15 కిలోలు చల్లా. 60 రోజుల్లో ఆరడుగులు పెరిగింది. కత్తిరించి పశువులకు మేతగా వేస్తున్నాం. సకాలంలో ఎదకు వస్తున్నాయి. పాల దిగుబడి కూడా పెరిగింది.
–శ్రీరాం లక్ష్మీనారాయణ, చిల్లకల్లు, ఎన్టీఆర్ జిల్లా
ఆర్బీకేల ద్వారా పశువైద్య సేవలు
ఆర్బీకేల ద్వారా పాడిరైతుల గడప వద్దకే పశు వైద్య సేవలందిస్తున్నాం. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. పాడిరైతుకు ఏది కావాలన్నా ఆర్బీకేల ద్వారా అందిస్తున్నాం. రూ.4 వేల విలువైన మందులతో పాటు నాణ్యమైన పశుగ్రాస విత్తనాలు, సంపూర్ణ మిశ్రమ దాణా, గడ్డికోసే యంత్రాలను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతున్నాం.
–డాక్టర్ అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ
వెన్న శాతం, దిగుబడి పెరిగింది
వైఎస్సార్ జిల్లా వెలమవారిపల్లెకు చెందిన జే.గుర్రప్ప జీవనాధారం పాడిపోషణే. తనకున్న 15 పశువులకు మేతగా ఎండుగడ్డి, శనగ కట్టెతో పాటు ఆరు బయట లభ్యమయ్యే పచ్చగడ్డి అందించినప్పుడు ఆశించిన పాల దిగుబడి వచ్చేది కాదు. పశువులు తరచూ అనారోగ్యాల బారిన పడేవి. ఆర్నెళ్ల క్రితం ఆర్బీకే ద్వారా 50 కిలోల గడ్డి విత్తనాలు తీసుకొని సాగు చేశాడు.
గడ్డిలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పశువులు ఇష్టంగా మేత మేశాయి. పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. రోజుకు 4–4.5 లీటర్ల పాలు ఇచ్చే ఈ పశువులు ప్రస్తుతం 5–6.5 లీటర్లు ఇస్తున్నాయి. పాలల్లో వెన్న శాతం 5–6 నుంచి 7–8 శాతానికి పెరిగింది. లీటర్‌పై రూ.10 అదనంగా పొందగలుగుతున్నట్లు గుర్రప్ప ఆనందంగా చెబుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment