మత్స్యకారులు కోరిన చోట జెట్టీలు | AP Govt Constructing 12 Fishing Jetties Across State | Sakshi
Sakshi News home page

మత్స్యకారులు కోరిన చోట జెట్టీలు

Published Sat, Sep 21 2019 4:00 AM | Last Updated on Sat, Sep 21 2019 10:07 AM

AP Govt Constructing 12 Fishing Jetties Across State  - Sakshi

సాక్షి, అమరావతి: మత్స్యకారులు కోరుకున్న ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జెట్టీల నిర్మాణాలకు ఏ ప్రాంతాలు అనువుగా ఉన్నాయో తొలుత పరిశీలన చేయాలని సూచించారు. మరపడవల లంగరు కోసం అనువైన జెట్టీలు లేకపోవడంతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో మత్స్యకారులు చెన్నై, గుజరాత్‌కు తరలి వెళ్లిపోతున్నారని, వారంతా సొంత ప్రాంతాలకు తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మత్స్య, పశు సంవర్ధక శాఖలపై ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం సమీక్షించారు.

ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, ప్రకాశం జిల్లా వాడరేవుల్లో రెండు పెద్ద జెట్టీల నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భీమిలి సమీపంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణంపై అధికారులతో సీఎం సమీక్షించారు. శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లా మరపడవలు కూడా చేరుకోవడంతో విశాఖ హార్బర్‌పై భారం పెరుగుతోందని, దీన్ని నివారించేందుకు తీరంలో అనువైన జట్టీలను నిరి్మంచాలని సూచించారు. బందరు పోర్టును మేజర్‌ ప్రాజెక్టుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నారు. నిజాంపట్నం హార్బర్‌ రెండోదశ విస్తరణకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.  
 
ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్స్‌..  
చేపలు, రొయ్యలు అధికంగా సాగు చేసే ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్స్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. చేపలు, రొయ్య పిల్లలు, మేతను పరీక్షించడానికి అనువుగా ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. సీడ్, ఫీడ్‌ కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా ఏర్పాటయ్యే గ్రామ సచివాలయాల్లో మత్స్యశాఖ అసిస్టెంట్ల సహాయంతో రైతులు ప్రభుత్వ పథకాలను సది్వనియోగం చేసుకునేలా చూడాలని సూచించారు. తూర్పు గోదావరి జిల్లాలో హేచరీజోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో ఫార్మా కంపెనీలకు అనుమతి ఇవ్వడంతో కాలుష్యం అంతా సముద్రంలోకి చేరుతోందన్నారు. ఇదే ప్రాంతం నుంచి తాను పాదయాత్ర చేసినట్టు సీఎం గుర్తు చేశారు.

ఒక ప్రాంతాన్ని నిర్దిష్ట జోన్‌గా ప్రకటించిన తర్వాత అక్కడ ఇతర పరిశ్రమలకు అనుమతి ఇవ్వడం, పర్యావరణాన్ని కలుíÙతం చేయడం సరికాదన్నారు. దీనిపై పూర్తిగా అధ్యయనం చేసి ఒక విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆక్వా పంట చేతికి వచ్చిన సమయంలో గిట్టుబాటు ధరలు పతనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీన్ని సవాల్‌గా తీసుకుని సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. అంతర్జాతీయ సంస్థల సహకారంతో వారి బ్రాండ్‌ వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రతిభావంతుల సహకారం తీసుకుంటే మార్కెటింగ్‌ సౌకర్యాలు మెరుగై రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు.  
 
ప్రతి గ్రామానికి పశు వైద్యశాల
రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రెండేళ్లలో పశు వైద్యశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. రెండు వేల పశువులున్న చోట చికిత్స, దాణా నిల్వకు అనువైన ప్రాంతాలను గుర్తించాలన్నారు. పశుపోషణ రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా ఉండేలా చూడాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో వెయ్యి పశువులున్న గ్రామాల్లో వైద్యశాల ఏర్పాటు చేయాలన్నారు. పశువులకు కూడా హెల్త్‌కార్డులను జారీ చేసి చెవులకు ట్యాగ్, క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర నిధులను ఇందుకు  వినియోగించాలని సూచించారు. పశువుల ఔషధాల కొనుగోలులో ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటించాలన్నారు. పులివెందులలోని ‘ఏపీకార్ల్‌’కు నేరుగా నీటిని సరఫరా చేసేలా నీటిపారుదలశాఖతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు.

దీనివల్ల పరిశోధనలకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. అక్కడ ముర్రా గేదెలు, పుంగనూరు జాతి ఆవుల అభివృద్దికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరువు బాధిత ప్రాంతాల్లో పశువుల మేతకు కొరత లేకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు రూ.50 కోట్లు ఇవ్వాలని ఆదేశించారు. పశువుల వైద్యం కోసం వచ్చే ఏడాది నుంచి 102 వాహనాలను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. పశు సంవర్ధకశాఖలో ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలన్నారు. సీఎం సమీక్షలో మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, మత్స్యశాఖ కమిషనర్‌ రామ్‌శంకర్‌ నాయక్, పశు సంవర్థకశాఖ డైరెక్టర్‌ సోమశేఖరం తదితరులు పాల్గొన్నారు.  
 
►రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రెండేళ్లలో పశు వైద్యశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. రెండు వేల పశువులున్న చోట చికిత్స, దాణా నిల్వకు అనువైన ప్రాంతాలను గుర్తించాలి. గిరిజన ప్రాంతాల్లో వెయ్యి పశువులున్న గ్రామాల్లో వైద్యశాల ఏర్పాటు చేయాలి.
– అధికారులకు సీఎం ఆదేశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement