Dairy development
-
పశుసంవర్థక అభివృద్ధికి మరింత కృషి
సాక్షి, హైదరాబాద్: పశుసంవర్థక రంగం మరింత అభివృద్ధి సాధించేలా కృషి చేస్తామని కేంద్ర మత్స్య, పశు సంవర్థక, పాడి పరిశ్రమల శాఖల మంత్రి పురుషోత్తం రూపాలా అన్నారు. రైతులు, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించే ఈ రంగాన్ని లాభదాయకంగా మార్చడానికి కేంద్రం అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, స్టార్టప్ ఇండియా, సీఐఐ సహకారంతో కేంద్ర పశుసంవర్థ, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ స్టార్టప్ సదస్సులో మంత్రి మాట్లాడారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడిపరిశ్రమ అభివృద్ధితో రైతులు తమ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవడానికి వీలవుతుందన్నారు. పశుసంవర్ధక రంగంలో పెట్టుబడులు మరింత పెరగాలని అభిప్రాయపడ్డారు. కేంద్రమంత్రులు బాల్యన్, మురుగన్ మాట్లాడుతూ శాస్త్రీయ చర్యలతో పశుసంవర్ధక రంగంలో మార్పులు తీసురావడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రపంచ మాంసం ఎగుమతుల రంగంలో భారతదేశం 8వ స్థానం, గుడ్ల ఎగుమతుల రంగంలో 3వ స్థానంలో ఉందని వివరించారు. గణనీయంగా పెరిగిన గొర్రెల సంపద రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో పాడి రంగానికి అనేక విధాలుగా చేయూతనిస్తున్నామని అన్నారు. గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్ల పంపిణీ చేయడంతో రాష్ట్రంలో గొర్రెల సంపద గణనీయంగా పెరిగిందని తెలిపారు. గ్రామాల్లో అత్యధికులు పాడి పరిశ్రమ, జీవాల పెంపకంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, వారికి మరింత చేయూతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ చైర్మన్ సోమా భరత్ కుమార్, షీప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, ఇతర ఉన్నతాధికారులు వర్ష జోషి, రాజేష్ కుమార్ సింగ్, లచ్చిరాం భూక్యా, పెద్ద ఎత్తున పాడి రైతులు పాల్గొన్నారు. -
పాడి సంపద అభివృద్ధికి...పెద్దపీట
రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పాడి రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా పాడి సంపద అభివృద్ధికి చర్యలు చేపట్టింది. మూగజీవాల ఆరోగ్య పరిరక్షణతో పాటు మేలు జాతి పునరుత్పత్తి పథకం ప్రారంభించింది. నెల్లిమర్ల: పాడి సంపద అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. పశువులు, జీవాల ఆరోగ్య సంరక్షణకు ఇప్పటికే 1962 సంచార పశు వైద్యశాలలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మూగజీవాలకు సరైన రోగ నిర్దారణ చేసి, మరణాలను అరికట్టేందుకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. ఆవులు, గేదెలు మేలు రకం ఆడ దూడలకు జన్మనివ్వడానికి, పాల ఉత్పత్తని పెంచడానికి రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా మేలు జాతి పునరుత్పత్తి పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా పాడి రైతులకు సబ్సిడీపై లింగ నిర్ధారిత వీర్యం ఇంజక్షన్లను అందజేస్తారు. తద్వారా పాల ఉత్పత్తిని, మేలు రకం ఆడ దూడల పునరుత్పత్తిని పెంచుతారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పథకాన్ని ప్రస్తుతం చురుగ్గా అమలు చేస్తున్నారు. మొత్తం 8వేల పశువులకు ఇంజక్షన్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పథకం ఉద్దేశం ఇదే... విజయనగరం జిల్లాలోని 27 మండలాల్లో పాడి సంపదను పెంచడం పథకం ఉద్దేశం. ఆవులు, గేదెలకు మేలు జాతి లింగ నిర్దారిత వీర్యం ఉపయోగించి, ఆడ(పెయ్య) దూడలను ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కచ్చితంగా 90 శాతం ఆడ దూడలనే పుట్టించడం, సదరు సాంకేతికతను రైతుల చెంతకు తీసుకెళ్లడం ఉద్దేశం. తద్వారా భవిష్యత్తులో అధిక శాతం మేలు జాతి పశువుల సంఖ్యను పెంచాలని సంబంధిత అధికారులు యోచిస్తున్నారు. అంతేగాకుండా ఈ పథకం ద్వారా పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు, పాడి రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మేలు జాతి ఆడ దూడలను ఉత్పత్తి చేసే వీర్య కణాలను పశువులకు అందిస్తున్నారు. ఈ ఏడాది 8 వేల పశువులకు సదరు ఇంజక్షన్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లింగ నిర్దారిత వీర్య కణాల రకాలివే రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం ద్వారా పశువులకు అందించడానికి ప్రభుత్వం కొన్ని రకాల మేలు జాతి వీర్య కణాలను ఎంపిక చేసింది. విదేశీ గోజాతులైన జెర్సీ, హెచ్ఎఫ్, వాటి క్రాస్ బ్రీడ్, స్వదేశీ జాతులైన గిర్, సాహివాల్ తదితర రకాలు అందుబాటులో ఉన్నాయి. గేదెల్లో ముర్రా జాతికి చెందిన వీర్య నాళికలు అందుబాటులో ఉన్నాయి. లింగ నిర్దారిత వీర్యంపై ఆసక్తి కలిగిన ఔత్సాహిక రైతులందరికీ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఇటీవల కాలంలోనే ఈనిన పశువులు, 1 నుంచి 3 ఈతల మధ్య క్రమం తప్పకుండా ఎదకు వచ్చే పశువులు, ఎటువంటి గర్భకోశ వ్యాధులు లేనటువంటి పశువులను పథకానికి ఎంపిక చేస్తున్నారు. గ్రామాల ఎంపిక పథకం అమలుకు జిల్లా వ్యాప్తంగా మేలైన పశు సంపద, ఔత్సాహిక పశు పోషకులున్న గ్రామాలను పశు సంవర్ధకశాఖ అధికారులు ఎంపిక చేశారు. మొదటి దశలో జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో రెండేసి చొప్పున గ్రామాల్లో పథకం అమలు చేస్తునారు. ఎంపిక చేసిన గ్రామాల్లో కనీసం 35 నుంచి 40 పశువులను గుర్తించి, రైతులతో ఒప్పందం చేసుకున్నారు. ఆసక్తి కలిగిన రైతులకు అవగాహన కల్పించి, పథకాన్ని విస్తరింపజేస్తున్నారు. తద్వారా జిల్లాలోని అన్ని గ్రామాల్లో పాడి సంపదను అభివృద్ధి చేస్తారు. పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఆడ దూడల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యం రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం ద్వారా ఆడ దూడల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీని ద్వారా లింగ నిర్దారిత మేలు జాతి వీర్య కణాలను సబ్సిడీపై రైతులకు అందిస్తున్నాం. గ్రామాల్లోని పాడి రైతులకు సబ్సిడీపై వీర్య కణాల ఇంజక్షన్లు అందజేస్తున్నాం. రూ.1350 విలువ చేసే రెండు వీర్య కణాలను రూ.500కే అందిస్తున్నాం. మొదటి దశ పథకం అమలుకు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా గ్రామాలను గుర్తించాం. ఆయా గ్రామాల్లో ఈ ఏడాది మొత్తం 8 వేల ఇంజక్షన్లను పశువులకు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆసక్తి కలిగిన రైతులు సంబంధిత పశుసంవర్ధక శాఖాధికారులను సంప్రదించాలి. – డాక్టర్ వైవి.రమణ, జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి సబ్సిడీపై రెండు వీర్య నాళికలు ఈ పథకం ద్వారా ప్రభుత్వం పశువుల కృత్రిమ గర్భధారణకు అవసరమైన వీర్య నాళికలను సబ్సిడీపై పాడి రైతులకు అందజేస్తుంది. రెండు వీర్య నాళికల ధర రూ.1350 కాగా రైతు కేవలం రూ 500 చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన రూ.850 ప్రభుత్వమే సబ్సిడీగా అందజేస్తుంది. ఒకవేళ రెండు పర్యాయాలు కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్ చేసిన తర్వాత కూడా పశువు గర్భం దాల్చకపోతే రైతు చెల్లించిన మొత్తం రూ.500 ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. మొదటిసారి గర్భం దాల్చిన పశువుకు మగ దూడ పుట్టినట్లయితే ఎటువంటి మొత్తం తిరిగి చెల్లించరు. రెండోసారి గనుక మగ దూడ పుట్టినట్లయితే రూ.250 తిరిగి రైతుకు చెల్లిస్తారు. -
పాడిపరిశ్రమ అభివృద్ధికి రాష్ట్రీయ గోకుల్ మిషన్
దేశీయ పశుజాతుల వృద్ధికి సర్కార్ సమాయాత్తమైంది. ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆడ దూడల సృష్టి ద్వారా పాడి పరిశ్రమాభివృద్ధితో పాటు రైతులకు ఆర్థికంగా చేయూతనివ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఒంగోలు, గిర్ వంటి ఉన్నత దేశీయ జాతులకు పూర్వవైభవాన్ని తీసుకురావడం ద్వారా పాల ఉత్పత్తి పెంచేందుకు జిల్లా పశుసంరక్షణశాఖ దృష్టి సారించింది. ఈ నెల 1వ తేదీ నుంచి రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకాన్ని జిల్లాలో అమల్లోకి తెచ్చింది. చీమకుర్తి(ప్రకాశం జిల్లా): పశువుల్లో సహజ, కృత్రిమ గర్భధారణతో 50 శాతం మగ, 50 శాతం ఆడ దూడలు పుడుతుంటాయని పశువైద్యుల నిపుణుల అంచనా. ఆడదూడల పెంపకం ద్వారా పాడి రైతులకు లాభాలు వస్తాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. దీంతో ఆడదూడల పుట్టుకను నిర్ధారించే వీర్యకణాలను ఎంపిక చేసి రెండు స్ట్రాలలో నింపుతారు. ఒక్కో ఆవు లేక ఒక్కో గేదెను పెంచుకునే రైతులకు వీటిని అందజేస్తారు. ఎదకు వచ్చిన గేదె లేక ఆవుకు తొలి విడతగా ఒక స్ట్రాతో ఇంజెక్షన్ చేస్తారు. ఒక స్ట్రాతో సూడి నిలిచినట్లయితే పర్వాలేదు. ఒక వేళ సూడి నిలవకపోతే తిరిగి 21 రోజుల తర్వాత రెండోసారి ఎదకు వస్తుంది. అప్పుడు రైతుల లెక్కలో ముందుగానే ఉంచిన రెండో స్ట్రాతో రెండోసారి ఇంజెక్షన్ చేస్తారు. ఇలా సార్టెడ్ సెమన్‌తో ఆవులు లేక గేదెలలో సూడి నిలిచి 9 నెలల తర్వాత పుట్టే దూడలు దాదాపు 99 శాతం ఆడదూడలే పుడతాయని అధికారులు చెబుతున్నారు. ఇందు కోసం కేంద్రం రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. పాడి పశువులతో గ్రామాలు కళకళలాడేందుకు ఈ నెల 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని జిల్లాలో ప్రారంభించామని పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ కే.బేబీరాణి తెలిపారు. తొలి విడతలో చేపట్టే మండలాలు.. ఆడదూడల ఉత్పత్తికి సంబంధించి తొలుత జిల్లాలో ఎక్కువగా పాడిపశువులను పెంచే గ్రామాలపై అధికారులు దృష్టి సారించారు. చీమకుర్తి, సంతనూతలపాడు, ఒంగోలు, నాగులుప్పలపాడు, దర్శి, తాళ్ళూరు, ముండ్లమూరు, కొత్తపట్నం, టంగుటూరు, కొండపి, శింగరాయకొండ, జరుగుమల్లి, పొన్నలూరు మండలాల్లో రాష్ట్రీయ గోకుల్ మిషన్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. 2500 పశువులకు 5 వేల వీర్యకణాల స్ట్రాల పంపిణీ: రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకంలో భాగంగా జిల్లా పశుగణాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికే 2500 పశువులను ఎంపిక చేశారు. వాటికి 5 వేల సార్టెడ్ సెమన్ స్ట్రాలను పంపిణీ చేశారు. ఒక్కో పశువుకు అందించే రెండు స్ట్రాలను ప్రభుత్వం రూ.1350కు అందిస్తుంది. దానిలో రూ.850 సబ్సిడీ ఇస్తోంది. ఇక రైతు కేవలం రూ.500 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఒక వేళ రైతులకు అందించిన రెండు స్ట్రాలతో పశువులు సూడికి రాకపోతే రైతులు చెల్లించిన రూ.500ను తిరిగి చెల్లిస్తారు. ఒక వేళ సూడికి వచ్చి ఆడదూడలు పుట్టకుండా మగదూడ పుడితే రైతులకు రూ.250 తిరిగి చెల్లిస్తారు. ఏటా 1.50 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ: ప్రభుత్వ పశువుల ఆస్పత్రుల ద్వారా ఏటా జిల్లాలో సరాసరిన 1.50 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ చేస్తారు. దానికి గాను 3.5 లక్షల సాధారణ సెమన్లతో కూడిన స్ట్రాలను వినియోగిస్తారు. దాని వలన ఆడ, లేక మగ దూడలు ఏవైనా రావచ్చు. అయితే రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా కేవలం ఆడదూడల ఉత్పత్తి లక్ష్యంగా చేసుకొని ప్రయోగాత్మకంగా ఈ ఏడాది 2500 పశువులలో అమలు చేస్తున్నారు. దానికి గాను 5 వేల సార్టెడ్ సెమన్స్ట్రాలను అందించేందుకు రంగం సిద్ధం చేశారు. వచ్చే ఏడాది 5 వేల పశువులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇలా ప్రతి ఏడాది పశువుల సంఖ్యను డబుల్ చేసుకుంటూ ఆడదూడల ఉత్పత్తికి పశుగణాభివృద్ధి శాఖ కంకణం కట్టుకుంది. రానున్న ఐదేళ్లలో ప్రతి గ్రామంలో కనీసం 300 నుంచి 500 లీటర్ల పాలు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఆడదూడల ఉత్పత్తి పెంచేలా.. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా ఆవులు, గేదెలలో 99 శాతం ఆడదూడలను ఉత్పత్తి చేసేందుకు లక్ష్యంగా సెక్స్ సార్టెడ్ సెమన్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు ఈ కార్యక్రమాన్ని ఈనెల 1వ తేదీ నుంచి తొలుత 2500 పశువులలో అమలు చేయనున్నాం. ఇప్పటికే 5 వేల సార్టెడ్ సెమన్ ఇంజక్షన్లను సరఫరా చేశాం. – డాక్టర్ కే.బేబీరాణి, జాయింట్ డైరెక్టర్, జిల్లా పశుసంవర్థక శాఖ, ఒంగోలు కొండ ప్రాంతాల వారికి కోడెదూడలు ఉచితం కొండ ప్రాంతాల్లో ఆవులను పెంచే పశుపోషకులకు ప్రభుత్వం కోడెదూడలను ఉచితంగా అందిస్తుంది. 10 నుంచి 20 ఆవులు కలిగిన యజమానికి 6 నెలల వయస్సు కలిగిన కోడెదూడను అందిస్తారు. చదలవాడ పశువుల క్షేత్రం వద్ద పెరుగుతున్న కోడెదూడలను ఇందుకు వినియోగిస్తారు. కోడెదూడ పెరిగి పెద్దయ్యే వరకు దానికి దాణ, ఇతర ఖర్చులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. అనంతరం కోడెదూడకు క్రాసింగ్ చేసే వయస్సు రాగానే ఆవులలో సార్టెడ్ సెమన్ స్ట్రాలతో పనిలేకుండా వాటిని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో అధికారులు పశుపోషకులకు కోడెదూడలను ఉచితంగా అందిస్తారు. యర్రగొండపాలెం, గిద్దలూరు, పీసీపల్లి, పుల్లలచెరువు వంటి కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లోని ఆవులు కలిగిన రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. -
వైఎస్సార్ చేయూతతో పల్లెల్లో ‘క్షీర విప్లవం’
విజయనగరం ఫోర్ట్: పాడి పశువులు పెంచే వారి ఇల్లు పది కాలాల పాటు పచ్చగా ఉంటుందన్నది పెద్దల నానుడి. గ్రామీణ ప్రజలు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఆదుకునేది పశుసంపదే అని గట్టిగా నమ్ముతారు. దీనిని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్సార్ చేయూత కింద మహిళలకు పాడి, జీవాల యూనిట్లను మంజూరు చేస్తోంది. మహిళల ఆర్థిక ప్రగతికి ఊతమిస్తోంది. రైతుల ఇళ్లు పాడి పశువులు, జీవాలతో కళకళలాడేలా యూనిట్లు మంజూరు చేస్తోంది. ప్రభుత్వం అందించిన ‘చేయూత’ ఇలా... వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.75 వేల విలువ చేసే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు యూనిట్లను ప్రభుత్వం అందిస్తోంది. ఆవు లేదా గేదె అయితే ఒకటి, 8 ఆడగొర్రెలు, ఒక గొర్రెపోతు, 8 మేకలు, ఒక మేకపోతును యూనిట్‌గా సమకూర్చుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2,245 ఆవులు, గేదెలు యూనిట్లు అందజేసింది. దీనికోసం ప్రభుత్వం రూ.16.83 కోట్లు ఖర్చుచేసింది. రూ.7.53 కోట్ల విలువైన 1004 గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేసింది. పెరగనున్న పాల ఉత్పత్తి... ప్రస్తుతం జిల్లాలో పాలిచ్చే ఆవులు 2,28,773, గేదెలు 73,554 ఉన్నాయి. సగటున రోజుకి జిల్లాలో 3.40 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. వైఎస్సార్ చేయూత పథకం కింద ప్రభుత్వం అందజేసిన 2,245 ఆవులు, గేదెల యూనిట్ల నుంచి రోజుకు 18 వేల లీటర్ల వరకు పాలు ఉత్పత్తి అవుతున్నాయి. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా.. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం ‘చేయూత’ను అందిస్తోంది. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల యూనిట్లు మంజూరు చేస్తోంది. పాడి పశువులు పెరగడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఆవులు, గేదెలు, గొర్రెలు తీసుకున్న మహిళలు వాటిని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. ఆర్థికంగా ఎదగాలి. - వై.వి.రమణ, డిప్యూటీ డైరెక్టర్, పశు సంవర్ధకశాఖ జగన్‌బాబు మేలు మరచిపోలేం జగన్‌బాబు మాలాంటి పేదోళ్ల మనుగడకు ఎన్నో పథకాలు అమలుచేస్తున్నారు. ఆర్థికంగా ఆదుకుంటున్నారు. వైఎస్సార్ చేయూత కింద ఇచ్చిన ఆవును బాగా పోషిస్తున్నాను. పాలు విక్రయించగా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నా. - రెడ్డి కొండమ్మ, వసాది గ్రామం, గంట్యాడ మండలం ప్రస్తుతం జిల్లాలో ఉన్న పశువుల వివరాలు జిల్లాలో 6,26,847 పశువులు ఉన్నాయి. ఇందులో 4,90,998 ఆవులు, 1,35,858 గేదెలు, 5,40,336 గొర్రెలు, 2,71,205 మేకలు, 54,92,310 కోళ్లు ఉన్నాయి. -
Sangam Dairy: ప్రభుత్వ పరిధిలోకి సంగం డెయిరీ
సాక్షి అమరావతి/సాక్షి, గుంటూరు/చేబ్రోలు (పొన్నూరు): టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిన గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీ ఆస్తుల యాజమాన్య హక్కులను ప్రభుత్వం ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాల ఉత్పత్తిదారులు, డెయిరీ ఉద్యోగులు, వినియోగదారుల విస్తృత ప్రయోజనాలు, డెయిరీ ఆస్తుల పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు గతంలో డెయిరీ ఆస్తులను గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘానికి లీజుకు ఇస్తూ జారీ చేసిన జీవో నంబర్ 515ను సర్కార్ ఉపసంహరించింది. పాడి రైతుల నుంచి పాల సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ తదితర డెయిరీ కార్యకలాపాలను ప్రస్తుతం ఉన్న అధికారులు, ఉద్యోగులతో నిర్వహించేందుకు పర్యవేక్షణ బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్‌కు అప్పగించింది. డెయిరీ రోజువారీ కార్యకలాపాలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారాన్ని ఆయనకు కల్పించింది. ఐదో రోజూ ఏసీబీ సోదాలు సంగం డెయిరీలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్, జిల్లా కో–ఆపరేటివ్ మాజీ ఉద్యోగి ఎం.గురునాథంలను గత శుక్రవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసు విచారణలో భాగంగా డెయిరీలో ఏసీబీ సోదాలు కొనసాగిస్తోంది. వరుసగా ఐదో రోజు మంగళవారం కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి పలు రికార్డులను, కీలకమైన డాక్యుమెంట్లను పరిశీలించారు. ప్రభుత్వానికి ఏసీబీ నివేదన ప్రభుత్వం గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి ఇచ్చిన భూముల నుంచి 10 ఎకరాల భూమిని తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరిట ఉన్న ట్రస్టుకు అక్రమంగా ధూళిపాళ్ల నరేంద్ర బదలాయించినట్టు ఏసీబీ ప్రభుత్వానికి నివేదించింది. పైగా నిబంధనలకు విరుద్ధంగా శాశ్వత ట్రస్టీ కమ్ ఎండీగా ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తనకు తానుగా ప్రకటించుకున్నారని పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ.. ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం పేరున ఉన్న ఆస్తులను తనఖా పెట్టి నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) నుంచి రూ.115 కోట్లను నరేంద్ర రుణాలుగా పొందినట్టు తెలిపింది. పశు ప్రదర్శనలు, విద్య, శిక్షణ కార్యక్రమాల కోసం బదలాయించిన భూమిలో నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రి నిర్మాణం చేపట్టినట్టు పేర్కొంది. లీజు హక్కులను ఉపసంహరించిన ప్రభుత్వం ప్రస్తుతం డెయిరీ ఆస్తుల యాజమాన్య హక్కులు గుంటూరు జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ఆధీనంలో ఉన్నాయి. దీంతో ఆ సంస్థకు ఇచ్చిన లీజు హక్కులను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థ ఆస్తులపై ఇక నుంచి పాలకవర్గానికి ఎలాంటి హక్కులు లేకుండా చేసింది. డెయిరీకి ఉన్న రూ.కోట్ల విలువైన ఇతర ఆస్తులు పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టింది. ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్‌కు అప్పగించింది. ప్రొక్యూర్మెంట్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఇతర కార్యకలాపాలన్నీ ఇప్పుడున్న అధికారులు, ఉద్యోగుల ద్వారా యధావిధిగా జరిగేలా ఆయన పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు మయూర్ అశోక్ బాధ్యతలు స్వీకరించి రికార్డులను పరిశీలించారు. -
పశు సంవర్ధకానికి రూ.12,606 కోట్ల రుణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా సహకార డెయిరీలను ప్రోత్సహించేందుకు వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తగిన తోడ్పాటునందిస్తామని నాబార్డు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పాడి అభివృద్ధికి రూ.8,232.33 కోట్ల మేర రుణ ఆవశ్యకత ఉన్నట్లు నాబార్డు అంచనా వేసింది. 2021–22లో మొత్తంగా పశు సంవర్ధక రంగానికి రూ.12,606 కోట్ల మేర రుణ ఆవశ్యతక ఉంటుందని రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 15.87 శాతం ఎక్కువని తెలిపింది. పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్.. మొత్తం దేశంలోనే 4వ స్థానంలో ఉందని వెల్లడించింది. 2019–20లో 152.63 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి జరిగినట్లు తెలిపింది. దీని విలువ రూ.57,433 కోట్లుగా పేర్కొంది. ఏపీలో రోజూ 380 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోందని వివరించింది. ఇందులో 46 శాతం రాష్ట్ర సొంత అవసరాల కోసం.. మరో 34 శాతం అసంఘటిత రంగాలు వినియోగిస్తుండగా, 18 నుంచి 20 శాతం సహకార, ప్రైవేట్ పాల ఉత్పత్తుల రంగాలకు వెళ్తున్నాయని నాబార్డు పేర్కొంది. డెయిరీ అభివృద్ధిపై దృష్టి.. పాడి అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని.. ఈ నేపథ్యంలో తాము కూడా డెయిరీ అభివృద్ధిపై దృష్టి సారించినట్లు నాబార్డు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా మహిళలకు అందించిన ఆర్థిక సాయానికి తోడుగా బ్యాంకుల నుంచి కూడా రుణాలు మంజూరు చేయించి పశు సంపదను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటోంది. అలాగే మహిళా పాడి రైతులకు మరింత ఆర్థిక ప్రయోజనం చేకూర్చేందుకు వారి నుంచి ఎక్కువ ధరకు పాలు కొనుగోలు చేసేలా.. అమూల్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో అమూల్ సంస్థ ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో పాల సేకరణ చేస్తోంది. అలాగే మహిళా డెయిరీ సహకార సంఘాలకు పూర్తి ప్రోత్సాహం అందించే విధంగా 9,899 గ్రామాల్లో ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల నిర్మాణాలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నాబార్డు కూడా ఈ ఆర్థిక సంవత్సరం పాడి అభివృద్ధికి రూ.8,232.33 కోట్ల మేర రుణాల ఆవశ్యకత ఉన్నట్లు అంచనా వేసింది. -
25 నుంచి అమూల్ పాలసేకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలివిడత మూడు జిల్లాల్లో అమూల్ (ఆనంద్ డెయిరీ) పాలసేకరణ ప్రారంభం కానుంది. చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో ఈ నెల 25 నుంచి ప్రారంభించడానికి ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తోంది. పాలసేకరణ, పాల ఉత్పత్తుల అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్న అమూల్ తన ప్రతినిధులతో వివిధ జిల్లాల్లో సర్వే చేపట్టింది. పాల దిగుబడి అధికంగా ఉన్న జిల్లాలతోపాటు ఏపీ డెయిరీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు కొనసాగుతున్న ప్లాంట్లలోని యాంత్రిక పరికరాల సామర్థ్యాన్ని పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా పాలను సేకరించనుంది. లోటుపాట్లను సరిచేసుకుని 25 నుంచి అధికారికంగా 300 పాలసేకరణ కేంద్రాలను ప్రారంభించనుంది. ప్రైవేట్ డెయిరీల నుంచి ఎదురయ్యే పోటీని అధిగమించడానికి, పాల ఉత్పత్తిదారుల మహిళా సంఘాల ఏర్పాటుకు ఏపీ డెయిరీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మొత్తం 9,899 పాలసేకరణ కేంద్రాలను దశల వారీగా ఏర్పాటు చేయనుంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కోర్ కమిటీలు.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమూల్ కార్యక్రమాలు వేగంగా జరగడానికి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కోర్ కమిటీలను ఏపీ డెయిరీ ఏర్పాటు చేసింది. జాయింట్ కలెక్టర్, డ్వామా పీడీ, డీఆర్డీఏ పీడీ, డీసీవో, సబ్ కలెక్టర్, పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్లు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. మహిళా పాల ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు, రైతులకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా పాడిపశువుల కొనుగోలు, సిబ్బందికి శిక్షణ వంటి కార్యక్రమాలను కోర్ కమిటీలు పర్యవేక్షిస్తాయి. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) పరిధిలో ఏర్పాటు కానున్న ఈ పాలసేకరణ కేంద్రాల నిర్మాణాలు, పాలలోని వెన్న శాతం గుర్తించడానికి, ఇతర పనులకు అవసరమైన యాంత్రిక పరికరాల సరఫరా, రూట్‌మ్యాప్‌ల ఖరారు వంటి ప్రధాన బాధ్యతలను ఇవి నిర్వహిస్తాయి. అదేవిధంగా ప్రతి 15 ఆర్బీకేలకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపగల అధికారులు, రైతుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలనే గట్టి నిబద్ధత కలిగిన అధికారులకు ఈ బాధ్యతలు అప్పగిస్తారు. పాల ఉత్పత్తిదారులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండి, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే ప్రధాన బాధ్యత వీరికి డెయిరీ అప్పగిస్తుంది. గ్రామాల్లో పశుపోషణ పట్ల రైతులందరికీ ఆసక్తి కలిగించడానికి, ఆ పోషణ చేసేందుకు ముందుకు వస్తున్న రైతులకు ప్రభుత్వం కల్పించనున్న సౌకర్యాలను గ్రామ సభల ద్వారా ప్రభుత్వం వివరించనుంది. భవిష్యత్‌లో పెరగనున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాడిపశువుల సంఖ్యను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. పాల ఉత్పత్తిదారులకు అనేక సౌకర్యాలు పాల ఉత్పత్తిదారులకు అనేక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. సేకరణ కేంద్రాలకు పాలు పోసిన రైతులకు ప్రతి 10 రోజులకు ఒకసారి నగదు చెల్లింపులు చేస్తాం. పాడి పశువులకు అవసరమైన దాణాను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతాం. పశువులకు సత్వర వైద్యం అందుబాటులోకి తీసుకువస్తాం. రెండు వేల లీటర్ల పాలను సేకరించడానికి అవకాశం ఉన్న గ్రామాల్లో ముందుగా పాల సేకరణ కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. పాలలోని వెన్నశాతం, నగదు చెల్లింపులు, ఇతర సేవలు అందించే విషయంలో పారదర్శకంగా ఉంటాం. పశు సంపదను ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న పేదల బతుకుల్లో వెలుగులు నింపడానికి చర్యలు తీసుకుంటున్నాం. – బాబు అహ్మద్, ఎండీ, ఏపీ డెయిరీ -
కల్తీ పాల వ్యవహారంపై హైకోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్: కల్తీ పాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ‘పాలు కాదు.. పచ్చి విషం’శీర్షికతో సాక్షి పత్రికలో గత ఏడాది డిసెంబర్ 12న ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా (పిల్) పరిగణనలోకి తీసుకుంది. సాక్షి కథనాన్ని చదివిన నల్లగొండకు చెందిన పాఠకుడు కె.నర్సింహారావు లేఖ రూపంలో కల్తీ విషయాన్ని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ దృష్టికి తీసుకొచ్చారు. కాగా, ఈ వ్యాజ్యంలో పశు సంవర్ధక, డెయిరీ డెవలప్మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి, డెయిరీ డెవలప్మెంట్ లిమిటెడ్ ఎండీ, ఫుడ్ సేఫ్టీ లేబొరేటరీ చీఫ్ పబ్లిక్ అనలిస్ట్‌ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై ఈ నెల 30న ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ గ్రేటర్ హైదరాబాద్‌లో సాక్షి బృందం పర్యటించి పలు కంపెనీల పాల ప్యాకెట్ల శాంపిల్స్‌ను సేకరించింది. వాటిని నాచారంలోని రాష్ట్ర ప్రభుత్వ ఆహార పరీక్షా కేంద్రంలో పరీక్షలు చేయించింది. ఈ పాలు హానికరమని, ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే రసాయనాలను పాలల్లో కలుపుతున్నారని పరీక్షల్లో తేలింది. ‘ఇలాంటి పాలను వినియోగిస్తే టైఫాయిడ్, డయేరియా, గ్యాస్ట్రో ఎంటరైటిస్.. వంటి రోగాల బారినపడే ప్రమాదం ఉంది’అని సాక్షి కథనంలో వచ్చిన అంశాలను పిటిషనర్ తన లేఖలో పేర్కొన్నారు. -
పాడి అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి
చెన్నూర్ : జిల్లాలో పాడి అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. పాడి అభివృద్ధి కోసం ప్రతిపాదనలు పంపించాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. యాక్షన్ ప్లాన్ పంపించాలని మండల సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ (పాల శీతలీకరణ కేంద్రం) నిర్వాహకులకు సూచించింది. పాడి రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో 2003లో జిల్లాలో 11 పాల శీతలీకరణ కేంద్రాలు ప్రారంభించారు. పాడి సంపద అంతరిస్తుండడంతో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, ఉట్నూర్, బోథ్, ఇచ్చోడలోని పాలడెయిరీ కేంద్రాలు మూతపడ్డాయి. ఆదిలాబాద్, నిర్మల్, లక్సెట్టిపేట, చెన్నూర్, భైంసా, కడెం మండలాల్లో కొనసాగుతున్నాయి. వీటి ద్వారా ప్రస్తుతం మూడు నుంచి నాలుగు వేల లీటర్ల పాల సేకరిస్తున్నారు. దీంతో వెయ్యి మందికి పైగా రైతులకు ఉపాధి లభిస్తోంది. రైతుకు మేలు.. పాడి సంపద అభివృద్ధితోనే రైతులకు మేలు జరుగుతోందని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం రైతులకు డీఆర్డీఏ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గేదెలు, ఆవులు మంజూరు చేసి 20 వేల లీటర్ల పాలు సేకరించాలని సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పాల డెయిరీ జిల్లా మేనేజర్ గజ్జరామ్ తెలిపారు. పాడి సంపదను అభివృద్ధి చేస్తే జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు వేల మందికి లాభం చేకూరడంతోపాటు ఉపాధి మెరుగయ్యే అవకాశాలున్నాయి. పాల డెయిరీల ఆధునికీకరణ పాల డెయిరీల బలోపేతంలో భాగంగా జిల్లాలోని పాలడెయిరీలను ఆధునికరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో పాల సామర్థ్యాన్ని పాల డెయిరీలో పనిచేసే ఉద్యోగులు పరీక్షించే వారు. ఈ పద్ధతికి స్వస్తి పలికి ఈఎంటీ(ఎలక్ట్రానిక్ మెనికో టైసర్) ద్వారా పాలను పరీక్షించాలని పరికరాలు పంపిణీ చేయనుంది. అవసరమైనంత మంది బాలమిత్రలను ఎంపిక చేసి గౌరవ వేతనంతోపాటు ఇన్సెంటివ్ ఇవ్వనుంది. -
చూడితోనే పాడి
* పశుపోషణలో పౌష్టికాహారం, పరిశుభ్రతే ముఖ్యం * హవేళీఘనపూర్ ఎల్ఎస్ఏ సలావుద్దీన్ పాడి అభివృద్ధిలో.. పశువులు క్రమం తప్పకుండా చూడి కట్టడం అత్యంత ప్రధానమైన అంశమని హవేళీఘనపూర్ వెటర్నరీ లైవ్‌స్టాక్ అసిస్టెంట్ (ఎల్ఎస్ఏ) సలావుద్దీన్(సెల్: 9908696833) తెలిపారు. సహజంగా 75శాతం పాడి గేదెలు, ఆవులు సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మాసాల మధ్య ఎదకు వస్తాయని చెప్పారు. ఈ సమయాన్ని బ్రీడింగ్ సీజన్ అంటారన్నారు. ఈ కాలంలో చూడి కట్టని మూగజీవాలు సక్రమంగా ఎదకు రావ ని స్పష్టం చేశారు. దీంతో ఎలాంటి లాభం లేకుండా వీటిని ఏడాది పొడవునా పోషించాల్సి ఉంటుందన్నారు. ఇలా కాకుండా రైతులు, పశు పోషకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. - మెదక్ రూరల్ సకాలంలో ఎదను గుర్తించాలి * పాడి పశువులు చూడి కట్టడం అనేది అవి ఎదకు వచ్చిన సమయాన్ని గుర్తించడంపై ఆధారపడి ఉంటుంది. * ఎదకు వచ్చిన పశువు అరవడం, తెల్లని తీగలు వేయడం, యోని ఉబ్బడం, మేత సరిగ్గా మేయకపోవటం, పాలు తగ్గటం, నిలకడగా ఉండకపోవడం, అదేపనిగా మూత్రం పోయడం, ఇతర పశువులపైకి ఎక్కడం వంటివి చేస్తుంటాయి. * వేసవిలో ఎద లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. * ముర్రా, బ్రీడెడ్ జాతి గేదెలు ఎదకు వచ్చినా ఎలాంటి లక్షణాలను ప్రదర్శించవు. దీన్ని మూగ ఎద అంటారు. * ఈ లక్షణాలను వేకువజామున సులభంగా గుర్తించవచ్చు. * మూగ ఎదను గుర్తించడానికి దున్నపోతును ఉపయోగించవచ్చును. సరైన పోషణ ఉండాలి * బ్రీడింగ్ సీజన్లో ప్రతీ పాడి గేదెపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. * తొలకరి వర్షాలకు పెరిగే పచ్చగడ్డి పశువుల్లో పోషక విలువలను గణనీయంగా పెంచుతుంది. * ఈ సమయంలో ప్రతీ పశువుకు రోజుకు 30 నుంచి 40 కిలోల పచ్చిగడ్డి మేతగా వేయాలి. * ఇందులోని విటమిన్-ఏ పశువు ఎదకు రావడానికి, గర్భం ఆరోగ్యంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. * పచ్చిగడ్డి సరిగ్గా మేయలేని పశువుకు రోజుకు కిలో దాణా వారానికొకసారి విట మిన్ యూనిట్ల ఇంజక్షన్లు ఇప్పించాలి. * రోజుకు 25నుంచి 50 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమం ఇవ్వాలి. * పోషణ సక్రమంగా ఉన్న పశువులు క్రమం తప్పకుండా ఎదకు వస్తాయి. ఈ జాగ్రత్తలు తప్పనిసరి * ఎద ఇంజక్షన్ చేయించిన అనంతరం 45 నుంచి 60 రోజుల మధ్య చూడి నిర్ధారణ పరీక్షలు చేయించాలి. * ఒక్కో గేదె 10 ఈతల వరకు ఈనుతుంది. 7ఈతల తర్వాత పాలఉత్పత్తితగ్గుతుంది. * చూడి నిర్ధారణ జరిగాక పశువుకు పౌష్టిక ఆహారం అందించాలి. * పచ్చగడ్డి, ఖనిజ లవణాలు, విటమిన్లు అధికంగా ఉండే మేతను పశువుకు వేయాలి. * సాధారణ రోజుల కంటే చూడి కాలంలో ఒకటినుంచి రెండు కిలోల అదనపు దాణా అందించాలి. * సరైన పోషణ లేకపోతే చూడికాలం పూర్తవకుండానే దూడ పుట్టే అవకాశాలు ఉన్నాయి. * ఇలా జరిగిందంటే పుట్టిన దూడ బలహీనంగా ఉండటంతో పాటు వ్యాధి నిరోధ క శక్తిలేక మరణించే ప్రమాదం ఉంటుంది. చల్లని ప్రదేశంలో కట్టేయాలి * ఆవులు, గేదెల ఎద కాలం ఒకటి నుంచి రెండు రోజులు మాత్రమే ఉంటుంది. * పశువు యోని వెంట పచ్చని నీటి లాంటి తీగలు పడుతుంటాయి. * ఇది గమనించి పశువు వెన్నుపై నిమిరితే తోక కొంచెం పైకిత్తుతుంది. * ఈ లక్షణాలను గుర్తించి పశువు ఎదకు వచ్చిందని గుర్తించాలి. * చూడి కట్టించేటప్పుడు పశువును శుభ్రంగా కడగాలి. * ముఖ్యంగా మానం చుట్టూ పేడ, మట్టి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. * ఎదకు వచ్చిన గేదె, ఆవులను ఆరోగ్యవంతమైన, మేలురకం దున్నపోతు, కోడెతో క్రాస్ చేయించాలి. * పదేళ్ల వయస్సు దాటిన దున్నపోతులు, కోడెలను చూడి కట్టించేందుకు ఉపయోగించవద్దు. * ఎదను గుర్తించిన తర్వాత గేదెలు, ఆవులను పశువైద్యశాలకు తీసుకెళ్లి సిమన్ వేయించాలి. * ఒకేసారి రెండు ఇంజక్షన్లు కాకుండా 5నుంచి 6గంటల వ్యవధిలో రెండు సూదులు వేయించాలి. * చూడి కట్టించిన రోజున సదరు గేదె, ఆవును బయటకు వదలకూడదు. * చల్లని, పరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో కట్టేయాలి. * ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో శుభ్రంగా కడగాలి.