సదస్సును ప్రారంభిస్తున్న కేంద్రమంత్రి పురుషోత్తం రుపాలా. చిత్రంలో కేంద్ర మంత్రులు బాల్యన్, మురుగన్, రాష్ట్ర మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: పశుసంవర్థక రంగం మరింత అభివృద్ధి సాధించేలా కృషి చేస్తామని కేంద్ర మత్స్య, పశు సంవర్థక, పాడి పరిశ్రమల శాఖల మంత్రి పురుషోత్తం రూపాలా అన్నారు. రైతులు, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించే ఈ రంగాన్ని లాభదాయకంగా మార్చడానికి కేంద్రం అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు, స్టార్టప్ ఇండియా, సీఐఐ సహకారంతో కేంద్ర పశుసంవర్థ, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ స్టార్టప్ సదస్సులో మంత్రి మాట్లాడారు.
వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడిపరిశ్రమ అభివృద్ధితో రైతులు తమ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవడానికి వీలవుతుందన్నారు. పశుసంవర్ధక రంగంలో పెట్టుబడులు మరింత పెరగాలని అభిప్రాయపడ్డారు. కేంద్రమంత్రులు బాల్యన్, మురుగన్ మాట్లాడుతూ శాస్త్రీయ చర్యలతో పశుసంవర్ధక రంగంలో మార్పులు తీసురావడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రపంచ మాంసం ఎగుమతుల రంగంలో భారతదేశం 8వ స్థానం, గుడ్ల ఎగుమతుల రంగంలో 3వ స్థానంలో ఉందని వివరించారు.
గణనీయంగా పెరిగిన గొర్రెల సంపద
రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో పాడి రంగానికి అనేక విధాలుగా చేయూతనిస్తున్నామని అన్నారు. గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్ల పంపిణీ చేయడంతో రాష్ట్రంలో గొర్రెల సంపద గణనీయంగా పెరిగిందని తెలిపారు. గ్రామాల్లో అత్యధికులు పాడి పరిశ్రమ, జీవాల పెంపకంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, వారికి మరింత చేయూతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ చైర్మన్ సోమా భరత్ కుమార్, షీప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, ఇతర ఉన్నతాధికారులు వర్ష జోషి, రాజేష్ కుమార్ సింగ్, లచ్చిరాం భూక్యా, పెద్ద ఎత్తున పాడి రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment