చూడితోనే పాడి | livestock in nutrition, hygienic important | Sakshi
Sakshi News home page

చూడితోనే పాడి

Published Thu, Oct 16 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM

చూడితోనే పాడి

చూడితోనే పాడి

* పశుపోషణలో పౌష్టికాహారం, పరిశుభ్రతే ముఖ్యం
* హవేళీఘనపూర్ ఎల్‌ఎస్‌ఏ సలావుద్దీన్

పాడి అభివృద్ధిలో.. పశువులు క్రమం తప్పకుండా చూడి కట్టడం అత్యంత ప్రధానమైన అంశమని హవేళీఘనపూర్ వెటర్నరీ లైవ్‌స్టాక్ అసిస్టెంట్ (ఎల్‌ఎస్‌ఏ) సలావుద్దీన్(సెల్: 9908696833) తెలిపారు. సహజంగా 75శాతం పాడి గేదెలు, ఆవులు సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మాసాల మధ్య ఎదకు వస్తాయని చెప్పారు. ఈ సమయాన్ని బ్రీడింగ్ సీజన్ అంటారన్నారు. ఈ కాలంలో చూడి కట్టని మూగజీవాలు సక్రమంగా ఎదకు రావ ని స్పష్టం చేశారు. దీంతో ఎలాంటి లాభం లేకుండా వీటిని ఏడాది పొడవునా పోషించాల్సి ఉంటుందన్నారు. ఇలా కాకుండా రైతులు, పశు పోషకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.  - మెదక్ రూరల్
 
సకాలంలో ఎదను గుర్తించాలి
* పాడి పశువులు చూడి కట్టడం అనేది అవి ఎదకు వచ్చిన సమయాన్ని గుర్తించడంపై ఆధారపడి ఉంటుంది.
* ఎదకు వచ్చిన పశువు అరవడం, తెల్లని తీగలు వేయడం, యోని ఉబ్బడం, మేత సరిగ్గా మేయకపోవటం, పాలు తగ్గటం, నిలకడగా ఉండకపోవడం, అదేపనిగా మూత్రం పోయడం, ఇతర పశువులపైకి ఎక్కడం వంటివి చేస్తుంటాయి.
* వేసవిలో ఎద లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి.
* ముర్రా, బ్రీడెడ్ జాతి గేదెలు ఎదకు వచ్చినా ఎలాంటి లక్షణాలను ప్రదర్శించవు. దీన్ని మూగ ఎద అంటారు.  
* ఈ లక్షణాలను వేకువజామున  సులభంగా గుర్తించవచ్చు.
* మూగ ఎదను గుర్తించడానికి దున్నపోతును ఉపయోగించవచ్చును.
 
సరైన పోషణ ఉండాలి
* బ్రీడింగ్ సీజన్‌లో ప్రతీ పాడి గేదెపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
* తొలకరి వర్షాలకు పెరిగే పచ్చగడ్డి పశువుల్లో పోషక విలువలను గణనీయంగా పెంచుతుంది.
* ఈ సమయంలో ప్రతీ పశువుకు రోజుకు 30 నుంచి 40 కిలోల పచ్చిగడ్డి మేతగా వేయాలి.
* ఇందులోని విటమిన్-ఏ పశువు ఎదకు రావడానికి, గర్భం ఆరోగ్యంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.
* పచ్చిగడ్డి సరిగ్గా మేయలేని పశువుకు రోజుకు కిలో దాణా వారానికొకసారి విట మిన్ యూనిట్ల ఇంజక్షన్లు ఇప్పించాలి.
* రోజుకు 25నుంచి 50 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమం ఇవ్వాలి.
* పోషణ సక్రమంగా ఉన్న పశువులు క్రమం తప్పకుండా ఎదకు వస్తాయి.
 
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
* ఎద ఇంజక్షన్ చేయించిన అనంతరం 45 నుంచి 60 రోజుల మధ్య చూడి నిర్ధారణ పరీక్షలు చేయించాలి.
* ఒక్కో గేదె 10 ఈతల వరకు ఈనుతుంది. 7ఈతల తర్వాత పాలఉత్పత్తితగ్గుతుంది.
* చూడి నిర్ధారణ జరిగాక పశువుకు పౌష్టిక ఆహారం అందించాలి.
* పచ్చగడ్డి, ఖనిజ లవణాలు, విటమిన్లు అధికంగా ఉండే మేతను పశువుకు వేయాలి.
* సాధారణ రోజుల కంటే చూడి కాలంలో ఒకటినుంచి రెండు కిలోల అదనపు దాణా అందించాలి.
* సరైన పోషణ లేకపోతే చూడికాలం పూర్తవకుండానే దూడ పుట్టే అవకాశాలు ఉన్నాయి.
* ఇలా జరిగిందంటే పుట్టిన దూడ బలహీనంగా ఉండటంతో పాటు వ్యాధి నిరోధ క శక్తిలేక మరణించే ప్రమాదం ఉంటుంది.
 
చల్లని ప్రదేశంలో కట్టేయాలి
* ఆవులు, గేదెల ఎద కాలం ఒకటి నుంచి రెండు రోజులు మాత్రమే ఉంటుంది.
* పశువు యోని వెంట పచ్చని నీటి లాంటి తీగలు పడుతుంటాయి.
* ఇది గమనించి పశువు వెన్నుపై నిమిరితే తోక కొంచెం పైకిత్తుతుంది.
* ఈ లక్షణాలను గుర్తించి పశువు ఎదకు వచ్చిందని గుర్తించాలి.
* చూడి కట్టించేటప్పుడు పశువును శుభ్రంగా కడగాలి.
* ముఖ్యంగా మానం చుట్టూ పేడ, మట్టి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* ఎదకు వచ్చిన గేదె, ఆవులను ఆరోగ్యవంతమైన, మేలురకం దున్నపోతు, కోడెతో క్రాస్ చేయించాలి.
* పదేళ్ల వయస్సు దాటిన దున్నపోతులు, కోడెలను చూడి కట్టించేందుకు ఉపయోగించవద్దు.
* ఎదను గుర్తించిన తర్వాత గేదెలు, ఆవులను పశువైద్యశాలకు తీసుకెళ్లి సిమన్ వేయించాలి.
* ఒకేసారి రెండు ఇంజక్షన్లు కాకుండా 5నుంచి 6గంటల వ్యవధిలో రెండు  సూదులు వేయించాలి.
* చూడి కట్టించిన రోజున సదరు గేదె, ఆవును బయటకు వదలకూడదు.
* చల్లని, పరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో కట్టేయాలి.
* ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో శుభ్రంగా కడగాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement